*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*
*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*21.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*హాహాకారో మహానాసీద్రోదస్యోః సర్వతోదిశమ్|*
*నిగృహ్యమాణేఽసురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా॥7121॥*
సర్వ శక్తిమంతుడైన శ్రీమహావిష్ణువు ఈ విధముగా బలిచక్రవర్తిని బంధింపజేసెను. అంతట పృథ్వి, ఆకాశము, సకల దిక్కులయందు హాహా కారములు చెలరేగెను.
*21.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తం బద్ధం వారుణైః పాశైర్భగవానాహ వామనః|*
*నష్టశ్రియం స్థిరప్రజ్ఞముదారయశసం నృప॥7122॥*
రాజా! బలిచక్రవర్తి వరుణపాశములచే బంధింపబడి సంపదనంతయు కోల్పోయెను. అయిననూ అతని వివేకజ్ఞానము స్థిరమైయుండెను.అందరూ అతని ఉదారకీర్తిని కొనియాడుచుండిరి. అపుడు శ్రీహరి బలితో ఇట్లనెను-
*21.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసుర|*
*ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయముపకల్పయ॥7123॥*
"దైత్యరాజా! నీవు నాకు మూడడుగుల భూమిని వాగ్దానము చేసితివి. రెంఢు అడుగులతో నేను ముల్లోకములను ఆక్రమించితిని. మూడవ అడుగును ఎచట తీసికొనవలెనో తెల్పుము".
*21.30 (ముప్పదియవ శ్లోకము)*
*యావత్తపత్యసౌ గోభిర్యావదిందుః సహోడుభిః|*
*యావద్వర్షతి పర్జన్యస్తావతీ భూరియం తవ॥7124॥*
సూర్యకిరణ కాంతి ప్రసరించువరకూ, నక్షత్రముల, చంద్రుని కిరణములు వెలుతురును వెదజల్లునంతవరకును, మేఘము ఎంత వరకు వర్షించుచుండునో అంతవరకును, నీ రాజ్యము విస్తరించియుండెను.
*21.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*పదైకేన మయాక్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః|*
*స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా॥7125॥*
నీవు చూచు చుండగనే ఒక అడుగుతో భూమండలమును ఆక్రమించితిని. రెండవ అడుగుతో ఆకాశమును, సకల దిక్కులను ఆక్రమించితిని. ఈ విధముగా నీ సంపదలన్నియునూ నావశమైనవి.
*21.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే|*
*విశ త్వం నిరయం తస్మాద్గురుణా చానుమోదితః॥7126॥*
మూడడుగుల భూమిని నాకిచ్చెదనని నీవు ప్రతిజ్ఞ చేసియుంటివి. ఆ మాటను నెరవేర్చ లేకపోయితివి. కావున, నీవు నరకములో నివసించవలసి యుండును. నీ గురువగు శుక్రాచార్యుడు గూడ దీనిని సమ్మతించియుండెను. ఇక, నీవు నరకములో నివసింపుము.
*21.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యధః|*
*ప్రతిశ్రుతస్యాదానేన యోఽర్థినం విప్రలంభతే॥7127॥*
యాచకునికిచ్చిన మాటను నెరవేర్చక మోసగించిన వాని మనోరథములు వ్యర్థములగును. అతనికి స్వర్గప్రాప్తి కలుగదు సరికదా, అతడు నరకములో పడవలసి వచ్చును.
*21.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాఢ్యమానినా|*
*తద్వ్యలీకఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్సమాః॥7128॥*
'నేను చాల సంపన్నుడను' అని నీరు గర్వించుచుంటివి. నీవు నాకు దానమిచ్చెదనని ఆ మాటను నెరవేర్చలేకపోయితివి. ఈ ప్రతిజ్లా భంగమునకు ఫలముగా నీవు కొన్ని సంవత్సరములు నరకయాతనలను అనుభవింపుము.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ఏకవింశోఽధ్యాయః (21)*
ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువది ఒకటవ అధ్యాయము (21)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి