స్వామి ప్రజ్ఞారణ్య (90)
యోగి రామ తపోవనం
అన్నారెడ్డి పాలెం
నెల్లూరు జిల్లా.
రమణ మహర్షి బోధించిన నేనెవరు? అనే అన్వేషణలోనే జీవితాంతం గడిపిన మహనీయులు ఈ ఉదయం నిర్యాణం చెందారు.
యోగి ప్రొటోప్లాజమ్ గా దేశవిదేశాల్లో విఖ్యాతి పొందారు.
నెల్లూరు వి ఆర్ కళాశాల అధ్యాపకులుగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి విశేష కృషి చేశారు. సైన్స్ క్లబ్ లను ఉద్యమ స్థాయిలో అన్ని పాఠశాలల్లో ప్రారంభించేందుకు కృషి సలిపారు.
1960 దశకం లోనే తెలుగులో "సృష్టి" అనే సైన్సు పత్రిక నడిపారు. తదనంతరం "ఊహాశక్తి" అనే సైన్సు పత్రిక కూడా చాలాకాలం వెలువరించారు.
తిరుమల గిరులపై తాను కనుగొన్న నాచు జాతికి "స్పైరోజైరా ఏడుకొండల స్వామిన్సెస్" అని పేరు పెట్టారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో తన పరిశోధన పత్రాన్ని తెలుగులోనే సమర్పించిన భాషాభిమాని.
ఆజన్మ బ్రహ్మచారి గానే అధ్యాపక వృత్తి నిర్వర్తించి, ఉద్యోగ విరమణ అనంతరం సన్యాసాశ్రమం స్వీకరించారు.
హిమాలయ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల సాధన తర్వాత తన ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి అంతేవాసి అయిన యోగి రామయ్య గారి పేరిట వారి స్వస్థలం నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాలెం లో యోగి రామ తపోవనం నెలకొల్పారు.
అక్కడ దేశ విదేశాల నుంచి వచ్చే సాధకులకోసం ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడే కాకుండా దేశంలోని పలు ప్రసిద్ధ ఆశ్రమాలు స్వామిజీని ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆహ్వానించేవి. ఆధునిక విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతతో మేళవించి ఆయన చేసే ప్రవచనాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి. ఈ విజ్ఞాన బోధలకు ఉపకరించే విధంగా ఒక మైక్రోస్కోప్ ను సైతం రూపొందించి, దాన్ని పేటెంట్ కూడా చేయించిన అరుదైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త స్వామీజీ.
బెంగళూరులోని అంతర్జాతీయ వివేకానంద యోగ విశ్వవిద్యాలయం వారు రమణ మహర్షి పేరిట నెలకొల్పిన పీఠానికి స్వామీజీని అధిపతిగా నియమించారు.
🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి