8, సెప్టెంబర్ 2020, మంగళవారం

శివామృతలహరి


 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
స్తుతిపాత్రంబు వసంతమౌ శివజటాజూటంబు;గ్రీష్మంబు జృం
భిత ఫాలాగ్ని ; జటాకటాహమున పింపిళ్ళాడు స్వర్గంగ ఆ
తతవర్షంబు;శశాంక ఖండము శరత్కాలంబు: హేమంతమూ
ర్జిత కైలాసము ; యోగమౌ శిశిరమున్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;

ఆరు ఋతువులను ప్రకృతి నాధుడైన శివుని లో దర్శింప జేశారు ఈ పద్యములో నాన్నగారు.

"గొప్పగా కీర్తింప దగ్గ శివదేవుని జటాజూటం వసంత ఋతువును తలపిస్తున్నదట.
అగ్నిజ్వాలలు వెదజల్లే శివుని మూడవ కన్ను గ్రీష్మ ఋతువులా అగుపిస్తున్నదట.
ఒక పెద్ద కడవలా ఉన్న శివ జటాజూటంలో నాట్యం చేస్తున్న సురగంగ వర్ష ఋతువుగా కనపడుతోందట.
శివుని శిరస్సు పై భూషణము గా వెలుగొందు అర్ధ చంద్రుడు శరత్ ఋతువు ను తలపిస్తున్నాడట.
దృఢంగా ఉన్నటువంటి కైలాస పర్వతం హేమంత ఋతువును,మరియు యోగ ముద్రలో కూర్చున్న శివుడిని చూస్తే శిశిర ఋతువు గుర్తుకొస్తోందట.
ఆరు ఋతువులు నీలోనే కనపడుతున్నాయి కదా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా! అని ఈ పద్యం లో నాన్నగారు వర్ణించారు.

కామెంట్‌లు లేవు: