27, అక్టోబర్ 2020, మంగళవారం

పళని

 *🌼🌿”పళని" గాలి పీల్చిన వారికి దోషాలు హరించుకు పోతాయిట.🌼🌿*


తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి.

ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ - ఇలా ఎన్నో పేర్లు కలదు.

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభవ ఆలయాలలో 'పళని' ప్రముఖమైంది. ఈ పుణ్య నామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు.

వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివ దేవుడు జాలిపడి 'అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి 'ఫలం - ని'! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు' అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన 'పళని' రూపు దిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!.

పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్దమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని 'మురుగన్ కొండ' అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై 'ఏరియల్ రోప్ - వే' ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!.

మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్థంబాలు అత్యంత సుందరమైన శిలా చిత్రాలతో మంత్రముగ్ధులుగావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.

గర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని 'నవ పాషాణం' అనే విశేషమైన శిలనుమలచి తయారు చేశారని, ఇందులో శక్తివంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు.

ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకుపోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.

మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక  సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

కామెంట్‌లు లేవు: