8, సెప్టెంబర్ 2020, మంగళవారం

*భాగవతామృతం*


శ్రీ శుకుడు భాగవతం చెప్పుట

1-73-సీ.సీస పద్యము

పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు;
బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకలపురాణరాజము దొల్లి లోకభ;
ద్రముగ ధన్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి;
శుకుఁ డనియెడుఁ తన సుతునిచేతఁ
జదివించె నింతయు సకలవేదేతిహా;
సములలోపల నెల్ల సారమైన
1-73.1-ఆ.
యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి
గంగ నడుమ నిల్చి ఘన విరక్తి
యొదవి మునులతోడ నుపవిష్టుఁ డగు పరీ
క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు.
పుణ్య = పుణ్యాత్ములచే; కీర్తనుడు = కీర్తింప బడువాడు - భగవంతుడు; ఐన = అయినట్టి; భువన = లోకములకు; ఈశు = అధిపతి - భగవంతుని; చరితంబు = చరిత్ర; బ్రహ్మ = పరబ్రహ్మతో; తుల్యంబు = సమానమైనది; ఐన = అయినట్టి; భాగవతము = భాగవతము; సకల = సమస్త; పురాణ = పురాణములలోను; రాజము = ఉత్తమమైనది; తొల్లి = పూర్వకాలము; లోక = లోకములకు; భద్రముగన్ = క్షేమముగ; ధన్యముగన్ = ధన్యత్వముపొందునట్లుగా; మోదముగన్ = సంతోషముగా; ప్రీతిన్ = ఇష్టంగా; భగవంతుఁడు = మహిమ కలవాడు / పూజ్యుడు; ఐన = అయినట్టి; వ్యాస = వ్యాస; భట్టారకుఁడు = ముని, పండితోత్తముడు; ఒనర్చి = పొందికగ కూర్చి; శుకుఁడు = శుకుడు; అనియెడున్ = అనబడే; తన = తనయొక్క; సుతుని = పుత్రుని; చేతన్ = చేత; చదివించెన్ = చదివించాడు; ఇంతయున్ = ఇది(ఈభాగవతము) ఎల్లను; సకల = సమస్త; వేద = వేదముల; ఇతిహాసముల = ఇతిహాసముల {ఇతిహాసము – (ఇతి+హా+ఆసీత్) – ఇది ఈ విధముగా జరిగినది, పూర్వరాజుల చరిత్రము గలది, భారతము మొదలగునవి}; లోపలన్ = లోపలి; ఎల్ల = సమస్తమైన; సారము = సారము; ఐన = అయినట్టి;
ఈ = ఈ; పురాణము = పురాణము; ఎల్లన్ = అంతటిని; ఎలమిన్ = సంతోషముతో; ఆ = ఆ; శుక = శుకుడనే; యోగి = ముని; గంగ = గంగానది; నడుమ = మధ్యభాగములో; నిల్చి = నిలకడగా ఉండి; ఘన = గొప్ప; విరక్తి = వైరాగ్యము; ఒదవి = ఉద్భవించి; మునుల = మునుల; తోడన్ = తో కలిసి; ఉపవిష్టుఁడు = కూర్చున్నవాడు; అగు = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనే; నర = రాజులలో; ఇంద్రుడు = ఉత్తముడు; అడుగన్ = అడుగగా; చెప్పెన్ = చెప్పెను; వినుఁడు = వినండి.
పుణ్యకీర్తనుడైన విశ్వేశ్వరుని చరిత్రం శ్రీమద్భాగవతం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనది. సర్వ పురాణాలలోను మేలుబంతి. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోకకల్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగ పూర్వకంగా రచించాడు. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకునిచేత చదివింపచేసాడు. సమస్తవేదాల, ఇతిహాసాల సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ శుకయోగీంద్రుడు గంగానది మధ్యలో మునిగణ సహితుడై, అత్యంత విరక్తుడై, ప్రాయోపనిష్ఠుడై ఉన్న పరీక్షిన్మహారాజు అడుగగా చెప్పాడు.
1-74-వ.వచనము
కృష్ణుండు ధర్మజ్ఞానాదులతోడం దన లోకంబునకుం జనిన పిమ్మట గలికాల దోషాంధకారంబున నష్టదర్శను లైన జనులకు నిప్పు డిప్పురాణంబు కమలబంధుని భంగి నున్నది; నాఁ డందు భూరి తేజుండయి కీర్తించుచున్న విప్రర్షివలన నేఁ బఠించిన క్రమంబున నామదికి గోచరించి నంతయ వినిపించెద" ననిన సూతునకు ముని వరుండయిన శౌనకుం డిట్లనియె.
కృష్ణుండు = కష్ణుడు; ధర్మ = ధర్మము; జ్ఞాన = జ్ఞానము ఆదుల = మొదలగువాని; తోడన్ = తో; తన = తన యొక్క; లోకంబు = లోకమున (వైకుంఠము); కున్ = కు; చనిన = వెళ్ళిన; పిమ్మటన్ = తరువాత; కలికాల = కలికాలము యొక్క; దోష = దోషమనే; అంధకారంబున = చీకట్లో; నష్ట = నశించిన; దర్శనులు = జ్ఞానము, దర్మము కలవారు; ఐన = అయిన; జనులు = జనులు; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; పురాణంబు = పురాణము; కమలబంధుని = సూర్యుని {కమలబంధువు - పద్మాలకు మిత్రుడు, సూర్యుడు}; భంగిన్ = వలె; ఉన్నది = ఉన్నది; నాఁడు = ఆసమయము; అందున్ = అక్కడ; భూరి = మిక్కిలి గొప్ప; తేజుండు = తేజస్సు కలవాడు; అయి = అయి; కీర్తించుచున్న = స్తుతిస్తున్న (భాగవత పఠనము); విప్రర్షి = బ్రహ్మర్షి (శుకుని); వలనన్ = ద్వారా; నేఁన్ = నేను; పఠించిన = చదివిన; క్రమంబునన్ = ప్రకారముగా; నా = నాయొక్క; మది = మనసు; కిన్ = నకు; గోచరించినన్ = దర్శించ గలిగిన; అంతయ = అంత వరకు; వినిపించెదన్ = చెప్పెదను; అనిన = అని పలికిన; సూతు = సూతున; కున్ = కు; ముని = మునులలో; వరుండు = ఉత్తముడు; అయిన = అయిన; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
ధర్మము, జ్ఞానములతోపాటు శ్రీకృష్ణుభగవానుడు తన లోకమైన వైకుంఠానికి వెళ్లి పోయిన తరువాత లోకంలో కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే చిమ్మచీకటిలో గ్రుడ్డివారు అయిపోయి దిక్కు తెలియక చిక్కుపడి ఉన్న మానవులకు ఇప్పుడీ మహాపురాణం పద్మాలకు ఇష్ఠుడైన సూర్యుడిలా వెలుగులు పంచుతోంది. ఆనాడు మునుల ముందు మహాతేజస్వియై శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి శ్రీశుకయోగివల్ల నేను నేర్చుకొన్న విధంగా, నా మనస్సుకు స్ఫురించినంతవరకు మీకు వినిపిస్తాను” అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనను ముని శ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అడిగాడు.
1-75-శా.శార్దూల విక్రీడితము

సూతా! యే యుగవేళ నేమిటికి నెచ్చోటన్ మునిశ్రేష్ఠు నే
శ్రోతల్ గోరిరి? యేమి హేతువునకై, శోధించి లోకైక వి
ఖ్యాతిన్ వ్యాసుడుఁ మున్ను భాగవతముం గల్పించెఁ? దత్పుత్త్రుఁడే
ప్రీతిన్ రాజునకీ పురాణకథఁ జెప్పెం? జెప్పవే యంతయున్.
సూతా = సూతుడా; ఏ = ఏ; యుగ = యుగపు; వేళన్ = సమయములో; ఏమిటి = ఎందు; కిన్ = కు; ఏ = ఏ; చోటన్ = ప్రదేశములో; ముని = మునులలో; శ్రేష్ఠున్ = గొప్పవానిని; ఏ = ఏ; శ్రోతల్ = వినగోరువారు; కోరిరి = అడిగిరి; ఏమి = ఏమి; హేతువు = కారణము; కై = కొరకు; శోధించి = పరిశోధించి; లోక = లోకములకు; ఏక = ఎల్ల; విఖ్యాతిన్ = విశేషమైన ఖ్యాతిగలదిగా; వ్యాసుడు = వ్యాసుడు; మున్ను = పూర్వము; భాగవతమున్ = భాగవతమును; కల్పించెన్ = రచించెను; తత్ = అతని; పుత్త్రుఁడు = కుమారుడు; ఏ = ఏ; ప్రీతిన్ = ఆదరముతో; రాజు = రాజు; కున్ = కి; ఈ = ఈ; పురాణ = పురాణము యొక్క; కథన్ = కథను; చెప్పెన్ = చెప్పెనో; చెప్పవే = చెప్పుము; అంతయున్ = సమస్తమును.
“సూతమహామునీ! ఏ యుగంలో ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని ఎవరు అడిగారు? ఆ వ్యాసభగవానుడు దేనికోసం వేద, ఇతిహాసాదుల సారం అంతా ఎంతో పరిశోధించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుబ్రహ్మ ఎటువంటి ప్రీతితో, ఏ విధంగా పరీక్షిన్మహారాజుకి భాగవతకథ వినిపించాడో? అదంతా మాకు సమగ్రంగా వివరించి చెప్పు.
1-76-వ.వచనము
బుధేంద్రా! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం, డేకాంతమతి, మాయాశయనంబువలనం దెలిసిన వాఁడు, గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక.
బుధ = జ్ఞానులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; వ్యాస = వ్యాసుని యొక్క; పుత్త్రుండు = కుమారుడు; ఐన = అయినట్టి; శుకుండు = శుకుడు; అను = అనే; మహా = గొప్ప; యోగి = యోగి; సమదర్శనుండు = (సర్వమును) సమానముగా చూచువాడు; ఏకాంత = ఏకాంతముగా / ఒంటరిగా; మతి = ఉండగోరువాడు; మాయ = మాయ; శయనంబు = దాగిన తావు; వలనన్ = గురించిన; తెలిసినవాఁడు = మర్మము తెలిసినవాడు; గూఢుండు = గూఢుడు {గూఢుడు - సాధరణముగ వ్యక్తము కాక యుండువాడు}; మూఢుని = తెలియని వాని; క్రియన్ = వలె; ఉండున్ = ఉండును; నిరస్త = తిరస్కరింపబడిన; ఖేదుండు = దుఃఖము గలవాడు; అదియునున్ = అదికూడా; కాక = కాకుండా.
సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా,
1-77-త.తరళము

శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీర లొల్లక చల్లులాడెడి దేవక
న్యకలు హా! శుక! యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం
శుకములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ!
శుకుఁడు = శుకుడు; గోచియున్ = గోచీ కూడా; లేక = లేకుండా; పైన్ = బయట; చనన్ = వెళ్ళుచుండగా; చూచి = చూచి కూడ; తోయములు = నీటి; అందున్ = లోపల; లజ్జ = సిగ్గు; కున్ = కు; చలింపక = ఓడకుండా; చీరలు = చీరలను; ఒల్లక = కోరక; చల్లులాడెడి = జలకాలాడే; దేవ = దేవలోకపు; కన్యకలు = కన్యలు; హా = ఓహో; శుక = శుకుడా; అంచున్ = అనుచు; వెన్కన్ = వెనకాతలే; చనంగన్ = వెళ్ళుచుండగా; వ్యాసునిన్ = వ్యాసుని; చూచి = చూచుట వలన; అంశుకములన్ = సన్నని వస్త్రములను; ధరియించి = కట్టుకొని; సిగ్గునన్ = సిగ్గుతో; స్రుక్కిరి = జంకారు; అందఱు = అందరును; ధీనిధీ = బుద్ధిమంతుడా.
ఓ విజ్ఞానఖనీ! సూతమహర్షీ! ఒకమారు వ్యాసుని పుత్రు డయిన శుకమహాముని కనీసం గోచీకూడా లేకుండ దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలులేకుండా స్నానాలు చేస్తున్నారు. వారు శుకుని చూసి కూడ చీరలు ధరించలేదు. ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. శుకుడి వెనకాతలే, వయోవృద్ధుడు, పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి, కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు.
1-78-వ.వచనము
మఱియు నగ్నుండుఁ దరుణుండునై చను తన కొడుకుం గని వస్త్రపరిధానం బొనరింపక వస్త్రధారియు వృద్ధుండును నైన తనుం జూచి చేలంబులు ధరియించు దేవరమణులం గని వ్యాసుండు కారణం బడిగిన వారలు, నీ పుత్రుండు”స్త్రీ పురుషు లనెడు భేదదృష్టి లేక యుండు; మఱియు నతండు నిర్వికల్పుండు గాన నీకు నతనికి మహాంతరంబు గల" దని రట్టి శుకుండు కురుజాంగల దేశంబుల సొచ్చి హస్తినాపురంబునఁ బౌరజనంబులచే నెట్లు జ్ఞాతుండయ్యె? మఱియు నున్మత్తుని క్రియ మూగ తెఱంగున జడుని భంగి నుండు నమ్మహాయోగికి రాజర్షి యైన పరీక్షిన్మహారాజు తోడ సంవాదం బెట్లుసిద్ధించె? బహుకాలకథనీయం బయిన శ్రీభాగవతనిగమ వ్యాఖ్యానం బేరీతి సాగె? నయ్యోగిముఖ్యుండు గృహస్థుల గృహంబుల గోవును బిదికిన యంత దడవు గాని నిలువంబడం; డతండు గోదోహనమాత్ర కాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబు లగు నండ్రు; పెద్దకాలం బేక ప్రదేశంబున నెట్లుండె? భాగవతోత్తముం డైన జనపాలుని జన్మ కర్మంబు లే ప్రకారంబు? వివరింపుము.
మఱియున్ = ఇంకనూ; నగ్నుండున్ = వస్త్రములు దాల్చనివాడు; తరుణుండును = మంచివయసులో నున్నవాడు; ఐ = అయి; చను = వెళ్ళుచున్న; తన = తనయొక్క; కొడుకున్ = పుత్రుని; కని = చూచి; వస్త్ర = దుస్తులను; పరిధానంబు = ధరియించుటను; ఒనరింపకన్ = చేయకుండా; వస్త్ర = దుస్తులు; ధారియున్ = ధరించినవాడు; వృద్ధుండును = ముసలివాడును; ఐన = అయినట్టి; తనున్ = తనను; చూచి = చూసి; చేలంబులు = దుస్తులు; ధరియించు = ధరిస్తున్న; దేవ = దేవలోకపు; రమణులన్ = కన్యలను; కని = చూసి; వ్యాసుండు = వ్యాసుడు; కారణంబు = కారణమును; అడిగినన్ = అడగగా; వారలు = వారు; నీ = నీయొక్క; పుత్రుండు = పుత్రుడు; స్త్రీ = స్త్రీలు; పురుషులు = పురుషులు; అనెడు = అనే; భేదదృష్టి = భేదమునుచూచుట; లేక = లేకుండా; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; అతండు = అతను; నిర్వికల్పుండు = భ్రాంతి లేని వాడు; కాన = కావున; నీకున్ = నీకు; అతని = అతని; కిన్ = కిని; మహ = గొప్ప; అంతరంబు = భేదము; కలదు = ఉన్నది; అనిరి = అన్నారు; అట్టి = అటువంటి; శుకుండు = శుకుడు; కురు = కురురాజ్యంలో; జాంగల = మెఱక; దేశంబులన్ = ప్రదేశములలో; సొచ్చి = ప్రవేశించి; హస్తినాపురంబునన్ = హస్తినాపురములోని; పౌరజనంబుల = పురజనుల / పౌరులు; చేన్ = చేత; ఎట్లు = ఏవిధముగా; జ్ఞాతుండు = గుర్తింపబడ్డాడు; అయ్యెన్ = అయినాడు; మఱియున్ = ఇంకనూ; ఉన్మత్తుని = పిచ్చివాని; క్రియన్ = వలె; మూగ = మూగవాని; తెఱంగునన్ = వలె; జడుని = తెలివితక్కువవాని; భంగిన్ = వలె; ఉండున్ = ఉండువాడు; ఆ = ఆయొక్క; మహా = గొప్ప; యోగి = యోగి; కిన్ = కి; రాజ = రాజులలో; ఋషి = ఋషి వంటి వాడు {రాజర్షి - వేదశాస్త్రానుయాయి అగు రాజు}; ఐన = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత; మహారాజు = మహారాజు; తోడన్ = తో; సంవాదము = సంభాషణము; ఎట్లు = ఏవిధముగ; సిద్ధించెన్ = జరిగినది; బహు = చాలా; కాల = కాలము; కథనీయంబు = చెప్పదగినది; అయిన = అయినటువంటి; శ్రీ = శ్రీ; భాగవత = భాగవతమనే; నిగమ = వేదమునకు; వ్యాఖ్యానంబున్ = వ్యాఖ్యానము; ఏ = ఏ; రీతిన్ = విధముగ; సాగెన్ = నడచినది; ఆ = ఆ; యోగి = యోగులలో; ముఖ్యుండు = ముఖ్యమైన వాడు; గృహస్థుల = గృహస్తాశ్రమవాసుల; గృహంబులన్ = ఇళ్ళల్లో; గోవును = ఆవును; పిదికిన = (పాలు) పితికిన; అంత = అంతమాత్రము; తడవు = సమయము; కాని = కంటే ఎక్కవ కాలం; నిలువంబడండు = నిలబడడు; అతండు = అతను; గో = గోవును; దోహన = పితికినయంత; మాత్ర = మాత్రము; కాలంబు = సమయము; సంచరించిన = తిరిగిన; స్థలంబులు = ప్రదేశములు; తీర్థంబులు = పుణ్యస్థలములు; అగున్ = అగును; అండ్రు = అందురు; పెద్ద = ఎక్కువ; కాలంబు = సమయము; ఏక = ఒకే; ప్రదేశంబునన్ = తావున; ఎట్లు = ఏవిధముగ; ఉండెన్ = ఉండెను; భాగవత = భాగవతులలో; ఉత్తముండు = ఉత్తముడు; ఐన = అయినట్టి; జనపాలుని = రాజు {జనపాలుడు - జనులను పాలించు వాడు, రాజు}; జన్మ = పుట్టుక; కర్మంబులు = ప్రవర్తనములు; ఏ = ఏ; ప్రకారంబు = విధమో; వివరింపుము = వివరముగాచెప్పుము.
అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు, దిగంబరుడు, నవయువకుడు ఐన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా, వస్త్రధారి వృద్ధుడు ఐన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకొన్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి, వ్యాసుడు అందుకు కారణ మేమిటని అడిగాడు; అప్పుడు వారు”నీ కుమారుడికి స్త్రీపురుషబేధభావము లేదు; అంతేకాక ఆయన నిర్వికల్పుడు; మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు; నీకు, ఆయనకు ఎంతో భేదం ఉంది” అని అన్నారట; అటువంటి శుకబ్రహ్మ కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు; హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు; పిచ్చివాడిలా, మూగవాడిలా, జడుడునిలా ఉండే ఆ మహర్షి, రాజర్షియైన పరీక్షిన్మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది; శ్రీమహాభాగవత సంహితను చెప్పడానికి ఎంతో కాలంపడుతుంది; దానిని శుకబ్రహ్మ వచించంటం ఎలా జరిగింది; అంతేగాక మహావిరాగి యైన ఆ శుకయోగి గృహస్థుల ఇండ్లలో గోవు పాలు తీసేటంత సేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన గో దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ పుణ్యతీర్థాలౌతాయని పెద్దలు అంటారు; అట్టి మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరీక్షిన్నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి, ఏమేమేం చేసాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము.
1-79-సీ.సీస పద్యము

పాండవ వంశంబు బలము మానంబును;
వర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ;
బరిపంథిరాజులు భర్మాది ధనముల;
నర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ;
గుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు;
సొచ్చి చెండాడెనే శూరు తండ్రి;
గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు;
విడిపించి తెచ్చె నే వీరుతాత;
1-79.1-ఆ.
యట్టి గాఢకీర్తి యగు పరీక్షిన్మహా
రాజు విడువరాని రాజ్యలక్ష్మిఁ
బరిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై
యసువు లుండ, నేల యడఁగి యుండె?
పాండవ = పాండవుల యొక్క; వంశంబు = వంశమునకు; బలము = శక్తియు; మానంబును = గౌరవమును; వర్ధిల్లన్ = అధికమగునట్లు; కడిమిన్ = పరాక్రమముతో; ఎవ్వాఁడు = ఎవడైతే; మనియెన్ = జీవించాడో; పరిపంథి = శత్రు; రాజులు = రాజులు; భర్మ = బంగారము; ఆది = మొదలగు; ధనములన్ = సంపదలతో; అర్చింతురు = పూజిస్తారో; ఎవ్వని = ఎవని యొక్క; అంఘ్రి = పాద; యుగమున్ = ద్వయమును; కుంభజ = ద్రోణుడు {ద్రోణుడు - కుంభములో (ద్రోణిలో) పుట్టినవాడు}; కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు (వారి); కురు = కౌరవ; భట = సైనిక; వ్యూహంబున్ = వ్యూహమును; సొచ్చి = ప్రవేశించి; చెండాడెన్ = ఖండించాడో; ఏ = ఏ; శూరు = శూరుని; తండ్రి = తండ్రి; గాంగేయ = భీష్ముని {గాంగేయుడు - భీష్ముడు - గంగ యొక్క పుత్రుడు}; సైనిక = సైనికులచే; ఆక్రాంత = ఆక్రమింపబడిన; గో = ఆవుల; వర్గంబు = మందను; విడిపించి = విడిపించి; తెచ్చెన్ = తెచ్చాడో; ఏ = ఏ; వీరు = వీరుని; తాత = పితామహుడు;
అట్టి = అటువంటి; గాఢ = గాఢమైన / దట్టమైన; కీర్తి = కీర్తికలవాడు; అగు = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; రాజు = రాజు; విడువన్ = విడుచుటకు; రాని = తగని; రాజ్య = రాజ్యమను; లక్ష్మిన్ = మహా సంపదను; పరిహరించి = విసర్జించి; గంగన్ = గంగలో; ప్రాయోపవిష్టుఁడు = ప్రాయోపవేశమున ఉన్నవాడు / మరణాయత్త దీక్షుడు; ఐ = అయ్యి; అసువులు = ప్రాణములు; ఉండన్ = ఉండగనే; ఏల = ఎందులకు; అడఁగి = అణగి; ఉండెన్ = ఉండెను.
ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు; తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, గౌరవప్రతిష్ఠలు వర్థిల్లునట్లు ప్రవర్తించిన వాడు; పరరాజ్యపాలకులు అందరు బంగారురాసులు తీసికొచ్చి ఆయన కాళ్ల ముందు క్రుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు; ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు; ఆయన తాత యైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు; అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి, గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది.
1-80-ఉ.ఉత్పలమాల

ఉత్తమకీర్తులైన మనుజోత్తము లాత్మహితంబు లెన్నడుం
జిత్తములందుఁ గోరరు హసించియు, లోకుల కెల్ల నర్థ సం
పత్తియు భూతియున్ సుఖము భద్రముఁ గోరుదు రన్యరక్షణా
త్యుత్తమమైన మేను విభుఁ డూరక యేల విరక్తిఁ బాసెనో?
ఉత్తమ = ఉత్తమమైన; కీర్తులు = కీర్తిగలవారు; ఐన = అయినట్టి; మనుజ = మానవులలో; ఉత్తములు = ఉత్తములు; ఆత్మ = స్వంత; హితంబులు = మేలు; ఎన్నడున్ = ఎప్పుడును; చిత్తము = మనస్సుల; అందున్ = లోపల; కోరరు = కోరుకొనరు; హసించియు = నవ్వులకైనా; లోకుల = లోకుల; కున్ = కు; ఎల్లన్ = సమస్తమైన; అర్థ = ధన; సంపత్తియున్ = సంపదను; భూతియున్ = వైభవమును; సుఖమున్ = సౌఖ్యమును; భద్రమున్ = క్షేమమును; కోరుదురు = వాంఛింతురు; అన్య = ఇతరులను; రక్షణ = రక్షించుట అనే; అతి = మిక్కిలి; ఉత్తమము = ఉత్తమము; ఐన = అయినట్టి; మేనున్ = శరీరము; విభుఁడు = రాజు; ఊరక = ఊరికే; ఏల = ఎందుకు; విరక్తిన్ = వైరాగ్యముతో; పాసెనో = విసర్జించెనో.
అత్యుత్తమ కీర్తి ప్రతిష్ఠలు కల మానవోత్తములు నవ్వులాటకైనా ఆత్మ సుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు; అట్టి వారు ఎల్లప్పుడూ లోకంలో అందరికీ అర్థసంపద, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సూ చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు; పరోపకార పారీణమైన తన దేహాన్ని ఆ ప్రభువరేణ్యుడు ఆవిధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో?
1-81-క.కంద పద్యము

సారముల నెల్ల నెఱుగుదు
పారగుఁడవు భాషలందు బహువిధ కథనో
దారుఁడవు మాకు సర్వముఁ
బారము ముట్టంగఁ దెలియఁబలుకు మహాత్మా!"
సారములన్ = సారాంశములను; ఎల్లన్ = సమస్తమును; ఎఱుగుదు = తెలిసికొన్నవాడివి; పారగుఁడవు = పారంగతుడవు; భాషలు = వ్యాఖ్యానముల; అందున్ = లో; బహు = అనేక; విధ = విధములైన; కథన = కథలు చెప్పుటలో; ఉదారుఁడవు = ఉదారముగా ఉండువాడవు; మాకు = మాకు; సర్వమున్ = అన్నీ; పారము = మూలము; ముట్టంగన్ = చిక్కునట్లుగ; తెలియన్ = తెలియునట్లుగ; పలుకుము = చెప్పుము; మహా = గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా.
ఓ మహానుభావా! సూతా! నీవు సమస్త గ్రంథాల సారం తెలిసినవాడివి; భాషణలు అన్నీ బాగా తెలిసినవాడివి; అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కిలి నేర్పరివి; ఇప్పుడు మేము అడిగిన విషయాలన్ని, ఆ మూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు.”

కామెంట్‌లు లేవు: