27, అక్టోబర్ 2020, మంగళవారం

అంధం,దరిద్రం

 అంధం,దరిద్రం ప్రియయా విహీనం 

వీక్షేశ్వరే వదతి యాచ వరం త్వమేకం 

నేత్రేణ నాపి  వసునో,వనితాం నవిప్రే 

ఛత్రాభిరామ సుత దర్శనమిత్య వోచత్ 

 ఒకసారి పరమేశ్వరుడు మహా సంతోషంగా   వున్నాడు.పార్వతీదేవి తో సహా భూలోకానికి 

వచ్చాడు.యిద్దరూ అలా సరదాగా తిరుగుతున్నారు.బాధపడుతున్న వారెవరైనా కనబడితే 

వారికి ప్రత్యక్షమై కోరిన వరాలిస్తున్నాడు.వారికి దారిలో ఒక దరిద్రుడు  గుడ్డివాడైన బ్రాహ్మణుడు  కనబడ్డాడు..అతనికి భార్యకూడా లేదు..అతన్నిచూసి  శివుడికి జాలి కలిగింది.ఒక వరం ఇద్దామనుకున్నాడు.పక్కనే వున్న పార్వతిని సంప్రదించాడు.అతడికి కంటిచూపు యిద్దామనుకున్నాను పార్వతీ ఏమంటావు?అని అడిగాడు.అతడు దరిద్రుడు పైగా భార్య లేనివాడు.కంటిచూపు యిస్తే  దయతో దానం చేసేవాళ్ళు కూడా అతనికి దానం చెయ్యరు అంది పార్వతి.పోనీ ధనం యివ్వనా? అన్నాడు శివుడు.ధనం వుంటే గ్రుడ్డివాడు, భార్య లేని వాడు ఏమి చేసుకుంటాడు?అంది పార్వతి.అయితే అందమైన భార్యను యివ్వనా?

అన్నాడు శివుడు దరిద్రుడు,కళ్ళు లేనివాడు అందమైన భార్యను ఏమి చేసుకుంటాడు స్వామీ అని పక పక నవ్వింది పార్వతి.సరేలే వెళ్లి అతనికి ఏమి కావాలో  అతన్నే అడుగుదాం పద అన్నాడు శివుడు.అతనికి సమీపంగా వెళ్ళారు.అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చింది?అని అడిగాడు అతను. మేము పార్వతీ పరమేశ్వరులము.అన్నాడు.

అతను భక్తితో వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు.అప్పుడు శివుడు నీకు  ఒకే ఒక్క వరం యిద్దామని అనుకున్నాను ఏమి కావాలో కోరుకో ఒక్కటే వరమే యిస్తాను సుమా అని రెట్టించాడు 

శివుడు.ఆ బ్రాహ్మణుడు  బాగా ఆలోచించాడు.ఏదైతే తనకు సుఖమైన జీవితము  యిస్తుంది .అని ఆలోచించి  స్వామీ అందమైన  నాకుమారుడు వాడి భార్యా బిడ్డలతో కూడి  రాజ్యము చేస్తూ వుండగా అందమైన  నా భార్యతో కలిసి నేను చూడాలి అదే నా కోరిక   ఆ వరం ఒక్కటీ ప్రసాదించండి చాలు అన్నాడు.

   దానికి .భోళా శంకరుడుసరే అలాగే ఒక్కటేవరమే గా ఇచ్చేశాను.పో అని గర్వంగా పార్వతి వైపు చూశాడు.

చూశావా ఒక్కవరమే యిచ్చాను అన్నాడు.పార్వతి శివుని అమాయకత్వానికీ ,ఆ బ్రాహ్మణుడి  తెలివితేటలకీ పకా పకా నవ్వింది.ఎందుకలా నవ్వుతావు?అని కోపంగా అడిగాడు శివుడు.నేనిచ్చినది ఒక్క వరమే కదా! అన్నాడు.మీ ఒక్కవరమే అతనికి అన్నీయిచ్చింది.

  కొడుకు కావాలంటే భార్య కావాలి,అతను  రాజ్యం చెయ్యాలంటే రాజ్యం ,  ఐశ్వర్యం.కావాలి,కొడుక్కు భార్య,పిల్లలు  అవన్నీ చూడాలంటే అతనికి కళ్ళు కావాలి మరి మీరు ఎన్ని వరాలిచ్చినట్టూ?అతను ఎంత తెలివి గల వాడంటే ఒక్క వరంతోనే అన్నీ సంపాదించుకున్నాడు.అందుకే మీ అమాయకత్వానికి నవ్వు వచ్చింది.అంది పార్వతి 

 అందుకే మిమ్మల్ని భోళాశంకరుడు అన్నారు.అని చురక అంటించింది పార్వతి.

ఇదీ చమత్కారమైన కోరిక. 

🌹శుభోదయం 🌹  .   

.

కామెంట్‌లు లేవు: