4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 10*


            *శ్లో:- ఆచార్యాత్ పాద మాదత్తే* ౹

                   *పాదం శిష్య స్స్వమేధయా* ౹

                   *పాదం సహచరై స్సాకమ్* ౹

                   *పాదం కాల క్రమేణ చ* ౹౹

                                         *****

*భా:- వయో నిమిత్తం లేకుండా మనం ఒక విద్యలో ప్రావీణ్యంతో పారంగతులము అవ్వాలంటే దానికి 4 అధ్యయన సోపానాలు ఉన్నాయి. 1. గురువుగారు ఎంత గొప్పగా పాఠం చెప్పినా, వెంటనే ఒక పావు వంతు మాత్రమే మన బుర్రకెక్కుతుంది. 2. మనం ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తులతో స్వయంగా మేథోమథనం చేయడం వల్ల మరో పావువంతు అవగతమవుతుంది.3. అధ్యయన శీలురైన తోటి విద్యార్థులతో సాంగోపాంగంగా , కూలంకషంగా చక్కగా చర్చించడం వల్ల మరోపావువంతు అవగాహన అవుతుంది. 4. అలా నేర్చుకున్న విద్యను నిరంతరం మననం చేసుకొంటూ, కాలక్రమేణ ఆచరణలో పెడుతూ, అనుభవంలో పదిమందికి పంచడం ద్వారా దానిపై పూర్తి సాధికారికత, సమగ్రత సిద్ధిస్తుంది. "విద్యా శీలేన శోభతే" అంటారు. మానవీయ విలువలు శీలము, సత్య,ధర్మ,శాంతి,ప్రేమ,అహింసలను గురువు వలన వింటాము. స్వీయ అధ్యయనం చేస్తాము. సమాజంలో చూస్తాము. గమనిస్తాము. వానిలో పరిపూర్ణత సాధించాము అనుకొంటే పొరపాటే. మనం జీవితాంతం అనుక్షణం, అడుగడుగునా క్రమశిక్షణతో, త్రికరణశుద్ధితో ఆచరించినపుడే ఆ విలువల సాధనకు ఒక అర్థము, పర మార్థము చేకూరుతుంది. సార్ధకత ఒనగూడుతుంది. చివరగా "పాదం కాలక్రమేణ చ" అనడంలో గల ఇంతటి మహత్తర సందేశాన్ని గ్రహించి, పురోగమించాలని సారాంశము*. 

                                    *****

                      *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: