4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*🌷పంకజం పదనిసలు:20🌷*



*🌷బొమ్మా ..బొరుసూ🌷* 

              🌷🌷🌷

పగలు పది గంటలవేళ ...నాపాటికి నేను కూరగాయలకు శుభమా అని మంగళ స్నానాలు చేయిస్తుంటే ..."ఏవోయ్! కాస్త డికాషన్ తక్కువేసీ ...పందారెక్కువేసీ ...ఓ కప్పు కాఫీ ఇస్తావూ ..."హాల్లోంచి శ్రీవారికేక. 


"ఇదిగో వచ్చే వచ్చే ..." అంటూ అరగంటలో చేతిలోపని పూర్తి చేసుకుని, కాఫీకప్పుతో వచ్చిన నన్ను ఘోర తపస్సులాంటిదేదో చేయగా ...చేయగా ప్రత్యక్షమైన దేవతను చూసినట్లుగా చూసి, ఆనందంగా అమృత భాండం అందుకున్నత జాగ్రత్తగా కప్పందుకుని, జుర్రుమని సౌండొచ్చేలా ఒకసిప్పు తాగి, "అబ్బ ! ఇలాగే ష్ట్రాంగ్ గా , షుగర్ తక్కువగా కాఫీ తాగాలనిపించి , కావాలనే అలా చెప్పా " అన్నారు. 


    "మీరెలా చెప్పినా నేనలాగే చేస్తానుకానీ ...ఇవ్వాళ వంటేమిటీ ? " అనడిగాను. "నేనేమడిగినా నువ్వుచేసేదేదో అదే చేస్తావుగా మళ్ళీ నన్నడగటం ఎందుకూ " అన్నారు. "భలేవారే ! భార్యగా అదినా ధర్మం " అన్నాను. 


టీ వీ లో వార్తలు వస్తున్నాయి. కరోనా చాలావరకూ తగ్గుముఖం పడుతోందనీ , తీవ్రత చాలా తగ్గిపోయిందనీ చెబుతున్నారు. 


     "మరి మన బంధువర్గం లోనూ , స్నేహితుల్లోనూ చనిపొయిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ సంగతీ ..".అన్నాను. 


     "అలా అనకూడదు మనం భయపడతామని గవర్నమెంటు అలా చెబుతుంది అంతే ...ఈ మధ్య చూసావా కరోనా వార్తలు చాలా తగ్గిపోయాయీ .."అన్నారు. 


   "నిజమే సుమీ! కరోనా భయం నుండి ప్రజలను దూరంగా ఉంచుతున్నారు. కేసులు లేక కాదు మనకు తెలియట్లేదంతే " అనుకున్నాం. 


    ఇంతలో పంకజం వార్తమోసుకొచ్చింది. మా వీధిలో పెద్దాయన చనిపోయింది కరోనాతో కాదట ! హార్టెటాక్ తో నట. "నిజమేనా " అన్నాను అనుమానంగా ..."నిజమేలే అన్నిటికీ భయపడకూ " అని ధైర్యం చెప్పింది. 


    "వంటకు చాలా టైముందిగా ..ఈ లోగా మంచి సినిమాచూద్దాం. తోడులేకపోతే హుషారుండదు బోర్కొట్టేస్తుంది " అన్నారు. నేనూ అమాయకంగా .."ఆహా !ఏమి నాభాగ్యమూ ..." అనుకుంటూ సోఫాలో సెటిలయ్యాను. 


   " కావాల్సినంత సమయం దొరికిందికదా పాతసినిమాలు చూద్దాం " అన్నారు. పంకజం కూడా వచ్చి నా పక్కనే కూర్చుంది "ఏం సినిమా " అనుకుంటూ. 


   "ఇప్పుడే వచ్చేస్తా బియ్యం నానేసి " అంటూ వంటింటివైపు వెళ్ళాను 


    సినిమా ఏదోగానీ ...నే వచ్చేసరికే మొదలైపోయింది. దట్టంగా అరచేతి మందాన మేకప్పేసుకొని , గొర్రె తలకాయలాంటి విగ్గేసుకొని, రేబాను కళ్ళద్దాలు పెట్టుకుని , మంచి నీలం రంగు అర్మాణీ సూటేసుకుని ఉన్నాడు హీరో ! 


    మల్టీ మిలియనీరు కోడుకో ,మంచి బిజినెస్ మాగ్నేటో అని పొరబడేలోపు లారీ డ్రైవరునని చెప్పి నా కళ్ళు తెరిపించాడు. 


    ఇంతలో మంచి కాస్ట్లీ డెన్లో వంటిమీద వేసుకున్న బనీన్లకే తీసి పిండితే బకెట్టు చెమటకారే ఇండియాలో ...మాంచి దట్టమైన ఫర్ కోటూ ,పులిచెర్మం కాంబినేషన్ లో విచిత్రమైన ఆహార్యం తో విలనూ ...అన్నట్లు చేతిలో పడగ విప్పిన పెంపుడు పాము కూడా ఉందండోయ్. 


    ఇంకాసేపటికి ఆ హీరో తన మనవరాలి వయసున్న హీరోయిన్ తో మంచమ్మీది గళ్ళ దుప్పటి తీసుకొచ్చి , చేటంత కాలర్ తో కుట్టిన గళ్ళ సూటేసుకుని , ముందో పాతికా , వెనకో పాతిక కేజీల ఎగష్ట్రా బరువేసుకుని ఏదో పాట పాడుతూ ...పాలబుగ్గల పసితనం ఇంకా పోని ఆ అమ్మాయిని డాన్స్ పేరుచెప్పి మోకాళ్ళతో , చేతులతో కుమ్మేస్తున్నాడు. " ఆపెయ్యండి బాబూ ...ఈ చిత్ర హింస చూడలేక పోతున్నా " అని దణ్ణం పెట్టేసాను. 


పంకజం నవ్వుతూ .. "నిజంగానే ....'చిత్ర హింస' " అంది . "బాలేదా... సరే ఇంకాస్త పాతసినిమా చూద్దాం "అన్నారు. "బాబోయ్ నాకు వంటకు టైమైంది" అంటున్నాకూడా " చేద్దువు గానిలే ...కూచో " మని మొహమాట పెట్టేసారు. 


   అసలు కాళ్ళకి ఏమైనా వస్త్రం ఉందలేదో అని భయపడేలా స్కిన్ కలర్ లెగ్గిన్ వేస్కోని ,పైన కుచ్చులున్న పొట్టి కుర్తీ వేసుకోని అక్కడక్కడే గుర్రమ్మీద తిరుగుతూ హీరో ....


       బ్రహ్మాండమైన సిల్కు డిజైనర్ డ్రస్సులూ , అద్దిరిపోయే మేకప్పూ వేసుకుని అడివి పిల్లనని గుర్తుగా రెండు కోడీకలు కొప్పులో తురుముకుని , గవ్వల నగలసెట్టు పెట్టుకొని నాలుగంగుళాలు పొడవున్న ఆర్టిఫీషియల్ కనురెప్పలు రెపరెప లాడిస్తూ ...మైసూర్ బోండాలా గుండ్రంగా ఉన్న హీరోయినూ కనువిందు చేస్తున్నారు. 


     కాసేపు రాజభవనం లోంచి అడివిలోకీ ...అడివిలోనించి రాజభవనం లోకీ తిరిగీ తిరిగీ కధ రకరకాల మలుపులతో ముందేం జరిగిందో మర్చిపోయేలా ఉంది. హీరో మాత్రం మధ్యమధ్యలో గుర్రమెక్కి ఆడీ కారుకంటే స్పీడుగా పరుగెత్తిస్తూనే ఉన్నాడు. 


      అందులోపడి ఏంచూశామో ఎంతసేపు చూశామో తెలియనే లేదు. టైం చూస్తే రెండైపోయింది!!! అయ్యో !వంటకూడా చెయ్యలేదని హడావుడిగా లేవబోతుంటే అత్తగారు "నేను చేసేసాలేమ్మా వంట" అన్నారు. 


      నేను ఆశ్చర్యం గా చూస్తుంటే ..."ఈ రోజు వంకాయి కూరకారం కూరా , చింతకాయ పచ్చడీ చెయ్యమన్నాలే " అన్నారుమావారు. నిన్న ఇదేమెనూ చెబితే బద్ధకించి మావిడికాయ పప్పూ , సొరకాయ కూరతో సర్దేసాను. 


     " హన్నా ! ఇది మీప్లానా నన్ను సినిమాముందు కూచోబెట్టి నచ్చిన వంట చేసేసుకున్నారా " అన్నాను. 


     " అచ్చం గవర్న మెంటులానే. ఆదాయం కోసం ఏమీలేదంటూ స్కూళ్ళూ ,మాళ్ళూ , హాళ్ళూ ఓపెన్ చేసేసి ...ఆనక తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు, ప్రజలబాధలు ప్రజలవీ " అన్నాను.  


      ఈయనా పంకజం నవ్వుతుంటే ..." చాల్లెండి సంబరం! నిన్నటినుండీ నాలుగు కధల ప్లాట్లు బుర్రలో తిరుగుతున్నాయ్. ఈ సినిమాలపుణ్యమాని మొత్తం పోయినయ్ బుర్ర ఖాళీ " అన్నాను విచారంగా. 


     " కధలకేం బోలెడు వస్తాయిలే ...మీ ఆయన చెప్పే కధలన్నీ రోజుకొకటి రాసెయ్ " నవ్వుతూ వెళ్ళిపోయింది పంకజం. 

            🌷🌷🌷

 *పద్మజ కుందుర్తి* .

కామెంట్‌లు లేవు: