9, సెప్టెంబర్ 2020, బుధవారం

పోత‌న త‌ల‌పులో --(47)



పాండవులు తమ పరివారంతోపాటు, శ్రీకృష్ణునితో కలసి కురుక్షేత్రానికి వెళ్లారు. అక్కడ అంపశయ్యపై ఉన్న భీష్ముడికి నమస్కరించారు. దేశ కాల విభాగాలు తెలిసిన భీష్మాచార్యుడు,వచ్చిన వారందరిని సత్కరింపజేసాడు. పాండ‌వులను చూసి భీష్ముడు అంటున్నాడు....

                          ***
"ధరణిసురులు, హరియు, ధర్మంబు దిక్కుగా
బ్రదుకఁ దలఁచి మీరు బహువిధముల
నన్నలార! పడితి రాపత్పరంపర
లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదు?


                           ***
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు, కాల మన్నియుం
జేయుచుఁ నుండుఁ, గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.
                 ***
“నాయనలారా! పాండవులారా! భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి, బ్రాహ్మణులను, ధర్మాన్ని నమ్ముకొని జీవించే మీరు , కష్టాలు ఎన్నో పడ్డారు. ఇటువంటి విచిత్రమైన విషయం ఇంకా ఏముంటుంది.
                                            ***
ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ, విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం అల్లిక వల్ల కూడుతూ, విడిపోతూ ఉంటాయి.

 కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు.

 కాలమే అన్నింటికీ మూలం.

కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా
 ఈ కాల ప్రభావాన్ని దాటలేరు. అన్నాడు భీష్మ‌పితామ‌హుడు.

  🏵️పోత‌న ప‌ద్యం-🏵️
🏵️ కలి కల్మష హరణం🏵️

కామెంట్‌లు లేవు: