8, సెప్టెంబర్ 2020, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
మహాశివరాత్రి అన్నదానం..

మహా శివరాత్రి సందర్భంగా మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించడానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తుంటాము...మహాశివరాత్రి అన్నదానానికి సంభందించిన ఓ సంఘటన..ఆపై శ్రీ స్వామివారి లీల..ఈరోజు చదువుకుందాము..

మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పెద్ద వేడుకగా జరుగుతుంది..ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఆరోజు వేలాదిమంది శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకోవటానికి వస్తుంటారు..భక్తుల రాక పోకల కొరకు RTC వారిచే దాదాపు 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేయబడతాయి..కోలాహలంగా ఉంటుంది..

2009 వ సంవత్సరం లో వచ్చిన మహాశివరాత్రి నాడు భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలని సంకల్పించాము..మధ్యాహ్నం మరియు రాత్రికి కలిపి సుమారు ఇరవై వేల మందికి అన్నప్రసాదం అందించాలని మా భావన..దాతల నుంచి విరాళాలు సేకరించి..ఆ కార్యక్రమం పూర్తి చేయాలని అనుకున్నాము..మహాశివరాత్రి కి పదిహేను రోజులు ముందు..శ్రీ స్వామివారికి శిష్యుడిని అని చెప్పుకునే ఓ వ్యక్తి మాకు సమాచారం పంపించాడు..ఈసారి మహాశివరాత్రికి చేసే అన్నదానానికి అయ్యే మొత్తం వ్యయం తానే భరిస్తాననీ..తన తాలూకు మనుషులు వచ్చి ఆ ఏర్పాట్లు చూసుకుంటారనీ..వర్తమానం పంపాడు..మేమూ సంతోషించి..సరే అన్నాము.. అన్నదానం గురించి ఇక ఆలోచించకుండా..భక్తులకు చేయాల్సిన ఇతర సౌకర్యాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వున్నాము..

సరిగ్గా మహాశివరాత్రి ఇక నాలుగురోజులున్నది..నేను శ్రీ స్వామివారి మందిరం లో వున్నాను..అప్పుడు.."మేము ఈసారి మహాశివరాత్రి నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద అన్నదానం చేయడం లేదు..మాకు కొద్దిగా ఇబ్బంది వచ్చింది..మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి.." అని ఆ శిష్యుడి తాలూకు మనుషులు వచ్చి చెప్పారు..

ఒక్కసారిగా అయోమయంలోపడిపోయాను..నేను..ఎందుకంటే..ఇప్పటికిప్పుడు ఇరవై వేలమందికి అన్నదానానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం కుదరని పని..శ్రీ స్వామివారి మందిరం వద్ద మహాశివరాత్రి నాడు రెండుపూటలా భక్తులకు ఉచిత అన్నదానం ఉందని..ఊరూ వాడా ప్రచారం చేసి వున్నాము..ఏది మార్గం?..

కళ్ళముందు కనబడుతున్న ఒకే ఒక్క ఆధారం..శ్రీ స్వామివారిని శరణు వేడటం...ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా..శ్రీ స్వామివారి సమాధి ముందు మేము దంపతులిద్దరమూ నిలబడి.."స్వామీ..నా ప్రయత్నం చేస్తాము..కానీ ఈ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపే బాధ్యత నీదే.." అని మనసులో గట్టిగా మ్రొక్కుకొని..ఇవతలికి వచ్చేసాము..

సుమారు రెండు లక్షల రూపాయల పై చిలుకు ధనం అవసరం అవుతుంది..వంటవాళ్లు కావాలి..పనివాళ్ళు..వడ్డన చేసే వాళ్ళు..అందరినీ మాట్లాడాలి..సమయం లేదు..చేతిలో డబ్బూ లేదు..ఆపూట గడిచిపోయింది..సరే..ముందు కందుకూరు వెళ్లి వంటవాళ్లను మాట్లాడుకుందాము..ఊరికే కూర్చుంటే ఫలితం రాదు..తెలిసిన వాళ్ళను సహాయం అడుగుదాము అని కందుకూరు బయలుదేరాను..ఫోన్ మోగింది..

"హలో..ప్రసాద్ గారేనా.." అన్నారు అవతలి నుంచి..

"అవునండీ..తమరూ...." అన్నాను..

"నేను..కుంచాల శ్రీనివాసరావు నండీ..ఈమధ్య మొగలిచెర్ల గుడికి మీతో పాటు వచ్చాను..గుర్తుపట్టారా?.." అన్నారు..

గుర్తుపట్టాను..కందుకూరులో వుంటారు..ఒక్కసారే పరిచయం..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లారు.."ఏం చేస్తున్నారు?.." అని అడిగారు..

ఆ సమయానికి ఆయనతో ఉన్న పరిచయం చాలా తక్కువ..అయినా..నా మనసులో ఉన్న ఆందోళన చెప్పాను.."అలా జరిగిందా..ఇప్పుడేమి చేద్దామని ఆలోచిస్తున్నారు?.." అన్నారు..

ఆ స్వామి వారి మీదే భారం వేసాను అని చెప్పి..ఫోన్ పెట్టేసాను.. మళ్లీ ఫోన్ మోగింది..ఈసారి కూడా ఆయనే.."ప్రసాద్ గారూ..అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది?..మీ అంచనా ఎంత?.." అన్నారు..ఈయన కొద్దిగా విరాళం ఇస్తారేమో..సరే..చూద్దాం అనుకొని..

"సుమారు రెండు లక్షల పై నే అవుతుందండీ..అయినా ఇప్పటికిప్పుడు దాతలు దొరకాలి కదా!.." అన్నాను..
ఒక్కక్షణం నిశ్శబ్దంగా వున్నారు ఫోన్ లో..ఆ తరువాత..

"ప్రసాద్ గారూ..నేను విశాఖపట్నం లో వున్నాను..మీరు నేరుగా కందుకూరు లోని మా ఆఫీస్ కు వెళ్ళండి..వాళ్లకూ నేను ఫోన్ చేసి చెపుతాను..మీరు అన్నదానం ఎలా చేయాలని అనుకున్నారో..మా వాళ్లకు చెప్పండి..అన్నీ వాళ్ళు చూసుకుంటారు..నేను ఆరోజుకు అక్కడికి వస్తాను..మీరేమీ ఆందోళన పడొద్దు..ఈసారి శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేసే అవకాశం నాకు ఇవ్వండి.." అన్నారు..

నాకు నోటమాట రాలేదు..కొద్దిసేపటి క్రితం దాకా అయోమయం లో ఉన్న నాకు..ఒక్కసారిగా నా పై నుంచి పెద్ద బరువు దిగినట్లు అనిపించసాగింది..

శ్రీ స్వామివారు అన్నదానం విషయం లో తన మహిమ చూపారు..

శ్రీ శ్రీనివాసరావు గారు ఆ శివరాత్రికి మాత్రమే కాకుండా..వరుసగా మూడు సంవత్సరాలు ప్రతి శివరాత్రికి శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు..

అప్పుడే కాదు..మరెన్నడూ కూడా.. శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానానికి ఏలోటూ రాలేదు..ఎందుకంటే..మా పరిమిత జ్ఞానం తో ఉన్న పర్యవేక్షణ కన్నాశ్రీ స్వామివారి పర్యవేక్షణ గొప్పది కదా!!

శ్రీ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణకు మీరు కూడా మీ వంతు సహకారం అందించవచ్చు..

సర్వం..
శ్రీ దత్తకృప!

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: