మహాభారతము ' ...61.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
తాను కామ్యకవనంలో ఋషులు, మునీశ్వరుల ద్వారా విన్న కిర్మీరవధ వృత్తాంతం విదురుడు, ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు:
పాండవులు కామ్యకవనంలోనికి ప్రవేశించేముందు, అప్పటికే మూడురోజులు నడిచి బాగా అలిసిపోయి వున్నారు. అట్టి పరిస్థితులలో, వారికి ఒక భయంకరమైన రాక్షసుడు అడ్డుగా నిలిచాడు. ఆరాక్షసుడు యెవరా అని పాండవులు ఆశ్చర్య పోతుండగా, అతడే చెప్పాడు తనగురించి.' నాపేరు కిర్మీరుడు. నేను బకాసురుని సోదరుడను. హిడింబా సురుని అనుంగుమిత్రుడిని. నాకు యీరోజు మీరు ఆహారంగా దొరికారు. నేనెంతో అదృష్టవంతుడిని. వారానికి సరిపడా ఆహరం దొరికింది. ' అని అధిక ప్రేలాపనచేస్తూ మీదిమీదికి రాసాగాడు.
ధర్మరాజు, బెదరకుండా, ' కిర్మీరా ! మేము పాండునందనులం. నాపేరు ధర్మరాజు. వీరు నా తమ్ములు భీమార్జున నకులసహదేవులు. ఈమె మా ధర్మపత్ని ద్రౌపది. మేము క్షత్రియ కుమారులం. మాతో వైరం నీకు మంచిదికాదు. ' అని యింకా యేదో చెప్ప బోతుండగా, వారి పేర్లు విన్నంతనే, ఒక్కసారిగా భీమునిపైకి దూకి, ' ఓరీ భీమసేన ! నీవేనా నాసోదరుని, మిత్రుని చంపి, యీ అడవులలో యింకా ధైర్యంగా తిరుగుతున్నది. ఇప్పుడే నిన్ను యమపురికి పంపి, నా భ్రాతృఋణం, మిత్రఋణం తీర్చుకుంటాను. కాసుకో ! ' అని ఒక్క వుదుటున భీముని మెడపై చరుపు చరిచాడు.
ధర్మరాజు, మళ్ళి ముందుకువచ్చి, ' కిర్మీరా ! భీమసేనుడు దాయాదుల దుశ్చర్యల వలన కోపంతో రగిలిపోతూవున్నాడు. అతనిని రెచ్చగొట్టడం నీకే మంచిదికాదు. నీ భ్రాతృ, మితృ రుణాల మాట యేమో కానీ,నీకు యీభూమితో ఋణం తీరేసమయం వచ్చినట్లుంది. ప్రక్కకు తప్పుకో ! ' అని హెచ్చరించాడు.
ధర్మజుని మాటలు లెక్కజెయ్యకుండా, కిర్మీరుడు భీమునితో భయంకరంగా తలపడ్డాడు. ఇరువురూ భూమి కంపించేటట్లు పిడిగుద్దులు గుద్దుకుంటూ, భుజబలంతో పోరాడారు. వారి హుంకరింపులకు కామ్యకవనం దద్దరిల్లింది. చెట్లుపీకి వాటినే ఆయుధాలుగా చేసుకుని యిరువురూ తలబడుతుంటే, వనంలో వున్న మృగాలన్నీ, పెద్దగా అరుచు కుంటూ, నలుదిక్కులా చెల్లాచెదరై పారిపోయాయి..
కిర్మీరుడు యెంతకూ, తగ్గకపోయేటప్పటికీ, భీముడిలో సహనం నశించి, ఒక్క వుదుటున కిర్మీరుని రెండుచేతులతో, పెద్ద బండరాయిని యెత్తి పట్టుకున్నట్లు పట్టుకుని, గిరగిరా త్రిప్పి, క్రిందికి విసరికొట్టాడు. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మి కిర్మీరుడు, కూలబడి, అంతలోనే లేవబోతుండగా, భీముడు మళ్ళీ క్రిందపడవైచి పిడిగ్రుద్దులు గ్రుద్ది, పైకి లేవకుండా , రెండుకాళ్లు తన్నిపట్టి, గొంతునులిమి కిర్మీరుని చంపివేశాడు.
కిర్మీర మరణంతో, భీముని కీర్తి పతాకం వువ్వెత్తున ఎగిరింది. అతి భయంకరమైన రాక్షసులను నలుగురిని చంపిన ఘనత స్వంతం చేసుకున్నాడు భీమసేనుడు. సోదరులూ, ద్రౌపది అతనిని అభినందించి, తమ అరణ్యవాస సమయంలో యీ విజయాలు తమకు వుత్సాహం నింపాలని కోరుకున్నారు. ఆ చుట్టుప్రక్కల కిర్మీరుని వలన బాధలు పడుతున్న ఋషులు, మునీశ్వరులు కూడా వీరిని ఆశీర్వదించారు.
అని విదురుడు కిర్మీర మరణ వృత్తాంతము, భీమసేనుని పరాక్రమం గురించి చెప్పగా, ధృతరాష్ట్రుడు నోటమాట రాక, నిశ్చేష్టుడయ్యాడు. ఒక్కసారిగా, అచేతనంగా వుండిపోయి, భీమసేనుని చేతులలో, తన్నులు తింటూ గావుకేకలు పెడుతున్నది, కిర్మీరుడు కాదు, దుర్యోధనుడు అని భావించి, దుర్యోధనుడు భీమసేనుని చేతిలో ప్రాణాలు విడిచినట్లుగా ' హా కుమారా ! దుర్యోధనా ! ' అని పెద్దగా అరిచాడు. తన తలను, రెండుచేతులమధ్యలో పెట్టుకుని బిగ్గరగా రోదించసాగాడు.
విదురుడు కూడా ధృతరాష్ట్రుని పరిస్థితి అర్ధం చేసుకుని నిట్టూర్పు విడిచాడు.
అక్కడ పాండవులు కామ్యకవనం లో కొద్దికాలం వుండి, ద్వైతవనం చేరుకున్నారు. అప్పటిదాకా, పాండవుల యోగక్షేమాలు యెప్పటికప్పుడు తెలుసుకుంటున్న శ్రీకృష్ణుడు, ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు, బంధు మిత్రులతో వచ్చి పాండవులను ద్వైతవనంలో పలుకరించారు.
జరిగినదంతా విశ్లేషించి శ్రీకృష్ణుడు, ధర్మజుని పల్లెత్తుమాట అనకుండా, ఆతని ధర్మ నిరతిని ప్రశంసించి, కౌరవుల దుశ్చర్యను యెండగడుతూ,' త్వరలో యద్ధసన్నాహాలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. ' అన్నాడు. ద్రౌపది కూడా ఆత్మీయులను చూసి, అలనాటి నిండుసభలో కౌరవులు తనను అవమానించిన సన్నివేశం తలుచుకుని వెక్కివెక్కి యేడ్చింది. పరాభవంతో రగిలిపోయింది. సోదరుడు దుష్టద్యుమ్నుని, శ్రీకృష్ణుని పట్టుకుని వారి ఓదార్పుతో స్వాంతన పడింది. ' అన్నా ! కృష్ణా ! మీరైనా మాయాజూదం జరుగుతున్నప్పుడు సభలో వుంటే, యీ పరిస్థితి నాకు వచ్చేది కాదుకదా ! ' అని ద్రౌపది బేలగా అడిగింది.
దానికి శ్రీకృష్ణుడు జూదం జరుగుతున్న సమయంలో యెందుకు హస్తినకు రాలేకపోయాడో కారణం వివరిస్తున్నాడు.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో... మరికొంత రేపు తెలుసుకుందాం.
విజయ దశమి శుభాకాంక్షలు తో , శుభాశీస్సులు తో
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి