27, అక్టోబర్ 2020, మంగళవారం

మహాభారతము ' ...60 .

మహాభారతము ' ...60 . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


విదురుడు తమ తండ్రికి హితబోధ చేసి, తిరిగి పాండవులను వెనుకకు రప్పిస్తాడేమో అని భయపడి, దుర్యోధనుడు ప్రతివ్యూహం కోసం సమాలోచన చేస్తున్నాడు, మిత్రునితో, శకుని, దుశ్శాసనులతో. 


' మామా ! యీసారి పాండవులు తిరిగివచ్చి ఇంద్రప్రస్థంలో సుఖంగా వుంటే నేను చూడలేను. నాకు మరణమే శరణ్యం. ఆత్మహత్యకు అనేకమార్గాలు. అంతేకానీ, పాండవులతో స్నేహం మాత్రం కుదరదు. మార్గాంతరం ఆలోచించండి. ' అన్నాడు దుర్యోధనుడు. ' పాండవులు ధర్మ నిబద్ధులు. వారు వ్రతభంగం చేసుకుని తిరిగివచ్చే ప్రసక్తిలేదు. నీ నీడను చూసి భయపడే పిరికివాడవు, యెప్పటినుంచి అయినావు, నీవు. ' అని మేనల్లుడిని చనువుగా మందలించాడు శకుని.  


కర్ణుడైతే, ' ప్రతిదానికీ యిలా భయపడుతూ కూర్చోడమెందుకు. నేను మొదటినుంచీ చెబుతున్నాను, యుద్ధమే పరిష్కారమని. మాయోపాయాలతో విజయం సిద్ధిస్తే యిలాంటి ఆలోచనలే వస్తాయి. దుర్యోధనా ! అనుజ్ఞ యివ్వు. ఇప్పుడే కామ్యకవనానికి వెళ్లి పాండవులను తుదముట్టిస్తాను. ' అని వీరావేశంతో అన్నాడు. ఒక్కసారిగా వారి ఆలోచనలు వేడెక్కాయి. అందరూ ముక్తకంఠంతో ' ఇదే మన తక్షణకర్తవ్యమ్ ' అని కర్ణుని అభినందించి, పాండవులపై యుద్ధానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.  


తమతమ ఆయుధాలతో రథాలను సిద్ధంచేసుకుని కామ్యకవనానికి బయలు దేరే ప్రయత్నంలో వున్నారు కౌరవులు. అయితే, ఈ విషయం తెలుసుకుని, ఆఘమేఘాల మీద వ్యాసమహర్షి, హస్తినకు చేరుకొని, వారి ప్రయాణం విరమింపజేసి, ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు.


' ధృతరాష్ట్రా ! యవ్వనదశలోనే నీకుమారులు మృత్యువాతబడే వుబలాటంలో వున్నారు. అందుకే, మాయాద్యూతం లో పాండవులను ఓడించి అడవుల పాలు చేసినది గాక, వారి త్రోవనవారు అరణ్యవాసదీక్షలో వుండగా, వారిపై యుద్ధానికి బయలు దేరుతున్నారు, నీ కుమారులు. అదే జరిగితే,వారి ప్రయాణం సరాసరి యమపురికే. భీమార్జునులు అన్నమాటపై సంయమనంతో వున్నారు. వారిని రెచ్చగొడితే, పరిణామాలు మనకు వూహకుకూడా అందవు. ' అని చీవాట్లు పెట్టాడు 


ఇంకా వ్యాసుడు ' అంబికసుతా ! పుత్రప్రేమకుమించిన ప్రేమ మరియొకటి వుండదు. అయితే, అదే బలహీనత కాకూడదు. తండ్రి పిల్లలందరినీ సమమైన ప్రేమతో చూడాలి. నీవు పాండురాజు, విదురుడు మువ్వురూ నాకుమారులు. మీ ముగ్గురినీ నేను సమానంగా ప్రేమిస్తాను. నీవు కూడా నీ నూర్గురు పుత్రులు, పాండునందనులు అయిదుగురు కలిపి నూట అయిదుగురిగా సమన్యాయంతో ఆలోచించాలి. '


' యెంత దుర్మార్గుడైనా , సత్పురుషులతో సహవాసంచేస్తే, మంచివాడు అవుతాడు. ధర్మజుడు అజాతశత్రువు, కపటం లేనివాడు. పెద్దలయెడ గౌరవం కలవాడు. అన్నింటినీ మించి ప్రశాంతచిత్తుడు. నీ కుమారుడు దుర్యోధనుడు, ఆతనితో సహవాసం చేసిన కొంతైనా మంచితనం అలవడే అవకాశం వున్నది. '


ధృతరాష్ట్రుడు అంతావిని, ' తండ్రీ ! వేదవ్యాసా ! మీరు చెప్పినది సత్యం. నామీద దయవుంచి, మీరే దుర్యోధనునికి అనునయంగా చెప్పండి. మీ వాక్కు మహిమ వలన వానిలో మంచి పొడచూపవచ్చు. నేను ఈ విషయంలో అశక్తుడను. ' అని అంటుండగా, మైత్రేయ మహర్షి అక్కడకు వచ్చాడు.


మైత్రేయుని చూడగానే వ్యాసమహర్షి, దుర్యోధనునికి నచ్చజెప్పేపని అతనికి అప్పగించి వెళ్ళిపోయాడు. మైత్రేయమహర్షికి ఉచితోపచారాలు చేసి, ధృతరాష్ట్రుడు, దుర్యోధనాదులను పిలిపించి పాదపూజ చేయించాడు. ఆయన తన యాత్ర విశేషాలు చెబుతూ, ' జరిగినదంతా నేను పాండవులద్వారా విన్నాను. కొంత తపోదృష్టితో చూశాను. అతి బలవంతులైన హిడింబ, బకాసుర, కిర్మీరులను చంపిన భీముడు ఖాండవవన దహనం చేసి దివ్యాస్త్రాలు పొందిన అర్జునుడు, శ్రీకృష్ణుని అండతో, అగ్నిశిఖలవలె కోపంతో రగిలిపోతున్నారు. కేవలం అన్నమాటకు, ధర్మానికి కట్టుబడి వారు మిన్నకున్నారు. చిన్న గాలివాటుకే ప్రజ్వరిల్లే, అగ్నివలె, యే చిన్న అవమానం యెదురైనా, ఉపేక్షించే ఓపిక యిక వారికిలేదు. '


అని హితవాక్యాలు పలుకుతూ దుర్యోధనుని వద్దకు, తన ఆసనంనుండి లేచి వచ్చి యింకా యేదో చెప్పబోయాడు. మైత్రేయుడు చెప్పబోయేది తనకు తెలుసు అన్నట్లుగా, దుర్యోధనుడు విసురుగా, తన కుడికాలితో భూమినితన్ని, తనతొడపై అరచేతితో చరిచి సింహనాదం చేశాడు. ఈ హఠాత్ చర్యకు మైతేయుడు నిశ్చేష్టుడయ్యాడు. ఆయన ఆగ్రహం కట్టలు త్రెంచుకున్నది. కానీ, మునీశ్వరుడు అగుటవలన, వెంటనే కనులు మూసుకుని, నిగ్రహం పాటించి, ధ్యానమగ్నుడై, అనంతరం కళ్ళుతెరచి, ' దుర్యోధనా ! నీ జ్ఞాతులపైనే కాదు, నీకు పెద్దలయెడ కూడా గౌరం నశించింది. అహంకారంతో మిడిసిపడుతున్నావు. నన్ను హేళనచేస్తూ నీవు చరిచినతొడ, రాబోవు యుద్ధంలో భీమసేనుడు విరుగ కొడతాడు. ' అని శపించాడు.  


వెంటనే. ధృతరాష్ట్రుడు మైత్రేయుని కాళ్లపై బడి, శాపాన్ని ఉపసంహరించమని కోరాడు. దానికి మైత్రేయుడు, పాండవులతో నీకుమారుడు సఖ్యాన్ని పెంచుకున్నట్లు తెలిసిననాడే, నేనా శాపాన్ని ఉపసంహరిస్తాను . నీకుమారుడు మారక తప్పదు. ' అని స్పష్టంగా చెప్పాడు.     


అయినా పట్టువదలక ధృతరాష్ట్రుడు ఆయనను మాటలతో మంచిచేసుకోవాలని

' మహర్షీ ! తమరు యింతకుముందు భీమసేనుడు కిర్మీరుని చంపాడని అన్నారు, ఎవరా కిర్మీరుడు ? . అతనిని భీముడు యెందుకు చంపవలసివచ్చింది. మాకు చెప్పండి. ' అని వినయంగా అడిగాడు. మైత్రేయుడు యేమాత్రమూ, మెత్తబడలేదు.

' ధృతరాష్ట్రా ! నేను యిప్పుడు యేమిచెప్పినా వినేస్థితిలో నీకొడుకు లేడు. కిర్మీరుని వధ గురించి విదురునికి కూడా తెలుసు. ఆయనని అడిగి చెప్పించుకోండి. ' అని లేచి క్షణాలలో వెళ్ళిపోయాడు, మైత్రేయమహర్షి.  


వెంటనే, ధృతరాష్ట్రుడు విదురునివైపు తిరిగి, తనకు కిర్మీరమరణ వృత్తాంతం చెప్పమని అడిగాడు. విదురుడు చెప్పసాగాడు. 

 

స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

కామెంట్‌లు లేవు: