9, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్. 56


...
తండ్రి ఆజ్ఞపాటించుట తప్ప వేరు కర్తవ్యములేదు అన్న రాముని దృఢసంకల్పము కౌసల్య పూర్తిగా అర్ధం చేసుకొన్నదై ,రామా ! అని డగ్గుత్తికతో అస్పష్టంగా పలికింది .ఆమె గొంతు పూడుకు పోయింది ! అతి కష్టం మీద మాటలు పెగుల్చుకుంటూ ! రామా ! తాపసవేషధారివై నీవు ఊంఛవృత్తితో ఎలా జీవిస్తావురా
.
 నాయనా ! ఎండ కన్నెరుగని రాకుమారుడివి ! సుకుమారుడివి ! నీ సేవకులు,నీ మిత్రులు అయినకారణంగా వారందరూ మన నగరంలో అందరికంటే ఉన్నతంగా జీవిస్తారే ,మహారుచికరమైన ఆహరం ప్రతిదినమూ భుజిస్తారే ! మరి నీవో రోజూ కందమూల ఫలములతో పొట్ట ఎలా నింపుకుంటావురా తండ్రీ ! ( తల్లికదా ! ముందు కడుపే గుర్తుకొచ్చింది ఆవిడకు)..
.
నాయనా నీలాంటివాడినే ప్రవాసమునకు పంపుతున్నాడనిన రాజంటే అందరికీ భయము కలుగుతుంది! నీవుకూడా అరణ్యమునకు వెళ్ళవలసి వస్తున్నదంటే దైవమే బలవత్తరమైనది అని చెప్పవచ్చును ! .
.
నాయనా ! లేగదూడ పోతుంటే తల్లి అక్కడే చూస్తూ నిలబడి ఉంటుందా ? నేను కూడా నీ వెంటే వస్తాను తండ్రీ! అని కడు దీనంగా హృదయవిదారకంగా విలపిస్తున్న తల్లిని ఓదార్చి !
.
 రాముడు ,అమ్మా! కైకమ్మ వంచనకు గురిఅయి విలవిలలాడుతున్న నా తండ్రిని ఈ సమయంలో ఒంటరిగా వదిలేస్తావా ! నేనూ వెళ్ళి నీవూ ఆయనను విడిచిపెడితే ఇంక ఆయనకు దిక్కెవరమ్మా? .
.
అయినా ! ఏ స్త్రీ కూడా భర్తను పరిత్యజించరాదు! అది చాలా క్రూరమైన పని తల్లీ! భర్త జీవించి యున్నంత వరకు భార్య ఆయనతోనే ఉండి సేవచేయవలే! ఇదే శాశ్వతమైన ధర్మము .
.
అమ్మా! భరతుడు ధర్మాత్ముడు ! అన్నిప్రాణులకు ప్రియము గూర్చేవాడు ! అతడు నీకు అనుకూలముగా ఉంటాడమ్మా! నీకు బెంగవద్దు! .అని పరిపరివిధాలుగా తల్లిని ఓదార్చాడు రాముడు.
.
అప్పుడు కౌసల్య కాస్త స్తిమితపడి ,రామా ! నీ మార్గములు మంగళకరములగుగాక! సకలప్రాణికోటి నిన్ను ఆదరించుగాక ,దిక్పాలకులు ,సకలదేవతలు ,త్రిమూర్తులు,స్థావరజంగమాత్మకమైన ఈ ప్రకృతి నిన్ను కాపాడుగాక అని దీవించి పంపింది.
.
రాముడు అటనుండి తన ఇంటికి పాదచారియై వెళ్లాడు .జరిగిన విషయాలేవీ భార్యకు తెలియదు. తన ప్రాణేశ్వరి ,తన ప్రియసతి సీతను చూడగనే కట్టలుతెంచుకుంటూ దుఃఖము పొంగిపొరలి పైకి తన్నుకుంటూ ఉబికిఉబికి వచ్చింది రామచంద్రునికి!
.
తం శోకం రాఘవః సోఢుం తతో వివృతతాం గతః!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: