4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

 *శ్రీమాత్రేనమః*




*84వ నామ మంత్రము*


*ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః*


తనపై (పార్వతీ దేవిపై) మోహం కలిగేలా పరమశివునిపై సుమశరములు ప్రయోగించిన మన్మథుని పరమశివుడు తన ఫాలనేత్రాగ్నితో భస్మంచేయగా, రతీదేవికి వైధవ్యమును బాపుటకై తిరిగి మన్మథుని సజీవుని చేసి, మన్మథుని పాలిట సంజీవనౌషధిగా ఒప్పారిన జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ పరమేశ్వరిని ఉపాసించు ఉపాసకునకు ఆ తల్లి ఆయురారోగ్యములు పుష్కలంగా ప్రాప్తింపజేసి, సుఖసంతోషాలతో జీవనము కొనసాగేలా కరుణించి, ఆ సాధకుడు ఆధ్యాత్మిక చింతనయందు తరింపజేయును.


ఈ నామ మంత్రములో పరమశివుని ఆగ్రహము గలదు అలాగే పరమేశ్వరి అనుగ్రహము కూడా గలదు.


పార్వతీ దేవి మహాశివుని వివాహమాడడానికి తపస్సు చేస్తుంది. పార్వతీ పరమేశ్వరులను వివాహబంధంతో కలపడానికి, పరమశివునిలో పార్వతీ దేవికి మోహము కలిగేలా చేయాలి గనుక పరమశివునికి పార్వతీ దేవిపై మోహం కలిగేలా చేయడానికి మహేంద్రుడు మన్మథుని ఆజ్ఞాపిస్తాడు. ఆ చెఱకు విలుకాడు ఆ ప్రయత్నంలో శివుని ఫాలనేత్రాగ్నికి ఆహుతి అయి శరీరాన్ని కోల్పోతాడు. రతీదేవి తన భర్తకోసం విలపిస్తూ పార్వతిని పతిభిక్ష పెట్టమని కోరుతుంది. అయ్యవారి కోపాగ్ని సంగతి అమ్మవారికి తెలిసి, అయ్యవారి కోపం తాటాకు మంట అని కూడా తెలుసు. అలాగే అమ్మవారు క్షిప్రప్రసాదిని (ఓం క్షిప్రప్రసాదిన్యై నమః - శ్రీలలితా సహస్రం నామావళిలో 869వ నామ మంత్రము) అనగా అమ్మా అని ఆర్తితో పిలిస్తే చటుక్కున వచ్చే తల్లిలాగ, భక్తిప్రపత్తులతో ఆరాధిస్తే వరాలు కురుపించే దేవతలాగ, కొండల్లో *నన్నువిడువకు* అని ఎలుగెత్తి అరిస్తే తిరిగి *నన్ను విడువకు* అనే ప్రతిధ్వనిలాగ భక్తులను అనుగ్రహించు మహాజనని వెంటనే మన్మథుని సజీవుని చేస్తుంది. కాని అతడు అనంగుడు. అనగా శరీరంలేనివాడు. మన్మథుడు సజీవుడైనా అనంగుడు కావడానికి కారణం ఉంది. పరమశివుని కోపాగ్నికి మన్మథుడు కాలి బూడిద అయిపోతే ఆ బూడిదతో గణేషుడు భండాసురుని సృష్టించాడు. ఆ భండాసురుని అమ్మవారు సంహరించింది. అందుచేత సజీవుడైన మన్మథుడు అనంగుడయాడు. సజీవుడయిన మన్మథుడు అనంగుడవడంతో రతీదేవికి వైధవ్యం తొలగినా అనంగుడైన మన్మథుని గూర్చి మరింత విలపించగా, రతీదేవికి మాత్రం మన్మథుడు సశరీరంగా కనబడేటట్లు వరమిస్తుంది. ఆనాటి నుండి మన్మథుడు అనంగుడు. కాని రతీదేవికి మాత్రం కనబడతాడు. ఈవిధంగా తండ్రి శిక్షిస్తే తల్లి పిల్లవాడిని సముదాయించుట ఈ కథలో అమ్మవారు తల్లిపాత్ర పోషించినది.


ఈ నామ మంత్రంలో *హరుడు* అనగా శివుడు. ఆయన త్రినేత్రుడు. కుడికన్ను సూర్యాత్మకము, ఎడమకన్ను చంద్రాత్మకము. ఫాలనేత్రం అగ్ని తత్త్వం గలది. అందుకే శివునికి కోపంవస్తే ఫాలనేత్రం తెరిస్తే కాలాగ్నిజ్వాలలు వెడలి వస్తాయి. తన తపస్సుకు భంగం కలిగించిన కాముని (మన్మథుని) పై కోపంప్రదర్శిస్తూ ఫాలనేత్రం తెరిచాడు. అంతే మన్మథుడు భస్మమయాడు. ఇక పరమశివుని ఎడమ కన్ను చంద్రాత్మకం అన్నాం గదా. ఆ భాగం అమ్మవారిది. అమ్మవారు చల్లనితల్లి. అందుకే అమ్మవారు *హరనేత్రాగ్నిసందగ్ధ కామ సంజీవనౌషధిః* అయి మన్మథుని సజీవుని చేసింది. శివుని ఫాలనేత్రం వద్ద ఆజ్ఞాచక్రం గలదు. కామంతో కళ్ళుమూసుకుపోతే శివుని మూడోకన్ను (ఆజ్ఞాచక్రం ఫాలభాగంలో ఉంది గనుక) జ్ఞానసంకేతమైనది. కామాన్ని నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదించింది.  


హరుని నేత్రాగ్నిలో కాముడు దగ్ధముకాగా, ఆ కాముని (మన్మథుని) సజీవుని జేసి జగన్మాత ఆ మన్మథుని పాలిట సంజీవనీ ఔషధమయినది. అందుకే అమ్మవారు *హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః* అని నామ ప్రసిద్ధ అయినది.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: