9, సెప్టెంబర్ 2020, బుధవారం

*విష్ణు సహస్ర నామాలు*



శ్రీవిష్ణు సహస్ర నామ మహామంత్రం మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోనిది. ఈ పర్వములో రెండు అద్భుత ఘట్టాలు ఉన్నాయి. ఒకటి గీతోపదేశం. మరొకటి శ్రీవిష్ణు సహస్ర నామ ఉపదేశం. విష్ణు సహస్ర నామాల్లోని ప్రతి నామం ఒక మంత్రం. ఈ నామాలను మహామాలా మంత్రం అనీ అంటారు. గంగా శంతనులకు జన్మించిన భీష్ముడికి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. తండ్రి కోరిక తీర్చడం కోసం రాజ్యాధికారాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాడు. తన తమ్ముల నూట అయిదుగురు రాజ కుమారులనూ ప్రేమతో పెంచి పోషించాడు. ద్రోణాచార్యుణ్ని గురువుగా నియమించి వారికి యుద్ధవిద్యలు నేర్పించాడు.
మాయాజూదంలో పైచేయి సాధించి పాండవులను ధార్తరాష్ట్రులు అరణ్యాలకు పంపారు. అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తిచేసుకొని వచ్చిన పాండవులకు నియమానుసారం వారి రాజ్యాన్ని కౌరవులు అప్పగించలేదు. మహా భారత యుద్ధం జరిగింది. విజయం పాండవులను వరించింది. భీష్ముడు పదోనాటి యుద్ధంలో నేలకు ఒరిగి అంపశయ్యపై పడుకొన్నాడు. ఆ సమయంలో ఆయన శ్రీకృష్ణుని స్మరించని క్షణం లేదు. అంతిమక్షణాల్లో శ్రీకృష్ణుడి దివ్యతేజాన్ని స్మరించుకొని మహాద్విభూతినంతా ఒక్కసారిగా తన హృదయ ఫలకంపై చిత్రించుకొన్నాడు. అనంత గుణాలతో, అనంత నామాలతో ఆ అమృత స్వరూపుణ్ని మననం చేసుకొన్నాడు. ఆ వాగ్రూప యజ్ఞాన్ని గ్రహించి భక్తవత్సలుడు సహస్రనామ స్తోత్రమంత్రాన్ని ప్రసాదించాడు. భువిపై అందరూ ఈ మహామాలా మంత్రాన్ని జపించి తరించేందుకు, ధర్మరాజుకు బోధించి విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని శ్రీహరి చెప్పడంతో- యుద్ధానంతరం భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ధర్మరాజుకు ఉపదేశిస్తాడు. 
విష్ణు సహస్ర నామ స్తోత్రంలో వెయ్యికి మించిన నామాలు ఉన్నాయి. మహావిష్ణువుకు సంబంధించినంతవరకు సహస్రం అంటే అనంతం. ఈ నామాలలో ఒకే పేరు రెండు, మూడుసార్లు సైతం కనిపిస్తుంది. ఏ నామం, ఎక్కడ ఎన్నిసార్లు కనబడినా ఆ నామాలకు ప్రతిచోటా ప్రత్యేక అర్థం ఉండటం విశేషం. ఈ మహా మంత్రానికి మంత్ర ద్రష్ట వేదవ్యాసుడు. ఈ మంత్రం అనుష్టుష్‌ అనే ఛందంలో ఉంది. అంటే నోటితో పలికేదని అర్థం. నలుగురికీ వినిపించేలా ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రానికి అధిష్ఠాన దేవత శ్రీ మహావిష్ణువు. దీనికి స్రష్ట దేవకీనందనుడైన శ్రీకృష్ణుడు. ధర్మాన్ని, ధర్మాచరణ ద్వారా లభించే శాంతినీ అనుభవించే శక్తి ఈ మంత్రం వల్ల లభిస్తుందన్నది రుషి వాక్యం. ఈ మంత్రోచ్ఛారణ వల్ల మూలాధారచక్ర అధిష్ఠాన దేవత సిద్ధవిద్యాదేవి చైతన్యవంతమై జ్ఞానం సంపూర్ణమవుతుందన్నది నమ్మకం.
విష్ణుసహస్రనామాలు పలుకుతుంటే దేహంలో అనిర్వచనీయమైన అలౌకిక శక్తి, భగవంతుడు తనలో ఉన్నాడనే భావం, ‘నేను పవిత్రుణ్ని’ అనే అభిప్రాయం కలుగుతాయన్నది సాధకుల అనుభవం.
రాగద్వేషాలతో కలుషితం కాని భావసంచయం ఉత్తేజపరుస్తుందని, విష్ణు సహస్ర నామార్చనతో అనుభూతికి వచ్చే శక్తి ఆధ్యాత్మిక జీవితంలో అద్భుత విజయాలను చేరువ చేస్తుందన్నది సాధకుల మాట.

కామెంట్‌లు లేవు: