సందేహం;- తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి అవతార రహస్యం వివరించండి.
సమాధానం;- బ్రహ్మాండ పురాణంలోని శ్రీవేంకటాచల మహాత్మ్యంలో శ్రీవారి అవతార గాథ వివరించబడింది.
ఒకనాడు క్షీర సాగరంలో శ్రీమన్నారాయణుని దర్శించడానికి నారద మహర్షి వచ్చాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు. *వత్సా! శ్రద్ధగా విను! నీవు ముల్లోకాలలో నాకు వాస యోగ్యమైన స్థానమేదో చెప్పు*. అప్పుడు నారద మహర్షి దృష్టి సారించి *ప్రభూ! భోలోకంలో తిరుమల ప్రాంతమే మీకు నిత్య నివాస యోగ్యం* అని చెప్పాడు. వెంటనే శ్రీహరి *అనంతా! నారదుడు చెప్పిన ఆ ప్రాంతంలో నీవు పర్వతంగా ఉండి, నన్ను సేవించు* అని ఆదిశేషునికి ఆజ్ఞ ఇచ్చాడు. శేషుడు తన పడగలతో తిరుమలలో ఒక కొండగా వెలిసి, శ్రీహరి కోసం నిరీక్షించాడు.
అపుడు శ్రీమహావిష్ణువు ఇలా అన్నాడు.
*అహంహి సర్వజంతూనాం దృష్టి గోచరతాం గతః*
*వసిష్యామిశ్రియా సార్ధం దదామీష్టాని దేహినామ్*
నేను సర్వ ప్రాణులకు నేత్ర గోచరుడనై శ్రీదేవితో తిరుమలలో నివసిస్తాను. ప్రాణుల అభీష్టాలను తీరుస్తాను.
ఈ తన సంకల్పాన్ని ప్రకటించి, బ్రహ్మాది దేవతలతో పరివారంతో శేషాచలానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో భృగు మహర్షి శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తనకు స్వాగత సత్కారాలు సరిగా అందలేదని కోపించి శ్రీహరి వక్ష స్థలాన్ని కాలితో తన్నడం, వక్ష స్థల లక్ష్మి అలిగి భోలోకంలో తిరుమల సమీపంలోని నారాయణ వనానికి రావడం, శ్రీనివాసుడు తిరుమల చేరడం, ఆకాశరాజు ద్వారా పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరగడం, ఆ తర్వాత ద్వాపరాంతంలో శ్రీకృష్ణ నిర్యాణాంతరం, శ్రీహరి అర్చావతారంలో స్వయం వ్యక్త పరబ్రహ్మగా, ఆపద మొక్కులవాడుగా, గోవిందుడుగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విశ్వ ప్రభువు కావడం, తిరుమల కలియుగ వైకుంఠంగా భాసిల్లడం ఇవన్నీ శ్రీవారి దివ్య వైభవ లీలా విలాసాలే.
*గోవిందా, గోవింద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి