4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

🌷బాపూ! నీకేంటి చెప్పూ🌷*

 

వెన్నెల్లో ఆరుబయట

పట్టెమంచమ్మీద

మెత్తటి పరుపూ, గళ్ళదుప్పటీ, బూరుగుదూది తలగడాలూ, మళ్ళా, 

ఆ గలీబుల మీద

అందంగా లేసులల్లిన

*‘స్వీట్ డ్రీమ్స్'*_ అనే అక్షరాలు

మత్తెక్కించే మరువం,

దహించివేసే దవనం.


సాయంకాలం తీరిగ్గా కట్టుకున్న సన్నజాజి మొగ్గల దండా, ఒంటికి పూసుకున్న

పాండ్స్ పౌడరూ, మధ్యరాత్రి

దాహఁవేస్తే, మరచెంబుతో

మంచినీళ్ళూ, ఇలా సెట్టింగులేసి

రెచ్చగొట్టేస్తావు!

నీకు తోడు ఆ కెమేరావాళ్ళూ,

అలాంటివాళ్ళే దొరుకుతారు నీకు.

కొబ్బరాకుల్లోంచి చందమామనీ,

విరబోసుకున్న జుట్టులోంచి

ఆపిల్ల ముఖాన్నీ

చూపించీ చూపించకండా

చంపొదిలిపెడతారు!

కోపాలొస్తే

కళ్ళతో బాణాలెయ్యడాలూ,

అలకలొస్తే

జడతో జాడించెయ్యడాలు,

అరిపాదాల్లో గోరింటాకులు,

మూసినా బానేవుండే కళ్ళు,

ఇలా సాగుతూనే వుంటుంది నీ యవ్వారం!

అందరూ నువ్వేసిన బొమ్మల్లానూ,

మన రవణ రాసిన

సీతల్లానూ వుండరు సామీ!

రెండుజెళ్ళ కాలఁవా ఇదీ ?

అన్నీ డిప్పలే!

పొద్దుకాదది

నీముద్దుమోమున దిద్దిన

కుంకుమ తిలకమే సుమా!

అనిపాడితే..

‘ఇక్ష్వాకుల కాలందానివా

'ఈకాలందానివా?'

అనడుగుతున్నారు సామీ

బొట్టెట్టుకోమని బొట్టెట్టి చెప్పాల్సొస్తోంది.

గలగలమనే గాజుల చప్పుడు,

ఘల్లుఘల్లున గజ్జెల చప్పుడు,

గతవైభవ చిహ్నాలేగా ఇప్పుడు!

అలకొస్తే, అయినవాడే తీర్చాలనే ప్రబంధనాయికలెక్కడున్నారు?

నేతింటున్నా!

నువు తింటే తిను.

లేకపోతే నీఖర్మ'

అనే వాళ్ళే తప్ప!

మొగుళ్ళు మాత్రం

తక్కువ తిన్నారా?

లడ్డూ కొరికి

చిన్నముక్క నోటికిస్తే

సిగ్గులమొగ్గైపోయి

తలొంచుకునే, కొత్తపెళ్ళికూతురికి

ప్రేమగా చిన్న మొట్టికాయ వేసే కావ్యనాయకులెక్కడ?


అంతలేసి కళ్ళున్న అమ్మాయిల్ని

గంతులేసి చేసుకునే

అబ్బాయిలెక్కడ?

ఇన్ఫోసిస్సా,

టీసీయెస్సా;

విజిటింగ్ కార్డా,

గ్రీన్ కార్డా...

ఇవేగా మాటలంటే?

జడ'పదార్ధాలు,

కలహంస నడకలు,

వాలుచూపుల బాణాలు,

అన్నీ కనుమరుగై పోయాయి.


సిగ్గనేది సిగ్గుతో తలొంచుకుంది.

జవరాలికందని జామకాయని

ఎత్తుకుని కోయించడం కన్నా

రొమాన్సేఁవుంటుంది చెప్పండి?


కురిసేవెన్నెల్లో

మెరిసేగోదారినే,

పడకిల్లుగా మార్చుకునే

ప్రణయం ఎంతందమో చూడండి!


మగతనమంటే

తెల్లటి లాల్చీపైజమాల్లో

కులాసాగా

వెలిగే సిగరెట్టేసుకునే రోజులుకావివి.


తొడకొట్టడం,

తొందరగా కొట్టడం,

ఇవీ మగతనపు లక్షణాలు!


సంఘఁవే మారిందో,

సంఘం ఏమారిందో

లేక

మనుషులంతా..

రాక్షసులైపోయారో మరి?


మాకైతే

మాచుట్టుపక్కల

అంత కొట్టుకుచావాల్సినంత పగవాళ్ళెవరూ లేరు.


ఆమాటకొస్తే

ఎవరికీ వుండరు.


కానీ మాకందరూ సరైనోళ్ళే దొరికారు మీ సినిమాల్లో!


నువ్వేసిన

చలవపందిళ్ళు,

నువు చూపించిన

పంచవటి కాలనీలు,


నీకు నచ్చే పడవప్రయాణాలు,

మేం మెచ్చే గోదారొడ్డూ,

ఇవన్నీ మాయమైపోయాయి!


బుడుగులంతా బూతులు మాటాడుతున్నారు.


సీగానపెసూనాంబలకి

సినిమా డాన్సులే మిగిలాయి.


మళ్ళీ మీరే పుట్టాలి.


అప్పులప్పారావులూ, తీతాలు,

విడాకుల కాంట్రాక్టర్లు,

వంద పెళ్ళిళ్ళ కిష్టిగాళ్ళు,

ఇలాంటి వాళ్ళని

నువ్వూ, మీవాడూ కలిసి మాలో కలిపేసారు.


మాకు వాళ్ళందరూ ఆత్మబంధువుల్లాంటివాళ్ళు!

వాళ్ళు చేసిన వెధవపన్లు ఎన్నున్నా మావాళ్ళే అనిపిస్తుంది.


మీకేఁవైనా అవకాశం వుంటే

ఇద్దరూ కలిసి ఇటొచ్చెయ్యండి.


'నల్లానల్లని కళ్ళూ,' అంటూ

పాటంతా నయనాభిషేకాలు జరిపించాలన్నా,

'ఏదో ఏదో అన్నది'...

అని కొత్తపెళ్ళికూతుర్ని

మచ్చిక చేసుకోవాలన్నా,

‘రాముడేమన్నాడోయ్...'

అని రామతత్త్వాన్ని వినూత్నంగా బోధించాలన్నా,

చివరగా

'మంచీచెడూ వేరేవేరే రాసులుగా పోసుండవు'

అని జీవితసత్యాన్ని నిజజీవితానికి అన్వయించాలన్నా.


'ఆమ్యామ్యా' లాంటి పదాల్ని పరిచయం చేయాలన్నా,   

మళ్ళీ మీరే రావాలి!


రాకపోతే ఊరుకుంటామా,

మేమే వచ్చేస్తాం.

            🌷🌷🌷

          *A Tribute to*

 *🌷Bapu & Ramana🌷* 

              💐💐💐

కామెంట్‌లు లేవు: