9, సెప్టెంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అప్పులు..అన్నదానం...

"ఏమిటోనండీ నన్ను మాత్రమే గురి పెట్టుకొని ఆ భగవంతుడు కష్టాలను సృష్టించాడేమో అనిపిస్తోంది..మూడేళ్ళ నుంచీ నలిగిపోతున్నాను..మనసుకు ఒక్క క్షణం శాంతి లేదు..తీవ్రమైన నైరాశ్యం లో కూరుకుపోయాను..చిన్నపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక నాకు మిగిలింది చావొక్కటే..నా అంతట నేను నా ప్రాణం తీసుకోలేను..ఆ భగవంతుడిని కోరుకునేది ఒక్కటే.."నాయనా! నన్ను కడతేర్చు తండ్రీ!..ఈ బాధలు, అవమానాలు నేను పడలేను.." అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతున్న ఆ వ్యక్తిని చూస్తే..ఎంతో బాధ వేసింది..

మరి కొద్దిసేపటికి ఆయన కొద్దిగా ఊరడిల్లాడు..కళ్ళు తుడుచుకుని ఒక ప్రక్కగా కూర్చున్నాడు..మెల్లిగా ఆయన వివరాలు అడిగాను..ఆయన పేరు కామేశ్వర రావు..హైదరాబాద్ నుంచి వచ్చారు..ఒక ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నారు..భార్యా ఇద్దరు పిల్లలు..ఉన్నంతలో సుఖంగానే వున్నారు..కామేశ్వరరావు గారి మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న మిత్రులు..తాము చేసిన అప్పులకు ఈయనను హామీగా వుండమని కోరారు..ముందూవెనుకా ఆలోచించకుండా కామేశ్వరరావు గారు సంతకాలు పెట్టేసారు..కొన్నాళ్ళకు ఆ మిత్రులు ముఖం చాటేశారు..ఆ అప్పులను వడ్డీతో సహా ఈయన కట్టాల్సివచ్చింది..అందుకోసం వేరేవాళ్ళ దగ్గర కామేశ్వరరావు ఎక్కువ వడ్డీ కి అప్పు చేయాల్సి వచ్చింది..ఒక దశకు వచ్చేసరికి..ఈయనకు వచ్చే జీతంలో ముప్పావు భాగం తాను తెచ్చిన.. లేదా..హామీ ఉన్న అప్పుల తాలూకు వడ్డీలు కట్టడానికే సరిపోతున్నది..దానికి తోడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికొచ్చి నానా మాటలు అనసాగారు..ఈ పరిణామాలతో కామేశ్వర రావు కృంగిపోయాడు..దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు..దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లబుచ్చసాగాడు..

ఆ సమయం లో కామేశ్వర రావు కు చిన్ననాటి మిత్రుడు కలిసాడు..అతను దత్త భక్తుడు..పిఠాపురం లో ఉన్న పాదగయ క్షేత్రాన్ని దర్శించమని..అలాగే వీలుంటే మరికొన్ని అవధూతల మందిరాలను కూడా దర్శించమని..అలా దర్శిస్తే కొంత మేలు జరుగుతుందని సలహా ఇచ్చాడు..కామేశ్వర రావుకు ఈ సలహా పెద్దగా నచ్చలేదు..కానీ..స్నేహితుడి తో మాత్రం సరే అన్నాడు..ఆరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి..దూరపు బంధువు ఒకాయన ఫోన్ చేసి..తాను ఈ శనివారం నాడు మాలకొండ వెళుతున్నాననీ.. అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి కూడా వెళుతున్నాననీ చెప్పాడు..కామేశ్వర రావు కు ఎందుకో తాను కూడా వెళితే బాగుండు అనిపించింది..వెంటనే తాను కూడా వస్తానని ఆయనకు చెప్పేసాడు..అలా శనివారం నాడు మాలకొండలోని శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ని దర్శనం చేసుకొని సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చారు..

ఆరోజు పల్లకీ సేవ లో కామేశ్వర రావు పాల్గొన్నాడు..రాత్రికి మందిరం లోనే నిద్ర చేసాడు..ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధికి జరిగిన అభిషేకమూ.. విశేష హారతులూ శ్రద్ధగా చూసాడు..తరువాత తాను కూడా అర్చన చేయించుకొని..సమాధి దర్శనం చేసుకున్నాడు.. ఇవతలికి వచ్చిన తరువాత.."మొదటి సారిగా ఒక అవధూత మందిరాన్ని దర్శించుకున్నానండీ..నా సమస్యలన్నీ స్వామివారికి చెప్పుకున్నాను..అంతా ఆయనదే భారం..అన్నీ సర్దుకుంటే మళ్లీ ఒకసారి వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను..ఆదివారం నాటి అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తాను.." అన్నాడు..

కామేశ్వర రావు హైదరాబాద్ చేరిన రెండు మూడు రోజుల్లోనే..ఢిల్లీ లో ఉంటున్న వాళ్ళ అక్కయ్య గారు హైదరాబాద్ వచ్చారు..కామేశ్వర రావు తాను అనుభవిస్తున్న బాధలు ఆవిడకు చెప్పుకున్నాడు..ఆవిడ శ్రద్ధగా విని..ఢిల్లీ లో తమకున్న అపార్ట్మెంట్ లో ఒకదానిని అమ్ముతున్నాననీ.. తనకు సుమారు రెండు కోట్లు వస్తాయని..అందులోంచి తమ్ముడి కోసం కొంత మొత్తాన్ని ఇస్తానని చెప్పారు..ఇది కామేశ్వర రావు ఏరకంగానూ ఊహించలేదు..ఆవిడ ఇవ్వబోయే మొత్తంతో తనకున్న అప్పుల్లో తొంభైశాతం తీరిపోతాయి..అవధూత మందిరాన్ని దర్శించుకుంటే మేలు జరుగుతుందని తన మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి..ఆ దత్తాత్రేయుడు తనకు ఇలా మేలు చేశాడని నమ్మకం కలిగింది..

మరో రెండు నెలల కల్లా కామేశ్వరరావు గారి అక్కయ్య గారు నలభై లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇచ్చారు..వెంటనే తనకున్న అప్పులను తీర్చివేశాడు..మరో పదిరోజుల తరువాత భార్యా పిల్లలను తీసుకొని మొగలిచెర్ల కు వచ్చాడు..ఆరోజు ఆదివారం నాటి అన్నదానానికి మొత్తం ఖర్చు తానే భరించాడు..

"ఆ దత్తాత్రేయుడే మా అక్కయ్య రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు.. ఇక జన్మలో ఇంతకు ముందు చేసిన పొరపాట్లు చేయనండీ.." అని ఇప్పటికీ చెపుతుంటాడు కామేశ్వరరావు భక్తిగా..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: