9, సెప్టెంబర్ 2020, బుధవారం

ధర్మానికి మూలం వేదం



మానవ సౌభాగ్యానికి, కల్యాణప్రదమైన జీవనానికి ప్రాచీన కాలం నుంచి వేదాలు అనేక రకాలుగా సృజనాత్మకతను జోడిస్తున్నాయి. వేదం దేవకావ్యం. అపౌరుషేయం. పరమాత్మచే అనుగ్రహించబడి మహర్షుల హృదయ మందిరములో అనుక్షణం ప్రకాశించే దివ్యజ్యోతి.

‘‘దేవస్య పశ్య కావ్యం న మమార న జీర్యతి’’
దేవుడు సృజియించిన కావ్యమైన వేదం నశించదు. జీర్ణం కాదు. వేదాలు మానవజాతికి ప్రప్రథమ శాస్త్రంగా గణుతికెక్కాయి. సంపూర్ణ జీవనానికి బీజరూపమైన వేదాలు ఉజ్జ్వలమైన జ్ఞాన నిధులు. పరమ సత్యమైన విద్యకు మూలమైవి వేదాలే. కార్యకారణబద్ధమైన ప్రకృతి, పరమాత్మ, జీవాత్మల స్వరూప స్వభావాలు వేదాల వల్ల అవగతమవుతాయి. సమస్త సృష్టి విజ్ఞానానికి కారణము తెలియజెప్పే అమోఘ ఆయుధం వేదాలు. వేదోఖిలో ధర్మమూలం.. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం సమస్త ధర్మాలకూ మూలం.

‘ఏక ఏవ నమస్యః విక్ష్వీడ్యః’
..అంటూ వేదాలలో ఏకేశ్వరవాదము చాలా గొప్పగా, విశుద్ధ గంభీరంగా చెప్పబడింది. వేదములను ధరించి విశ్వమంతటా ఒకే భగవంతుడు వ్యాపించాడు. అలాగే, వేదాలలో రుషుల ప్రస్తావన ఎంతో హృద్యమైనది. వారికి వేదాలే ప్రమాణాలు. సాహిత్య ప్రపంచంలో ఎట్టి ప్రక్రియలోనైనా వేదం లేని అంశమే లేదు. ఇతిహాసాలు, పురాణాలు, రామాయణ, భారత, భాగవతాదులు, భగవద్గీత మున్నగు ధార్మిక గ్రంథాలు పలికే వేద ఘోష అమూల్యం.

వేదాలతో పాటు.. యాజ్ఞవల్క్య స్మృతి, అత్రిస్మృతి, మనుస్మృతి.. ఇలా మనకు అనేక స్మృతులున్నాయి. అయితే.. శృతి (వేదం), స్మృతులలో విభేదం పొడసూపినపుడు శృతినే ప్రమాణంగా తీసుకోవాలి. వేదమే శబ్దానికి, ఆప్తునికి ప్రమాణం. ఆప్తుడనగా పరమాత్మ. వేదవిజ్ఞానం మృత్యుభయాన్ని పోగొడుతుంది. ముణ్డకోపనిషత్తు ప్రకారం వేదాలు పరమాత్మ నుంచే ఆవిర్భవించాయి. కనుక అవి సృష్టికి, సృష్టి విజ్ఞానానికి చక్కటి ప్రమాణాలు, సనాతన ధర్మానికి మూలం.

కామెంట్‌లు లేవు: