8, సెప్టెంబర్ 2020, మంగళవారం

జ్వాలా ముఖి శక్తి పీఠము

**దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**



జ్వాలా ముఖి శక్తి పీఠముపై భిన్నాభిప్రాయములున్నవి.కొందరు వైష్ణో దేవి శక్తి పీఠమని ఇచట సతీదేవి పుర్రె భాగము పడినట్లు మరియు ఆష్టాదశ శక్తి పీఠములలో ఒకటిగా తెలుపుతారు. ఈ తీరుగానే హిమాచల్ ప్రదేశ్ లోని ఖాంగ్రా జిల్లా నందు ఖాంగ్రా రైల్వే స్టేషనుకు 30 కి.మీ. దూరములో నున్న జ్వాలా ముఖీ 51 శక్తి పీఠములందు ఒకటి గాను ఇచట సతీదేవి నాలుక భాగము పడినట్లు గానూ భావిస్తారు. అందువలన వైష్ణోదేవి గురించి తెలుసుకున్న పిమ్మట జ్వాలా ముఖి గురించి కూడా తెలుసుకుందాము.

వైష్ణోదేవి శక్తి పీఠము:
తుహినాద్రి స్థితా మాతా జ్వాలా ముఖివిశ్రుతా జ్వాలా మాలా ప్రభాదేవి జ్ణాన వైరాగ్య వర్థినీ

వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఆష్టాదశ శక్తిపీఠముల(18)నందు ఒక ముఖ్య శక్తి పీఠం.ఈ పుణ్యక్షేత్రం
హిమాలయములలోని వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. మరియు ఈ మాత జ్వాలా రూపములో ఉంటుంది కాబట్టి జ్వాలాముఖి అనికూడా పిలుస్తారు. ఈ ఆలయం జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో సముద్ర మట్టమునకు 5200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. దక్షయజ్ణము నందు దక్షునిచే అవమానింపబడిన సతీదేవి అగ్నిప్రవేశము చేసి ఆత్మాహుతి చేసుకొనిన పిమ్మట దుఃఖితుడైన శివుని ప్రళయ తాండవము నుండి లోకములను రక్షించుటకు శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రముతో సతీదేవి శరీరమును ఖండించినప్పుడు సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తి పీఠముగా వెలుగొందుచున్నట్లు పురాణ కధనము. శివుడు శక్తి పీఠములు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్ర పాలకునిగా నియమించాడు. అందువలన శక్తి పీఠములు అన్నిటిలోనూ క్షేత్ర పాలకుడైన కాలభైరవుని ఆలయాలు కలవు. ఈ కాల భైరవుని దర్శనము అనంతరమే యాత్ర పూర్తి అవుతుంది అలాగే ఇక్కడ కూడా క్షేత్ర పాలకునిగా భైరవుని ఆలయము ఉన్నది. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది. దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేడిది. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు. దర్శనానికి సుమారు 14 కి.మీ కొండ ఎక్క వలసి ఉంటుంది మార్గములో పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది. అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఈ విషయంలో పురాణ ప్రవచనము మరియు గ్రంధ ఆధారములున్నవి.
ఆగేవాలే బోలో జైమాతాకీ
పీఛేవాలే బోలో జైమాతాకీ పాల్కీవాలే బోలో జైమాతాకీ
ఘోడేవాలే బోలో జైమాతాకీ అంటూ యాత్రికులు చేసే నినాదాలతో తోటి యాత్రికులు శృతి కలపకుండా వుండలేరు..
మరియొక కధనము త్రేతాయుగమునుండి వైష్ణోదేవిపై ప్రచారములో నున్నది. ఆ కధనము ప్రకారం వైష్ణోదేవిని లక్ష్మీ స్వరూపమని, పార్వతీ స్వరూపమని అంటారు . కానీ మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి ముగ్గురి తేజోమయ స్వరూపం వైష్ణోదేవి. పూర్వము అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడి భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయ సంకల్పించి ఒక అందమైన యువతని సృష్టించి ఆ యువతిని భూలోకంలో రత్నాకరసాగర్ అనే ఆయనకి విష్ణు అంశతో పుత్రికగా జన్మించి ధర్మ కార్యాలు చేయమని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయనైనది.
వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమై ఆధ్యాత్మిక ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు.
బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించ మని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో తన తపస్సు కొనసాగించింది. ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.
కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. ఇలా ఉండగానే శ్రీధరుడు అనే వైష్ణవి భక్తుడు
ఒకసారి ఊరందరినీ భోజనానికి ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా శిష్యులను భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినలేదు. భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్ళి తన తపస్సును కొనసాగించింది.. భైరవుడు ఆమెని వదలకుండా వెంటరాగా. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.
అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధించాడు.. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.
తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు(అక్కడివారు వాటిని పిండీలంటారు)
ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

కాత్రా రైల్వేస్టేషను నుండి చెక్ పోస్ట్ వరకు ఆటోలో చేరుకొని ఆచటి నుండి కొండపై ఉన్న వైష్ణోదేవి గుడికి సుమారు 14 కి.మీ కాలినడకన, గుర్రములపై వెళ్లవచ్చును మరియు హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. హెలీకాప్టర్ పై కొండపై దిగిన పిమ్మట సుమారు రెండు కిలోమీటర్లు దిగువకు నడక, లేదా గుర్రాలమీద, పల్లకిల్లో కొండ దిగవలసి ఉంటుంది. వాతావరణం బాగా ఉంటేనే హెలీకాప్టర్ సర్వీసు ఉంటుంది. చెక్ పోస్ట్ నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సతీదేవి యొక్క తల భాగము పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠా లన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంత మైనదిగా భావిస్తాయి. గృహలో జ్వాల మండుతూ ఉంటుంది.అది ఎన్నివేల ఏళ్లనుండి అలా మండుతూందో ఆ జ్వాల భూమిలోనుండి ఎలా వస్తూందో కూడా తెలియదు. ఇచట మాతా వైష్ణోదేవి దేవస్థానం వారు అద్దె ప్రాతిపదికపై రూములు లేదా డార్మెటరీ కేటాయిస్తారు.

జ్వాలాముఖి : 51 శక్తి పీఠములలో ఒకటిగా చెప్పబడుతున్న జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములో ఖాంగ్రా జిల్లాలో ఖాంగ్రా రైల్వే స్టేషనుకు 30 కిలో మీటర్ల దూరములో నున్న ఒక పట్టణము. జ్వాలాముఖి జ్వాల రూపములో నున్న ఒక పవిత్ర ప్రఖ్యాతి పొందిన దేవాలయము. రాకా భూమి చందన్ అనువారిచే ఖాంగ్రా నందు కనుగొనబడి వారిచే అదే స్థలములో దేవాలయము నిర్మించబడినది. అటు పిమ్మట ఈ ఆలయము గోపురము మరియు శిఖరములతో అందమైన మడత వెండి పలేకలతో కూడిన తలుపుతో నవీకరించబడినది. ఇచట సతీదేవి నాలుక భాగము పడినట్లుగానూ రాళ్ళ మధ్య నుండి వెలుగొందు జ్యోతుల రూపములో దేవి దర్శనము ఇచ్చును. ఈ గుడిలో విగ్రహము లేదు కానీ రాళ్ళ పగుల్ల నుండి వచ్చు జ్వాలల రూపములో మాత్రమే దేవి దర్శనము ఇచ్చును. ఈ గుడిలో ఒక పెద్ద ఇత్తడి గంట పెద్ద మండపములో కట్టబడి ఉన్నది, అర్చనలు హారతులు ఆలయము మధ్య భాగములో నాలుగు స్తంభములపై పై కప్పుతో నున్న ఒక చిన్న గొయ్యి నందు కల జ్వాలలకు సమర్పింతురు. చిక్కటి పాలు, ఆయా రుతువులలో లభించు పండ్ల తోనూ నీరు తోనూ దేవికి నైవేధ్యము సమర్పింతురు. ఆలయములో వస్త్రములతోనూ మరియు ఆభరణములతో గల ఒక యంత్రమును దేవతారూపముగా మంత్రములతో స్మరించేదరు. రోజుకు అయిదు పర్యాయములు హారతి నిచ్చేదరు. ఉదయము 11 గంటలకు సాయంత్రము 6 గంటలకు ఇచ్చు హారతి సమయమునందు ఆలయము తెరచి ఉంచేదరు. మొఘలాయి రాజు అక్బరు ఈ ఆలయమునం

దలి జ్యోతులను ఆర్పివేయుటకు ఇనుపచట్రముతో కప్పి మరియు నీరు పోయుటద్వారాను ప్రయత్నించి విఫలుడైనాడు. అటు పిమ్మట అక్భరు అమ్మవారికి ఒక బంగారు ఛత్రము సమర్పించినాడు. కానీ అక్బరు అమ్మవారికి చేసిన అపచారము వలన అమ్మవారి శక్తివలన ఆ బంగారు ఛత్రము మరియొక లోహముగా మారిపోయినది. అది ఎట్లు మారినది ప్రపంచమునకు ఇప్పటికీ ఆగమ్య గోచరము. గోపురమునకు మహారాజా రంజిత్ సింగ్ బంగారు పూత పూయించినాడు. ఆలయమునకు కొద్ది అడుగుల పైన ఆరు అడుగుల లోతైన గొయ్యి ఆ గోతి అడుగు భాగమున వేడినీటి ఊట కల ఒక చిన్న గొయ్యి ఉన్నది.

న్యూఢిల్లీ నుండి వారమునకు మూడు మార్లు గల గగ్గల్ విమానాశ్రయమునకు విమానముపై ప్రయాణించి 46 కి.మీ దూరములో నున్న జ్వాలా ముఖి చేరవచ్చును. పఠాన్ కోట రైలు మార్గముపై చెరీ ఆచటికి 123 కి.మీ దూరములో నున్న కాంగ్రా రైల్వే స్టేషనుకు కొండ ప్రాంతపు రైలు పై ప్రయాణించి ఆచటినుండి జ్వాలాముఖి చేరవచ్చును. లేదా బస్సుపై పఠాన్ కోట నుండి ఖాంగా చేరి ఆచటినుండి జ్వాలాముఖి చేరవచ్చును.
🙏🙏🙏
సేకరణ
*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

కామెంట్‌లు లేవు: