9, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

దశిక రాము**

#-10

🕉️ శ్లోకం 04

**సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః**

**భూతాది ర్నిధి రవ్యయః|**

**సంభవో భావనో భర్తా**

**ప్రభవః ప్రభురీశ్వరః||**

25. సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.
26. శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.
27. శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.
28. స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.
29. భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములనుసృష్టించిన వాడు.
30. నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.
31. సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
32. భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.
33. భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
34. ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
35. ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షములోసగు సమర్ధుడు.
36. ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
6.సర్వమతడె మరియు శర్వుడు దానెగా

శస్తకరుడు మరియు స్థాణువతడె

సకల భూతములకు సరియైన మూలము

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: సర్వ ... సర్వము, శర్వ ... హరించు, శస్త కరుడు అనగా శుభంకరుడు అనగా శివుడే, స్థాణువు ... దేనికీ చలించనివాడు,భూతాది ... భూతాలకు మూలము.

భావము: బ్రహ్మాది దేవతలు మొదలు సకల చరాచర జీవకోటి తానే అయినవాడు, సకల దోషాలను శమింపజేసేవాడు, శుభంకరుడూ అయిన శివుడు కూడా శ్రీహరియే. దేనికీ చలించనివాడు అనగా కాలాతీతుడు, సకల భూతాలకూ ఆధారము, మూలమూ తానే అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

7. నిఖిల జగతి కతడు నిధియె వ్యయముగాడు

యుగయుగాలు తానె యుద్భవించు

భావనొకటి యున్న భర్తయై గాచును

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: నిధి రవ్యయ ... వ్యయము కాని నిధి, సంభవో ... సంభవామి యుగే యుగే, భావన ... భావము చేతనే, భర్త ... భరించువాడు.

భావము: పునరపి జననం, పునరపి మరణం సాధారణ ప్రాణకోటికే గాని శ్రీహరికి కాదు గదా. కనుక ఆయన మన పుణ్య కార్యాలన్నిటికీ తరగని నిధియై ప్రళయానంతరం తదనుగుణమైన సృష్టి చేస్తూ ఉంటాడు. అలాగే అవసరం అనుకున్నపుడు తనకు తానుగానే అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ప్రాణకోటి తన ఉనికిని గుర్తిస్తూ తనకై ప్రార్థనలు చేసీ చేయగానే ఆ భావ మాత్రముననే రంగంలోకి దిగి భారం వహించి కాపాడుతుంటాడు. కనుకనే అట్టి యా శ్రీహరికి శత సహస్ర వందనాలు.]

8. సాధు జనులకెపుడు సంరక్షగా తాను

ప్రభల నిచ్చుటకును ప్రభవ మందు

ప్రభువు లక్షణమెగ పాలించ లాలించ

వందనాలు హరికి వంద వేలు !!

[అర్థాలు: ప్రభవ ... పుట్టుక, ప్రభు ... పాలకుడు, ఈశ్వర ... ఆలించి పాలించువాడు(రాజులేదా తండ్రి), ప్రభలు ... వెలుగులు.

భావము: సాధు జనుల రక్షణకై వెలుగులు ప్రసరించే అనగా జ్ఞాన జ్యోతులను అందించే నిమిత్తం తనకు తానుగానే అవతరించువాడు, పాలన, పోషణ వంటి బరువు బాధ్యతలను నిర్వర్తించువాడు అయిన ఆ శ్రీహరికి శత సహస్ర
 వందనాలు.]

ఓం నమో నారాయణాయ 🙏🙏

**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: