9, సెప్టెంబర్ 2020, బుధవారం

*రెవెన్యూ కోర్టుల రద్దు!*

*రెవెన్యూ కోర్టుల రద్దు!*

*తెరపైకి జిల్లా ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు*
*విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు*

*తహసీల్దారు... ఆర్డీవో.. జేసీ అధికారాల్లో కత్తెర*👌

*రెవెన్యూ కోర్టుల రద్దు!*🙏

 *ఆర్‌ఒఆర్‌-2020 చట్టంతో* రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేయనుంది. ఏళ్ల తరబడి తేలకుండా రెవెన్యూ కోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగడం, క్షేత్ర స్థాయిలో భూ వివాదాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేగంగా, పారదర్శకంగా తీర్పులు ఇచ్చేలా రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్‌ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతారు. ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం (ఆర్‌ఒఆర్‌) కింద తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లు (ప్రస్తుతం అదనపు కలెక్టర్లు) రెవెన్యూ కోర్టులను నిర్వహిస్తున్నారు. ఆ పైన భూ పరిపాలన కమిషనర్‌, రెవెన్యూ మంత్రి వరకు అప్పీళ్లకు అవకాశం ఉంది. భూ వివాదాల్లో ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేయడం, తీర్పులు ఇచ్చి వివాద పరిష్కారం చేసే అధికారాలు దిగువ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టుల్లో పలు రకాల కేసుల విచారణ తేలడం లేదని ప్రభుత్వం గమనించింది. వివాదాలకు పరిష్కారం లభించక ఏళ్లతరబడి భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగడం, చివరికి అప్పీళ్లకు పై కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్‌ వరకు ఉన్న కోర్టులను ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త చట్టంతో వారి అధికారాలకు కత్తెర పడనుంది. వాటి స్థానంలో జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు పనిచేయనున్నాయి.

*వివరాలు సేకరించిన ప్రభుత్వం*
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జిల్లా కలెక్టర్లను నివేదిక కోరారు. వివిధ కోర్టుల్లో నమోదైనవి, వాదోపవాదాలు జరుగుతున్నవి, అప్పీళ్లకు వెళ్లినవి.. ఇలా పూర్తి వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గుర్తించారు.

*హైదరాబాద్‌ శివారు* ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఓ రెండున్నర ఎకరాల పట్టా భూమి వివాదంలో పడింది. తహసీల్దారు కోర్టులో కొంత కాలం సాగి...చివరికి తీర్పు వచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ భూ యజమానులు పైకోర్టును ఆశ్రయించారు. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. నేటికీ కేసు కొలిక్కిరాలేదు’’ అని ఒక అధికారి వివరించారు. ఇలాంటి కేసులు దండిగా ఉన్నాయని తెలిపారు.

*నమోదవుతున్న కేసుల్లో సరిహద్దు*
వివాదాలు, భాగ పంపిణీ, వారసత్వ బదిలీ, యాజమాన్య హక్కులు తదితరమైనవి ఉంటున్నాయి.

*ఆన్‌లైన్‌లో కేసులు.. తీర్పుల వివరాలు*
*భూ సంబంధిత కేసుల* వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఏ కోర్టులో.. ఏ కేసు.. ఏ దశలో ఉందో తెలిపే వివరాలు ప్రభుత్వ పోర్టల్లో ఉంచనున్నారు. దీంతోపాటు తహసీల్దారు నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు భూ యజమానులకు జారీ చేసే నోటీసులు, ప్రజలు ఇచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను కూడా ఉంచుతారు. భూ వివాదా లపై వచ్చే అంతిమ తీర్పులను ప్రదర్శించడం ద్వారా కొత్త వివాదాలు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేయొచ్చన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

*విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వం*
రాష్ట్రంలో ఏర్పాటయ్యే ల్యాండ్‌ ట్రైబ్యునళ్లకు విశ్రాంత న్యాయమూర్తులు నేతృత్వం వహించనున్నారు. ఒక అదనపు కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, ఇతర శాఖలకు చెందిన పలువురు అధికారులను ట్రైబ్యునళ్లలో నియమిస్తారు. భూ సంబంధిత నోటీసుల జారీ, దర్యాప్తు అధికారాలు వీటికి ఉండనున్నాయి.

కామెంట్‌లు లేవు: