8, సెప్టెంబర్ 2020, మంగళవారం

*చదువు*/

ఈరోజు (8-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *చదువు*//🌹ఇప్పుడు భారత సమాజంలో బాగా నలుగుతున్న అతిముఖ్యమైన అంశాల్లో ఒక ప్రధాన అంశం "చదువు". ఎన్నో ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని రూపకల్పన చేస్తోంది. ఈ విధానం ఇంకా సమగ్రంగా తెలియాల్సి వుంది. ఇందులో ఆచరణశీలత ఇంకా గమనించాల్సి వుంది. చదువు ఒత్తిడి తగ్గాలి, విశ్లేషణాత్మక ధోరణి పెరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా విధానంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో కలిసి రాష్ట్రాల గవర్నర్లతో వర్చువల్ సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జ్ఞానం -ఉపాధి రెండూ అందించే విద్యావ్యవస్థ కావాలన్నదే ఎక్కువమంది అభిప్రాయంగా తెలుస్తోంది. సంస్కారం అనే అంశాన్ని మనం మిస్ అవుతున్నాము.చదువది ఎంత కల్గిన.. రసజ్ఞత ఇంచుక చాలకున్న.. ఆ చదువు నిరర్ధకంబు..గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్... అనే వాక్యాలు ఇప్పటికీ, ఎప్పటికీ అత్యంత విలువైనవి.కొత్త విధాన రూపకల్పనలో ఈ రసజ్ఞతను కూడా నిపుణులు గుర్తు పెట్టుకోవాలి. ఒకప్పటి భారతీయమైన జ్ఞాన సంపదను,సంప్రదాయాన్ని అందిపుచ్చుకుంటూ, ఆధునిక ప్రపంచంలో రాణించాలి, చదివే చదువు వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికీ ఉపయోగపడాలన్నది,ప్రధాన మార్గంగా, కొత్త విద్యావిధానంపై ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడుతున్నారు. సాంకేతికత, కళలు, భాషలు, క్రీడలు, సంస్కృతికి పెద్దపీట వేసే విధంగా మన కొత్త చదువులు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రజల నుండి నిపుణుల నుండి కూడా అభిప్రాయాలు సేకరించి, క్రోడీకరించి నవీన విధానాన్ని నిర్మాణం చేస్తామంటున్నారు. నిజంగా ఇది ఆచరణలో జరిగితే మంచిదే. ఎంతవరకు సాధిస్తామన్నది పెద్ద ప్రశ్న. దేశం బోలెడు సవాళ్లు ఎదుర్కుంటోంది. ఆర్ధికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టిన కాలంలో, ఉన్నత విద్యా సముపార్జన చాలామందికి అందని ద్రాక్షగానే మిగులుతోందన్నది చేదునిజం. చదువు అత్యంత ఖరీదైన వస్తువై కూర్చుంది. విద్య పెద్ద వ్యాపారంగా రాజ్యమేలుతోంది. ప్రెవేట్ -ప్రభుత్వ విద్యాలయాల మధ్య బోధనలో, నాణ్యతలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థులలోనూ, అధ్యాపకుల లోనూ ప్రతిభకు లోటు లేదు. ఉన్నదంతా వ్యవస్థలోనే. ప్రభుత్వ విద్యాలయాల్లో వసతుల కొరత, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఫీజుల మోత మారనంత కాలం భారతదేశంలో విద్యా వ్యవస్థ బాగుపడదు. సృజనాత్మకత, పారదర్శకత, ఆధునికత, సాంకేతికత మొదలైన పడికట్టు పదాలు వినటానికి బాగానే ఉంటాయి. ఆచరణలోనే అసలు రంగు బయటపడుతుంది. ఎందరో పేద విద్యార్థులు తాము కోరుకున్న చదువు చదువుకోలేకపోతున్నారు. ఎన్నో విద్యాలయాల్లో ఉన్న ప్రతిభావంతులైన, నిజాయితీ కల్గిన అధ్యాపకులు చాలీ చాలని జీతాల మధ్య ఆకలి కేకలు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు సోమరిపోతుల్లా మారిపోతున్నారు. ఈ వ్యత్యాసాలు పోవాలి. కరోనా ప్రభావంతో చిన్న, మధ్య తరగతి విద్యాలయాలు మూతకు గురవుతున్నాయి. తరగతి గదుల్లో పాఠాలు చెప్పవలసిన గౌరవనీయమైన ఉపాధ్యాయులు కొందరు బతుకుదెరువు కోసం కూలిపనులకు కూడా వెళ్తున్నారు. కొన్ని చిన్న పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు భవిష్యత్తు ప్రశ్నగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ దుర్భర పరిస్థితి నుండి ఇటువంటి విద్యాలయాలకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కరోనా నిబంధనల వల్ల ఆన్ లైన్ లో బోధన సాగుతోంది. చాలామంది విద్యార్థులు దీన్ని అందుకోలేక బిక్కమొహం వేస్తున్నారు.పరీక్షలను విద్యార్థులకు వత్తిళ్ళుగా మార్చిన పాపం మన పాలకులదే. అక్షరాస్యత-జ్ఞానం -ఉపాధి -వికాసం మధ్య సమతుల్యత, సంయోజనంలేని విద్యావ్యవస్థలోనే ఆధునిక విద్యావిధానం చాలా ఏళ్ళుగా సాగింది. నాణ్యత, ప్రయోజనంతో పాటు మాధ్యమం కూడా ఇప్పుడు చర్చనీయాంశం. అన్ని రాష్ట్రాల విద్యా విధానం ఓకే తీరులో లేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నడిచే విద్యా విధానం వేరు, రాష్ట్రాల విధానం వేరుగా సాగుతోంది. ప్రాంతీయతను కాపాడుకుంటూ, జాతీయ భావంతో, ప్రపంచ దృక్పధంతో సాగే సరికొత్త, సమగ్ర, సంపూర్ణమైన విద్యా విధానం రూపకల్పన జరగాలి. సాంఘిక శాస్త్రాలు, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్, ఇంజినీరింగ్, భాషా శాస్త్రాలు, కళలు మొదలైన ఏ సబ్జెక్టు చదివినా, చదివిన విద్యార్థికి జ్ఞానంతో పాటు ఉపాధికి తోడ్పాటును అందించే విధంగా ఉండాలి. ప్రస్తుతం, కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంది. చాలా కోర్సులు అప్రాధాన్యమైపోయాయి. ఈ ధోరణి మారాలి. ప్రతి సబ్జెక్టుకు డిమాండ్ పెరగాలి. వృత్తి విద్యలను ప్రవేశం పెట్టడంలో ఆచితూచి అడుగు వెయ్యాలి. అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి,అన్న చందంగా వృత్తివిద్యను చిన్ననాట ప్రవేశ పెట్టడంపై పునరాలోచించాలి.పిల్లలకు ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యం. ప్రపంచంలోని ఉత్తమ విద్యాలయాలకు దీటుగా మనం ఉన్నామా, అనే ప్రశ్న వేసుకుంటే, చాలా చోట్ల వెనుకబడే ఉన్నాం.కేవలం సర్టిఫికెట్స్ పొందడం, మార్కులు తెచ్చుకోవడం తప్ప, జ్ఞాన సముపార్జన, మానసిక వికాసం సంయుక్తంగా కలిగించే వాతావరణానికి మనం దూరమై చాలా కాలమైంది. చాలా అంశాల్లో ఓనమాల (ఏ బి సి డీ లు ) నుండే మనం మొదలు పెట్టాలి. విద్యారంగానికి, పరిశోధనలకు బడ్జెట్లు పెరగాలి. పరిశోధకులకు ప్రోత్సాహకాలు పెరగాలి. సంపూర్ణ, పరిపూర్ణ ఆహారంలాంటి విద్యా వ్యవస్థను నిర్మించడం అంత తేలిక కాకపోయినా, ఆ దిశగా ప్రయాణం చేద్దామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్పం ఎంతో అభినందనీయం. విద్యా వ్యవస్థలో ఎవరెవరి జోక్యం ఎంతెంత ఉండాలి, ఎంతవరకూ ఉండాలి అన్నది కీలకం. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నూతన విద్యా విధానంపై ఇంకా పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. నూతన సమాజాన్ని నిర్మించుకోవడంలో చిత్తశుద్ధి, సృజన, ఆచరణశీలత ముఖ్యమని భావించాలి. కొత్త విద్యా విధానం ఇంకా గందరగోళంగానే ఉంది. స్పష్టత రావాలి. ఫెడరల్ హక్కులు ఎలా ఉన్నా, నూతన విద్యా విధాన నిర్మాణం -ఆచరణలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిమెలిసి సాగాలి. ఓటుబ్యాంకు రాజకీయాల మధ్య ఏర్పరచిన రిజర్వేషన్ల వ్యవస్థలో ఉత్తమమైన పేద విద్యార్థులు ఎందరో ఉన్నత విద్యలు చదవలేకపోయారు.చదవలేకపోతున్నారు.సామాజిక అసమానతలను తొలగిస్తూనే, ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి విద్యార్థి ఉన్నత విద్యలు చదువుకునే వాతావరణం కల్పించాలి.ఉద్యోగ,ఉపాధి కల్పనలో పేదరికం,ప్రతిభ, సామాజికమైన వెనుకుబాటుతనం ఆధారంగా అవకాశాలు కలిగించాలి.సిలబస్ తో పాటు ఇటువంటి వ్యవస్థల్లోనూ ప్రక్షాళన జరిగినప్పుడే ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్న నూతన విద్యా విధానానికి నూతనత్వం వస్తుంది. -మాశర్మ🙏

కామెంట్‌లు లేవు: