27, అక్టోబర్ 2020, మంగళవారం

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


పన్నెండవవ శ్లోక ఉపోద్ఘాతం - మొదటి భాగం


(అంబిక సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలకు ఉపోద్ఘాతంగా మహాస్వామి వారు చేసిన వివరణ)


శివానందలహరిలో ఆచార్యులవారు శివకథామృతం నుండి పెల్లుబికిన మహాప్రవాహం ప్రపంచ పరిస్థితి వలన జనించిన క్లేశములను, మాలిన్యములను కడిగివేస్తుందనీ, ఆత్మ స్పృహ అనే మహా తటాకాన్ని నింపివేస్తుందనీ ప్రస్తుతిస్తారు. ఈ కారణం చేతనేనేమో వారు శివానందలహరిలో శివలీలలను వివరించారు. శివుడు అనేక పాత్రలలో అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు చూపబడింది. సౌందర్యలహరి నిర్మాణంలో ఆచార్యులవారి పంథా వేరు. అంబిక చూపవలసిన లీల, చేయవలసిన విధి అంటూ ప్రత్యేకంగా ఏవీ లేవు. ఆ తల్లి ఒక మహాసౌందర్య ప్రవాహం. ఆ వెల్లువ మన సమస్త దురితములను ప్రక్షాళన కావిస్తుంది. మన హృదయాలను విస్తారంగా ఆనంద సాగరములుగా మలచి వేస్తుంది. ఆచార్యుల వారు వర్ణించాలంటే భండాసుర వధ వంటి రసవత్తరమైన ఘట్టాలను అనేకం వర్ణించవచ్చు. వారు అంబిక జగన్మోహనమైన రూపాన్ని వర్ణిస్తూ అదే సమస్త ఆనందములకూ, పరమానందములకూ ఆధారభూతమైనదని ఆవిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు.

వందలమైళ్ళ దూరం నుండి, ఒక్కసారి ఆ గంగా ప్రవాహంలో మునకవేస్తే సమస్త పాపములు ప్రక్షాళనమయిపోతాయనే ప్రగాఢ విశ్వాసంతో గంగను చేరుతున్నాము. ఒక్క మునక వేయడంతో మన ప్రయోజనం సిద్ధిస్తుంది. అయినా ఒకసారి గంగలో దిగిన తరువాత మనమెందుకు వచ్చామన్నది పూర్తిగా మరచిపోయి గంగా ప్రవాహమో ఓలలాడే ఆనందంతో అలానే మునుకలు వేస్తూ ఉంటాం. అమ్మ సౌందర్యమటువంటిది. మనలను మనం మరచిపోయి ఆ సౌందర్య ప్రవాహంలో ఓలలాడుతూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.


మహోన్నతమైన హుందాతో కూడిన ఒక అందాన్ని చూడడం తటస్థ పడిందనుకోండి. అసంకల్పితంగా చేతిలోని పనుల్ని వదిలివేసి ఆ అందం వైపు నిశ్చేష్టులమై చూస్తూ ఉండిపోతాము కదా! అప్పుడు ఆ అందాల గురించి చర్చించడానికో, వర్ణించడానికో, వినడానికో బుద్ధి పుట్టదు. అలాచూస్తూ ఉండిపోతాం అంతే! అటువంటి పరిపూర్ణమైన అందం అమ్మది.


భగవంతుని పొందడనికి రెండు సులభమైన మార్గాలున్నాయి. ఒకటి నామజపం. రెండు రూప ధ్యానం. పరమేశ్వరుని సచేతనంగా తమ ఎదుట నడయాడుతున్నట్లు చర్మ చక్షుస్సులతో దర్శించి, మాట్లాడగలిగే మహాత్ములు కొందరున్నారు. మనం విగ్రహాలను మాత్రమే చూడగలుగుతున్నాం. సాధన చేత అంతర్నేత్రంతో స్వామిని దర్శించగలుగుతాం. అయితే విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. వైష్ణవులు అలా ప్రతిష్ఠించబడిన విగ్రహాలను అర్చామూర్తులంటారు. దేవాలయములలోని అర్చామూర్తులను దర్శించి ధ్యానించడం వల్ల మన ప్రయత్న మెక్కువ లేకుండానే పరమేశ్వర రూపధ్యానం సిద్ధిస్తుంది.

నామమాహాత్మ్యం ఇనుమిక్కిలిగా వివరించబడింది. దానికి ఈ రూపధ్యానం కూడా జోడించినపుడు శీఘ్రగతిని ఏకాగ్రత సాధ్యం కాగలదు. కేవలం మంత్రజపంతో ఏకాగ్రత సాధించడం కంటే రూపాన్ని చింతిస్తూ లేక విగ్రహాన్ని దర్శిస్తూ చేయడం వలన ఏకాగ్రత శీఘ్రగతిన సిద్ధిస్తుంది. రామ జపం జపించేటపుడు ఆ కోదండధారి, నీలమేఘశ్యాముని మనస్సులో చింతించామంటే మనస్సు పరవశమవుతుంది. జగన్మోహనమైన స్వామి రూపాన్ని చింతించడం భక్తి మార్గములన్నిటికంటే శ్రేష్ఠమైనది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: