27, అక్టోబర్ 2020, మంగళవారం

ప్రేమ లెక్కలు చూడదు*

 *ప్రేమ లెక్కలు చూడదు* 


ఒక సన్యాసి దేశ సంచారం చేస్తూ చేస్తూ, దారిలో ఒక గ్రామానికి వెళ్లారు. ప్రయాణపు బడలిక తీర్చుకోటానికి, ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఆయన కంటికి ఎదురుగా ఒక వ్యక్తి పాలు అమ్ముతూ కనిపిస్తే, అతని వంక చూస్తున్నారు. అతని దగ్గరకు పాల కోసం వచ్చేవారికి చక్కగా కొలత ప్రకారం కొలిచి పాలు పోస్తున్నాడు, ఆ వ్యాపారి. ఇంతలో ఆ వ్యాపారి దగ్గరకు ఒక పదేళ్ల పిల్లవాడు ఒక పాత్రను తీసుకుని వచ్చాడు. ఆ పాల వ్యాపారి వెంటనే ఆ పిల్లవాడి దగ్గర ఉన్న పాత్రను తీసుకుని, తన పెద్ద పాత్రలో ముంచి, నిండుగా పాలను, ఏ కొలత లేకుండా ఇచ్చాడు. 


ఆ దృశ్యం ఈ సన్యాసిని ఆకర్షించింది, అర్ధం చేసుకోలేని అయోమయంలో పడేసింది. కారణం ఏమిటో తెలుసుకోవడానికి, ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి, తన మనసు లోని అనుమానాన్ని అడిగారు. అందుకు ఆ వ్యాపారి, "అతను నా బిడ్డ. మా ఇద్దరి మధ్య కొలతలు, లెక్కలు ఏముంటాయి, ఒక్క ప్రేమ తప్ప!" అని సమాధానమిచ్చాడు. 


ఆ మాటలు విని ఆ సన్యాసి తృప్తిగా తిరిగి మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. పరమాత్ముని నామ స్మరణ చేసుకోడానికి, తన జోలె నుంచి పూసల మాలను బయటకు తీసుకుని, నామ స్మరణ ప్రారంభించారు. తన వేలు ప్రతి పూసను కిందకు నెట్టుతున్నప్పుడు, తన మనసు ఎన్నిసార్లు స్మరణ చేసానో లెక్కించడాన్ని గమనించారు. వెంటనే ఆయనకు తన భక్తి మీద తనకే నవ్వు వచ్చింది." 


పరమాత్మ నా తండ్రి! ఆయనను ప్రేమతో గుర్తుతెచ్చుకోవాలే కానీ, పూసల లెక్కలతో కాదు కదా! ఈ పూసల లెక్కల్లో నా మనసు కూడా ఈ పూసల మరియు వేళ్ల మధ్య తిరుగుతున్నదే కానీ, పరమాత్ముని భక్తిలో నిమగ్నము కావడం లేదు." అనుకొని, ఆ సత్యాన్ని తెలియజేసిన, ఆ పాల వ్యాపారికి మనసులో నమస్కరించారు. 


ఈ శరీర స్పృహ ఉన్నంత వరకు, మన ధ్యాస ఈ నవ ద్వారములలోనే చిక్కుకుని ఉంటుంది. సద్గురువు ఆదేశానుసారము నామ సాధన చేసినట్లైతే, ధ్యాస, పారమార్ధికంగా ప్రగతిని సాధించగలదు. ఇంద్రియాల చంచలత్వమును నిరోధించగలిగే సాధన మనకు సద్గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. అయితే, మనలో ముందుగా ప్రారంభమైన బాహ్య భక్తి, నెమ్మది నెమ్మదిగా మనసులో పరమాత్ముని దర్శనమునకై తీవ్రమైన అనురాగాన్ని కలిగించి, సద్గురు సాంగత్య అన్వేషణకు దోహదపడుతుంది. దీన దయాళుడైన పరమాత్మ, తన కోసం పరితపిస్తున్న జీవిని తప్పకుండా సద్గురు సాంగత్యమునకు చేరుస్తారు. తద్వారా సద్గురువు ఉపదేశించిన నామ సాధన, శబ్దాభ్యాసము ద్వారా తన మూలమైన పరమాత్మునిలో లీనమౌతుంది.

కామెంట్‌లు లేవు: