8, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ఓ మనిషీ మేలుకో*

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹


అప్పుడెప్పుడో వాడి స్వార్థం కోసం
మనింటి పైకప్పు మీద నాటిన ఇంగ్లీషు చెట్టు
ఇప్పుడు గోడల్ని విరగ్గొట్టి
పునాదుల్ని పెకళిస్తోంది
కూలుతున్న భాషల గోడ క్రింద
కనుమరుగవుతున్న సంస్కృతి
ఇప్పుడెవరికీ పట్టని అనాధ

అందంగా ఉందని పరభాషా విత్తును తెచ్చి
పెరట్లో పాతుకున్నాం
కాన్వెంట్లనీ కార్పొరేట్‌ స్కూళ్లనీ
నీళ్ళూ ఎరువూ వేసి పెంచుకున్నాం
అదిప్పుడు పెనువృక్షమై జడలు విప్పుకుంది
పచ్చని దేశీయ భాషా మొక్కలన్నీ
ఒక్కొక్కటిగా చచ్చిపోతుంటే
అమ్మభాష రాదని గర్వంగా చెప్పుకునే వెర్రితనాల్ని చూసి
వెక్కివెక్కి ఏడుస్తోన్న కన్నపేగు దుఃఖం ఇప్పుడొక అరణ్య రోదన!

భాషలే కదా అనుకుంటాం
వెచ్చని అమ్మ పొత్తిళ్ళని మరిచిపోతాం
వాక్యాలే కదా అనుకుంటాం
మనసును మీటే వీణ తీగలని గుర్తుంచుకోం
పదాలే కదా అనుకుంటాం
జీవం పోసే నదాలనుకోం

*అక్షరాలే కదా అనుకుంటాం*
*మూలాల్ని మోసుకెళ్లే భుజాలని తెలుసుకోం*
*మరణిస్తున్నవి మాటలే కదా అనుకుంటాం*
*మన గొంతూ మన గౌరవం*
*మన ఆత్మ అని గ్రహించేదెప్పుడు?*
*సేకరణ* :
*శ్రీ సాంబమూర్తి లండ గారి సౌజన్యంతో*

కామెంట్‌లు లేవు: