27, అక్టోబర్ 2020, మంగళవారం

పూర్వాభద్ర నక్షత్రము - ఫలితాలు

 పూర్వాభద్ర నక్షత్రము  - ఫలితాలు


నక్షత్రములలో పూర్వాభద్ర 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు. అధిదేవత అజైకపాదుడు. మానవ గణము. జంతువు సింహము. రాశ్యాధిపతులు శని, గురువులు.


పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము  

పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము మేషరాశిలో ఉంటుంది. మేషరాశి అధిపతి కుజుడు. పూర్వాభాద్ర నక్షత్రము అధిపతి గురువు. ఈ జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు. ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించగలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది. 


ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్ర రెండవ పాదము

వృషభరాశి అధిపతి శుక్రుడు. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. కనుక ఈ జాతకుల మీద శుక్ర గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవ గణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాద్యాయులు, మత బోధకులు, మత గురువులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలం. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. 


ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యభ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరిగే అవకాశం. 29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ  కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్రము మూడవ పాదము

పూర్వాభాద్ర  నక్షత్ర 3వ పాదము మిధునరాశిలో ఉంటుంది. మిధునరాశి అధిపతి బుధుడు. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. వీరి మీద బుధ గురు గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం. 


ఈ జాతకులకు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్ర నాలుగవ పాదము

పూర్వాభాద్ర నక్షత్ర 4 వ పాదము కటకరాశిలో ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్ర అధిపతి గురువు. కటకరాశి అధిపతి చంద్రుడు. ఇది దేవగణ నక్షత్రం. వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు రెండు సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం కలిగే అవకాశం. 21 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ  కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. వివాహం సకాలంలో జరుగుతుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ  కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.


పూర్వాభద్ర నక్షత్రము - ఫలితాలు


ఈ నక్షత్ర జాతకులు సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. వీరికి ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలం. దేశవిదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం ఉంటుంది. వీరికి గురువుల, మేధావుల సహకారం ఉంటుంది. ఇతర రంగాల గురించి కూడా మంచి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. 


స్నేహాలు, విరోధాలు వెంటవెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం మొదలవుతుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు.  వైవాహిక జీవితం సాధారణము. బాల్యం సాఫీగా, తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

*చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: