**దశిక రాము**
🕉🏵️ *శ్రీమహావిష్ణు సహస్రనామ వైభవము-34* 🏵️🕉
❄ *శ్లోకం 28*❄
*వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|*
*వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||*
256. వృషాహీ --- అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)
257. వృషభః --- భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.
258. విష్ణుః --- (2, 259, 663 నామములు) అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.
259. వృషపర్వా --- తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.
260. వృషోదరః --- ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.
261. వర్ధనః --- వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.
262. వర్ధమానః --- వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.
263. వివిక్తః --- విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.
264. శ్రుతిసాగరః --- వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.
శ్లో. వృషాహీ వృషభో విష్ణుర్వృష పర్వా వృషోదరః
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శృతి సాగరః !!28!!
(నామాలు 256 ... 264)
59. పనులు చూపుచుండు, ఫలితాలనందించు
సకల శుబములిచ్చు, సర్వ వ్యాపి
ధర్మ పర్వములతొ దరిజేర్చు జనులను
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : వృషాహీ ... కర్మలను నియంత్రిస్తూ, ఫలితాలు నిర్దేశించువాడు, వృషభ ... శుభాలిచ్చువాడు, విష్ణు ... సర్వ వ్యాపి, వృష పర్వ ... ధర్మ సోపానాలు.
భావము : కర్మలను నియంత్రిస్తూ ఫలితాలు నిర్దేశించువాడు(మరొక భాష్యం ప్రకారం వృష అంటే ధర్ము అహ అంటే దినము గనుక ధర్మబద్ధమైన దినముల ద్వారా సేవింపబడువాడు), నిష్కల్మష హృదయాతో కొలిచే భక్తులకు సర్వ శుభాలనిచ్చేవాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, భక్తులు తనను చేరడానికి బ్రహ్మ చర్యము,గృహస్థాశ్రమం,వాన ప్రస్థం, చివరగా సన్న్యాసము అను నాలుగు ధశల సోపానాలు సమకూర్చినవాడు అయన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}
60. ఉదర మందె సృష్టి, యుద్ధరించు జనుల
వర్ధమానుడతడె, వదలకుండ
మాయ రూప మదయె, మరి వేదముల నిథి
వందనాలు హరికి వంద వేలు !!
{ అర్థాలు : వృషోదర ... వర్షించు ఉదరము, వర్ధన ... వృద్ధిచేయువాడు, వర్ధమాన ... ప్రపంచం రూపంలో వృద్ది పొందువాడు, వివిక్త ... మాయారూపి, శృతి సాగర ... వేదములకు నిథి.
భావము : మేఘాల మాదిరి ప్రళయ కాలమందు సృష్టి నంతటినీ తనలోకి తీసుకుని తిరిగి సమయం రాగానే వర్షించేవాడు(మరొక భాష్యం ప్రకారం వృషా అంటే ధర్మాలు గనుక ధర్మాలను తన కడుపులో పెట్టుకుని కాపాడేవాడు అనీ అనుకోవచ్చు), తనను త్రికరణ శుద్ధిగా విశ్వసించి కొలిచేవారిని సర్వవిదాలా వృద్ధిలోకి తెచ్చేవాడు(మోక్షమూ అందించేవాడు), మాయా రూపుడై ఉండువాడు, వేదాలకు నిథి( సాగరమంటే జలనిథే అయినే కేవలమూ జలంతోనే కాదాగ, కరుణా సముద్రుడు అనే భావంలో తీసుకుంటే శృతి సాగరుడు గనుక వేదాలకు నిలయం అనుకోవచ్చు) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }
*-ఓం నమో నారాయణాయ*
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
https://t.me/SANAATANA
**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://t.me/Dharmamu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి