8, సెప్టెంబర్ 2020, మంగళవారం

పంచదశాక్షరీ మంత్ర రహస్యం

శ్రీ మాత యొక్క పంచదశాక్షరీ మంత్ర రహస్యం ...!?

ఈ విషయాన్ని గూర్చి శంకరులు, "సౌందర్యలహరి" లోని 32 వ శ్లోకాన్ని, ఇలా రచించారు,

శివ శ్శక్తిః కామః - క్షితి రథ రవి శ్శీతకిరణః
స్మరో హంస శ్శక్ర - స్తదను చ పరామారహరయః
హ్యమీ హృల్లేఖాభి -రవసానేషుఘటితాః 
భజన్తే వర్ణాస్తే - తవ జనని ! నామావయవతామ్

"ఈమ్" కామకళా బీజము. ఆ బీజాన్ని జపించి, 
"హ-స-క-ల-హ్రీం, హ-స-క-హ-ల-హ్రీం, స-క-ల-హ్రీం" అనే పంచదశాక్షరీ మంత్రముతో అమ్మవారిని ఆరాధించాడు విష్ణువు.

దీనినే, "హాదివిద్యా" అంటారు.

ఇక మన్మధుడు అయితే, " క-ఏ-ఈ-ల-హ్రీం- ,
హ-స-క-హ-ల-హ్రీం, స-క-ల-హ్రీం" అన్న కాదివిద్యా మంత్రముతో అమ్మవారిని ఆరాధించాడు.

ఈ హాదివిద్యా, కాదివిద్యా, వామకేశ్వరతంత్ర గ్రంధములో చెప్పబడ్డాయి.

1) మొదటి ఖండము, వాగ్భవ కూటము - అగ్ని దేవతాక ఖండము ( క-ఏ-ఈ-ల-హ్రీం )

2) రెండవ ఖండము, కామరాజ కూటము-
 సూర్య దేవతాక ఖండము ( హ-స-క-హ-ల-హ్రీం )

3) మూడవ ఖండము, శక్తి కూటము-
 చంద్ర దేవతాక ఖండము ( స-క-ల-హ్రీం )

ఈ యొక్క మంత్ర రాశిని, ఈ శ్లోకము ద్వారా, శంకరులు ఎలా నిక్షిప్తం చేశారో ఇప్పుడు గ్రహిద్దాం. ( హాదివిద్యా ) (కొందరి వాదన ప్రకారము)

శివ = హ , శ్శక్తిః = స, కామః = క, క్షితి = ల ( హ-స-క--ల- కలిసి ఒక వర్గము )

రవిః = హ , శ్శీతకిరణః = స, స్మరః = క, హంసః = హ , శ్శక్రః = ల ( హ-స-క-హ-ల- కలిసి ఒక వర్గము )

పరా = స, మారః = క, హరి = ల.
( స-క--ల- కలిసి ఒక వర్గము )

ఈ వర్గములకు చివర " హ్రీం " చేర్చాలి.
( ఈ మంత్రాన్ని లోపాముద్రాదేవి అర్చించిందని చెపుతారు.)

కూటము అనగా ఏమిటి...!? కూటము అనగా సమూహము.ఎన్ని సమూహాలు ఉన్నాయి...!?

మన ఉపాదిలోనే అనగా శరీరంలోనే మరియూ ఈ ప్రపంచములోనూ, ఎన్నో కూటములు ఉన్నాయి.

 శ్రీ లలితా సహస్రనామములో వశిన్యాది వాగ్దేవతలు, మూడు కూటముల గురించి, కుండలినీ గురించి ఇలా ప్రస్తావించారు.

"శ్రీమద్వాగ్భవకూటైకస్వరూప ముఖ పంకజా,
కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ, 
శక్తి కూటైకతాపన్న కట్యధోభాగధారిణీ....."

"కులామృతైకరసికా, కులసంకేతపాలినీ,కులాంగనా, కులాంతస్ధా, కౌళినీ, కులయోగినీ, అకులా, సమయాంతస్ధా, సమయాచారతత్పరా, మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ, మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంధి విభేదినీ,అజ్ఞాచక్రాంతరాళస్ధా రుద్రగ్రంధి విభేదినీ, సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ, తటిల్లతా సమరుచిః,ష్షట్చక్రోపరిసంస్ధితా, మహాశక్తిః కుండలినీ" బిసతంతు తనీయసీ"

వాక్కు ముఖము ద్వారానే వెలువడుతున్నది కనుక, ముఖము అంతా వాగ్భవకూటైకస్వరూపమే.
కంఠము నుండి కటి వరకు మధ్యకూట స్వరూపము. కటి అధోభాగము శక్తికూటము.

ఈ మూడు కూట స్వరూపములుగా అమ్మవారు మన దేహములోనే ఉన్నారు.

ఈ మూడు కూటములే మనలోని, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, సత్వ, రజో, తమో గుణాలు............. ( త్రిపుర సుందరి )

గ్రంధి అనగా ముడి. ఆ ముడి విడివడితేనే మనకు సఫలత. దుర్గామాత యొక్క కుండలినీ సాధన వల్ల, బ్రహ్మ గ్రంధి విడివడగానే, సాధకుడు త్రికాల జ్ఞాని అవుతాడు.

పంచదశికి "శ్రీం" బీజం చేరిస్తే, 'షోడశాక్షరీ' విద్య అవుతుంది.

ఇప్పుడు ఈ శ్లోకంలోని, 'కాది' విద్యను పరిశీలిద్దాం.

"శివ శ్శక్తిః కామః - క్షితి" : - 

శివః అనే శబ్దము త్రిపుర సుందరి ప్రకృతి అయిన 'క' కారమును, శక్తి అనే శబ్దము ప్రకృతి భూతమైన 'ఏ' కారమును, కామః అనే శబ్దము 'ఈ' కారమును, క్షితి అనే శబ్దము 'ల' కారమును సాంకేతికంగా తెలుపుతాయి. వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక, క-ఏ-ఈ-ల-హ్రీం- )

అలాగే, రవిః = హ , శ్శీతకిరణః = స, స్మరః = క, హంసః = హ , శ్శక్రః = ల . వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక, హ-స-క-హ-ల-హ్రీం- )

"తదను చ పరామారహరయః = "స-క-ల-".
 వీటి చివర ,-హ్రీం- , చేరుతుంది. (కనుక,స-క-ల-హ్రీం- )

ఈ బీజాక్షరమములే, శ్రీ మాత యొక్క స్వరూపము. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన శరీరములు మాంస మయములు.దేవతా శరీరములు మంత్ర మయములు. మనవి రోమములు. అమ్మవారివి రశ్ములు ( కిరణములు) . అమ్మవారే పరబ్రహ్మ .

              శ్రీ శంకర భగవత్పాద విరచిత
                     
                          సౌందర్య లహరి.

సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.

శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹🌹🌺🌹

కామెంట్‌లు లేవు: