9, సెప్టెంబర్ 2020, బుధవారం

ఉష‌శ్రీ అన్న‌య్య

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాక‌ర‌ప‌ర్రును పండితుల అగ్ర‌హారంగా భావ‌న చేస్తారు.
ఎంద‌రో ఉద్దండ పండితులు, ఘ‌నాపాఠీలు కాక‌ర‌ప‌ర్రువార‌మ‌ని గ‌ర్వంగా త‌లెత్తుకుని చెప్పుకుంటారు.
అక్క‌డ పుట్టిన మ‌రో పండితుడు పురాణ‌పండ సూర్య‌ప్ర‌కాశ దీక్షితులు.
పురాణ‌పండ రామ‌మూర్తి, కాశీ అన్న‌పూర్ణ‌మ్మ‌ల ఇంట పెద్ద కుమారుడిగా 1928 మార్చి 16వ తేదీన భూమి మీద‌కు వ‌చ్చారు. అక్క‌డే ప‌సిపిల్ల‌వాడిగా పారాడారు.
కొద్ది కాలం త‌ర‌వాత తూర్పు గోదావ‌రి జిల్లా ఆల‌మూరు గ్రామానికి ఈ కుటుంబం త‌ర‌లి వ‌చ్చింది.
ఉష‌శ్రీ త‌ర‌వాత ఆ ఇంట్లో న‌లుగురు చెల్లెళ్ల‌లు, న‌లుగురు త‌మ్ముళ్లు అనుబంధంగా పుట్టారు.
అంద‌రికీ ఉష‌శ్రీ అన్న‌య్య అంటే గౌర‌వంతో కూడిన భ‌యం.
అంద‌రూ ఉష‌శ్రీ‌ని అన్న‌య్య అని పిల‌వ‌లేదు. అబ్బాయీ అని ఆప్యాయంగా పిలుచుకున్నారు.
ఉష‌శ్రీ‌కి త‌ల్లి అన్న‌పూర్ణ‌మ్మ దైవ‌స‌మానం.
చిన్న‌నాటి నుంచి త‌ల్లికి వంట‌లో ఎంతో స‌హాయ‌ప‌డేవారు. ప‌చ్చ‌ళ్లు రుబ్బి ఇచ్చేవారు. త‌మ్ముళ్లు, చెల్లెళ్ల ఆల‌న‌పాల‌న చూసుకున్నారు. వారంద‌రికీ గోరుముద్ద‌లు తినిపించి తానే త‌ల్లి అయ్యారు.
విద్యాబుద్ధులు నేర్పించే గురువు అయ్యారు.
తండ్రి రామ‌మూర్తిగారు రామాయ‌ణ‌మ‌హాభార‌త ఉప‌న్యాసాలు ఇస్తూ ఇంటికి కావ‌ల‌సిన ఆదాయం సంపాదించేవారు. అందువ‌ల్ల ఇంటి బాధ్య‌త ఇంటి పెద్ద కొడుకుగా ఉష‌శ్రీ స్వ‌యంగా స్వీక‌రించారు.
ఆడుతూపాడుతూ తిర‌గ‌వ‌ల‌సిన వ‌య‌స్సులోనే బాద్య‌త‌లు తీసుకోవ‌టం ఉష‌శ్రీ‌కి త‌ల్లి నుంచి వ‌చ్చిన సంస్కారం కావ‌చ్చు, భ‌గ‌వంతుడు ఇచ్చిన ఆదేశం కావ‌చ్చు.
ఏమైతేనేం వారి ప‌ట్ల కొంచెం క‌ఠినంగానే ఉండేవారు ఉష‌శ్రీ అని త‌మ్ముళ్లు, చెల్లెళ్లు గ‌ర్వంగా చెబుతారు.
ఆల‌మూరులో పురాణ‌పండ వారి వీధి నేటికీ అంద‌రికీ సుప‌రిచిత‌మే.
ఆ వీధి చివ్వ‌ర ఉష‌శ్రీ అడుగుల స‌వ్వ‌డి వినిపిస్తే చాలు, ఇంటిల్లిపాదీ గబ‌గ‌బ క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయేవారు.
ఆ వీధిలో సంచ‌రించే శున‌కాలు సైతం పారిపోయేవ‌ని చెప్పుకుంటారు అంతా.
అతి అతిశ‌యోక్తి కావ‌చ్చు, యాదృచ్చికం కావ‌చ్చు.
ఉష‌శ్రీ ఇన్ని బాద్య‌త‌లు స్వీక‌రిస్తూనే సాహిత్య వ్యాసంగంలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యారు.
బాల్యంలో త‌ల్లి అల‌వ‌ర్చిన అక్ష‌ర‌దీక్ష ఉష‌శ్రీ‌ని తెలుగువారికి సుప‌రిచితుడ‌య్యేలా చేసింది.
పోత‌న భాగ‌వ‌తం కంఠ‌పాఠం చేయించింది త‌ల్లి.
ఆ అక్ష‌ర‌దీక్ష‌తోనే మూడు ప‌దులు నిండ‌కుండానే వ్యాస భార‌త అనువాదంలో తండ్రిగారికి పూర్తిగా తోడుగా నిలిచారు.
సంపాద‌క బాధ్య‌త తీసుకుని, వ్యాస‌భార‌తాన్ని సంపూర్ణంగా అనువ‌దించారు. తండ్రిగారు గ్రాంథికంగా రాసిన వ‌చ‌నాన్ని, స‌ర‌ళ వ్యావ‌హారికంలోకి మార్చారు.

అప్పుడే ఉష‌శ్రీ మ‌దిలో బీజం ప‌డి ఉంటుంది.
ఆ త‌ర‌వాత భార‌తాన్ని క‌నీసం ఇర‌వై సార్లు ర‌చించి ఉంటారు.
ఉష‌శ్రీ జీవితం న‌ల్లేరు మీద న‌డ‌క కాదు..
బాల్యం నుంచే ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు.
కొన్నిసార్లు తిండి లేక‌పోతే ఉన్న కాస్త అన్నంలో ప‌ల్చ‌టి మ‌జ్జిగ వేసుకుని లేచిన రోజులు ఉన్నాయ‌ని ఉష‌శ్రీ సోద‌రులు గుర్తు చేసుకుంటారు. మా అన్న‌య్య మా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. మ‌మ్మ‌ల్ని కొట్టి చ‌దివించ‌టం వ‌ల్లే మేమంతా ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేసి, సుఖ‌ప‌డ్డాం అంటారు ఆనందంగా.
ఉష‌శ్రీ సోద‌రులు వ‌రుస‌గా పురాణ‌పండ రాధాకృష్ణ‌ మూర్తి, పురాణ‌పండ కామేశ్వ‌ర‌రావు, పురాణ‌పండ రంగ‌నాథ్‌, పురాణ‌పండ రాఘ‌వ‌రావు.
చెల్లెళ్లు అల్లంరాజు సుబ్బ‌లక్ష్మి, ద్విభాష్యం కామేశ్వ‌రి, కూచిభొట్ల రాజ్య‌ల‌క్ష్మి, అల్లంరాజు సూర్య‌ప్ర‌భ‌.
అంద‌రూ హాయిగానే జీవించారు. మంచి ప‌ద‌వుల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు.
ఉష‌శ్రీ‌కి ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా త‌ల్లి ముందు మాత్రం చంటి పిల్ల‌వాడిగానే ఉండేవారు.
ప్ర‌తి సంవ‌త్స‌రం వీలైనంత‌వ‌ర‌కు గుర్తు పెట్టుకుని, త‌న పుట్టిన‌రోజు అంటే ఉగాదికి నాలుగు రోజుల ముందు వ‌చ్చే ద్వాద‌శినాడు త‌ల్లి ద‌గ్గ‌ర‌కు ఆశీర్వ‌చ‌నం కోసం వెళ్లేవారు. త‌ల్లికి సాష్టాంగ ప్ర‌ణామం చేసి, ఆవిడ చేత త‌ల‌కు నూనె రాయించుకుని, త‌లంటుకుని, ఆ త‌ల్లి ఇచ్చిన ధ‌వ‌ళ వస్త్రాలు ధ‌రించి, నుదుటిన చిన్న కుంకుమ బొట్టు పెట్టుకుని, ఆవిడ‌కు ఆనందం క‌లిగిస్తూ, తాను ప‌ర‌వ‌శించేవారు. త‌ల్లిని సాక్షాత్తు ఆ కాశీ అన్న‌పూర్ణ‌మ్మ‌గానే భావ‌న చేసేవారు.
అందునా ఆవిడ వేష‌ధార‌ణ కూడా పార్వ‌తీదేవిలాగే ఉండేది.
నుదుట‌న వెడ‌ల్పుగా పెద్ద కుంకుమ బొట్టు, రెండు ముక్కుల‌కు ముక్కు పుడ‌క‌లు, మ‌ధ్య‌న అడ్డ‌బాసి, కాళ్ల‌కు క‌డియాలు, క‌చ్చాపోసి క‌ట్టుకునే జ‌రీ చీర‌, క‌ళ్ల‌కు నిండుగా కాటుక‌, ముడి చుట్టిన జుట్టు... ఎవ‌రైనా స‌రే ఆ త‌ల్లిని చూస్తే న‌మ‌స్క‌రించ‌కుండా ఉండ‌లేరు. రూపంతో పాటు అంద‌మైన మ‌న‌స్సు ఆవిడ‌ది. ఆ త‌ల్లి సుగుణాల‌ను అందిపుచ్చుకున్నారు ఉష‌శ్రీ‌.
ఇక ర‌చ‌నా వ్యాసంగం విష‌యానికొస్తే...
ఆల‌మూరులో ఉష‌శ్రీ‌తో పాటు చామ‌ర్తి క‌న‌క‌య్య‌, (క‌న‌క్ ప్ర‌వాసి), పోలాప్ర‌గ‌డ స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి .. వీరిద్దరితో క‌లిపి ఈ ముగ్గురినీ ఆల‌మూరు క‌విత్ర‌యం అనేవారు. ప్ర‌తిరోజూ ఈ ముగ్గురూ క‌లిసి గోదావ‌రి ఒడ్డుకి వెళ్లి, సాహిత్య చ‌ర్చ‌లు చేసేవారు. ప్ర‌తిరోజూ ఓ క‌థ రాసి, ప‌త్రిక‌ల‌కు పంపేవారు. ప్ర‌తి ప‌త్రిక‌లో రోజూ వీరి ముగ్గురి క‌థ‌లు వ‌చ్చి తీరాలి అనే ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. ఆ ఊరిలో ఒక ఇంటిలో పెద్ద వేడుక జ‌రుగుతోంది. ఆ వేడుక‌లో ఏదో ఒక విల‌క్ష‌ణ‌మైన కార్య‌క్ర‌మం చేయాల‌నుకున్నారు ఈ క‌విత్ర‌యం. ఆధునిక భువ‌న విజ‌యం చేద్దామ‌నుకున్నారు. అంతే ఆలోచ‌న‌కు కార్య‌రూపం తీసుకువ‌చ్చారు. విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ‌శ్రీ‌, జ‌మ‌ద‌గ్ని శ‌ర్మ వంటి ఉద్దండుల‌ను పిలిచారు. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింది. ఆ విధంగా ఉష‌శ్రీ ఆధునిక భువ‌న‌విజ‌యానికి ఆద్యుడ‌య్యారు.
దేనినీ అనుక‌రించ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఉష‌శ్రీ, క‌విస‌మ్రాట్ విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ చెప్పిన‌ట్లుగా ఇది ఉష‌శ్రీ మార్గ‌ము అన్న ప్ర‌తిష్ట బ‌డ‌యుగాక అన్న చందాన త‌న మార్గాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఉర‌క‌లు వేయించారు.
1961 ప్రాంతంలో కృష్ణాప‌త్రిక‌లో పెళ్లాడే బొమ్మా పేరున ఒక న‌వ‌లా లేఖావ‌ళి ప్రారంభించారు. 30 వారాల పాటు నిరాఘాటంగా ఆ లేఖావ‌ళి ప్ర‌చురిత‌మైంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఒక అన్న‌గా పురాణేతిహాసాల నుంచి ఉదాహ‌ర‌ణ‌లు ఇవ్వ‌ట‌మే కాకుండా, ప్ర‌స్తుత స‌మాజంలోని కుళ్లును ఎలా ఎదుర్కోవాలో బోధించారు.
సాహితీ ప్ర‌పంచంలో న‌వ‌లా లేఖావ‌ళి ర‌చించిన ఏకైక‌ వ్య‌క్తి ఉష‌శ్రీ‌
భీమ‌వ‌రం క‌ళాశాల‌లో ఉష‌శ్రీ కోసమ‌ని ప్ర‌త్యేకంగా తెలుగు శాఖ‌ను ప్రారంభించారు ఉష‌శ్రీ గురువులు, పితృతుల్యులు అయిన శ్రీ‌మాన్ నండూరి రామ‌కృష్ణ‌మాచార్యులు. అక్క‌డ చాలా చిత్రం జ‌రిగేద‌ట‌. ఉష‌శ్రీ‌కి బాల్యం నుంచి ధ‌వ‌ళ వ‌స్త్రాలు ధ‌రించ‌టం అల‌వాటు. చిన్న‌త‌నంలో పైజ‌మా లాల్చీ ధ‌రించేవారట‌. క‌ళాశాల‌కు మాత్రం తెల్ల పంచె, లాల్చీ, గోల్డు ఫ్రేమ్ క‌ళ్ల‌జోడు ధ‌రించి వ‌స్తుంటే, అధ్యాప‌కుడు వ‌స్తున్నారనుకుని విద్యార్థులు న‌మ‌స్క‌రించేవార‌ట‌. ఆ క‌ళాశాల‌కు క‌విస‌మ్రాట్ విశ్వ‌నాథ‌ను అతిథిగా తీసుకువ‌చ్చి క‌ళాశాల గౌర‌వాన్ని పెంచార‌ట‌. ఆ క‌ళాశాల‌లో ఉష‌శ్రీ ఉత్త‌మ విద్యార్థి బ‌హుమ‌తి అందుకున్నారు.

1962 ప్రాంతంలో ఉష‌శ్రీ అనేక చిన్న క‌థ‌లు ర‌చించారు. అన్నిటిలోకి త‌ల‌మానిక‌మైన క‌థ జ్వ‌లిత‌జ్వాల‌.
ఈ క‌థ‌కు చిన్న నేప‌థ్యం ఉంది.
ఈ క‌థ‌ను రెండు పేజీల క‌థ‌గా రాసి, అనేక ప‌త్రిక‌ల‌కు పంపితే, అది తిరుగుట‌పాలో వెన‌క్కి వ‌చ్చేసింద‌ట‌.
త‌న ర‌క్త‌మంతా ధార‌పోసి ర‌చించిన క‌థ ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేద‌న్న బాధ‌తో, చిట్ట‌చివ‌ర‌గా ఆ క‌థ‌ను కొద్దిగా పెంచి, భార‌తి మా ప‌త్రిక‌కు, పంపి ఆ క‌థ‌తో పాటు ఒక ఉత్త‌రం రాశారట‌. ఈ క‌థ మీకు న‌చ్చ‌క‌పోతే, దానిని చింపి బ‌య‌ట పారేయండి. తిరిగి నాకు పంప‌వ‌ద్దు అని. ఆ మ‌రుస‌టి నెల ఉష‌శ్రీ చిరునామాకి భార‌తి ప‌త్రిక పోస్టులో వ‌చ్చింద‌ట‌. అందులో ఉష‌శ్రీ క‌థ ప్ర‌చురిత‌మైంది. ఆ క‌థ‌ను ఆ త‌ర‌వాత ఆకాశ‌వాణిలో పైడి క‌ట‌క‌టాలు పేరుతో నాటిక‌గా ప్ర‌ద‌ర్శించారు. నేటికీ ఉష‌శ్రీ ర‌చ‌న‌ల‌లో ఈ క‌థ ఉత్త‌మ‌మైన‌దే.
ఉష‌శ్రీ మ‌ల్లె పందిరి, జ్వ‌లిత‌జ్వాల‌, అమృత‌క‌ల‌శం అనే మూడు క‌థ‌ల సంపుటాలు ప్ర‌చురించారు. అనేక క‌థ‌లు ర‌చించారు. రాగహృద‌యం, వెంక‌టేశ్వ‌ర క‌ల్యాణం అనే రెండు య‌క్ష‌గానాలు ర‌చించారు. వెంక‌టేశ్వ‌ర క‌ల్యాణం య‌క్ష‌గానం కీ.శే. న‌ట‌రాజ రామ‌కృష్ణ‌గారి కోసం ర‌చించారు. అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. నాటి రాష్ట్ర‌ప‌తి స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ స‌మ‌క్షంలో కూడా ఈ య‌క్ష‌గానం ప్ర‌ద‌ర్శ‌న‌కు నోచుకుంది. ఉష‌శ్రీ సంతోష‌ప‌డ్డారు. అయితే, ఈ య‌క్ష‌గానాన్ని తానే స్వ‌యంగా రాశాన‌ని న‌ట‌రాజ రామ‌కృష్ణ ఉష‌శ్రీ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌టంతో, ఉష‌శ్రీ బాధ‌తో, ఇంక ఎన్న‌డూ ప్ర‌ద్శించ‌వ‌ద్దు అని కోపంగా అని వ‌చ్చేశార‌ట‌.
ఇటువంటివి జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా బాలాంత్ర‌పు ర‌జ‌నీకాంత‌రావు అనే చ‌ల్ల‌ని చంద్రుని వ‌ల్ల ఉష‌శ్రీ ప్ర‌పంచానికి చేరువ‌య్యారు.
ఆకాశ‌వాణిలో ఉష‌శ్రీ చేత 1973లో భార‌త ప్ర‌వ‌చ‌నం ప్రారంభింప‌చేశారు. అంతే ఇంక మ‌ళ్లీ వెన‌క్కి చూసుకోలేదు ఉష‌శ్రీ‌.
తెలుగ జాతి ఉష‌శ్రీ‌కి నీరాజ‌నాలు ప‌ట్టారు. ఉష‌శ్రీ ప్ర‌వ‌చ‌నం చెబుతున్నంత‌సేపు రేడియోకి హార‌తులిచ్చేవార‌నీ, వీధుల‌న్నీ నిర్మానుష్యంగా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేవ‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ‌ల‌క్ష్మ‌ణ యతీంద్రులు స్వ‌యంగా వేదిక‌ల మీద చెప్పారు.
ఏ శుభ‌ముహూర్తాన ఉష‌శ్రీ మ‌హాభార‌త ర‌చ‌న ప్రారంభించారో, ఉష‌శ్రీ శ్వాస ఆగేవ‌ర‌కు ఆ ర‌చ‌న కొన‌సాగుతూనే ఉంది.
ఉష‌శ్రీ 1990, సెప్లెంబ‌రు 7వ తేదీన క‌న్నుమూసేనాటికి, ఆకాశ‌వాణిలో భాగ‌వ‌తం ప్ర‌సార‌మ‌వుతూనే ఉంది. ఉష‌శ్రీ గ‌తించిన మ‌రో రెండు నెల వ‌ర‌కు ఈ ప్ర‌వ‌చ‌నం కొన‌సాగింది.
ఉష‌శ్రీ రామాయ‌ణ‌భార‌తాల ద్వారా వాల్మీకివ్యాసుల‌ను తెలుగువారి గుండెల్లో నిల‌పాల‌నుకున్నారు. నిలిపారు.
ఇక తాను వ‌చ్చిన ప‌ని పూర్త‌యింద‌నుకున్నారో ఏమో, ఆ ఋషులను చేరుకున్నారు.
బ‌హుశ ఉష‌శ్రీ త‌న గంభీర గ‌ళంతో ఆ ఋషుల ర‌చ‌న‌ల‌ను వారికే వినిపిస్తూ వారి ఆశీర్వాదం పొందుతున్నారేమో.

కామెంట్‌లు లేవు: