3, డిసెంబర్ 2020, గురువారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


ఉద్యోగపర్వం.147


పాండవసేన యుద్ధానికి బయలుదేరుతున్నది.


తూర్పున సూర్యకిరణాలు పైపైకి వస్తున్న తరుణంలో, క్రమశిక్షణా పూర్వక కవాతుతో,  రధాలు, ఏనుగులు, గుర్రాలు   ప్రత్యేక సమూహాలుగా, రెట్టించిన సమరోత్సాహంతో, శంఖనాద, దుందుభీ శబ్దఘోషతో, చతురంగబలాలు సముద్ర కెరటాలు  వువ్వెత్తున పడుతున్నట్లు, పాండవసేన, కురుక్షేత్రం వైపు దూసుకువెళ్తున్నది.   సేనకు ముందు భీమసేనుడు, నకులసహదేవులు వుండి, సేనను వుత్సాహపరుస్తూ వుండగా, వారి వెనుక, ఉపపాండవులు, ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు వున్నారు.  మార్గ ఆయాసం తెలియకుండా, సైనికులు విన్యాసాలు చేస్తూ, దారి పొడవునా, తమకు జేజేలు పలుకుతున్న ప్రజలకు కనువిందు చేసారు.  సేనావాహిని మధ్యలో యుధిష్టురుడు , ఇంద్రసమానుడై వెలిగిపోతున్నాడు.  


సైన్యం ముందునడుస్తూ వుండగా, వారికి కావలసిన ఆహార పదార్ధాలు, గుడారాలు, వైద్య బృందం వారిని వెన్నంటి వున్నాయి, ఎప్పుడు యే అవసరం వచ్చినా చిటికెలో సమకూర్చేందుకు. సేనకు కుడిప్రక్కగా, కృష్ణార్జునులు, కదులుతుండగా వారితో సాత్యకి, మొదలైన యోధులు వున్నారు.   ఉపప్లావ్యంలో ద్రౌపదిని వుంచి ఆమెకు రక్షణగా కొందరు వీరులను వుంచారు.   ఆ విధంగా, పాండవసేన, 40000 రధాలతో, రెండు లక్షల గుర్రాలతో, ఇరవైలక్షల కాల్బలంతో, 60000 ఏనుగులతో, కురుక్షేత్రం జేరింది.  కురుక్షేత్రంలో ప్రవేశించగానే, తమరాకను తెలియజేస్తూ, అర్జునుడు దేవదత్తాన్ని, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, మిగిలినయోధులందరూ వారి వారి శంఖాలను పూరించి  తమసేనలో మరియొకసారి, ఉత్సాహాన్ని నింపారు. 


దుర్యోధనుడు  కూడా, తన పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని పదకొండు భాగాలుగా విభజించాడు.  సునిశిత బుద్ధిగలిగి పరాక్రమవంతులైన  కృపుడు, ద్రోణుడు, శల్యుడు, జయధ్రదుడు, కాంభోజరాజు, కృతవర్మ, అశ్వద్ధామ, కర్ణుడు, భూరిశ్రవసుడు, శకుని, బాహ్లికుడు,  వీరిని ఒక్కొక్క భాగానికి సేనాపతులుగా ఉంచాడు.   ఆపై అందరికీ  చేతులు జోడించి వినమ్రంగా అభివాదం చేసి, భీష్ముని వుద్దేశించి,  ' పితామహా !  ఈ సైన్యానికి సేనాధ్యక్ష స్థానంలో నిలువమని మిమ్ములను ప్రార్ధిస్తున్నాను.  సేన చిందర వందర అవకుండా తగిన సమయంలో మీ మార్గదర్శకత్వంలో సేనను నడిపించండి.  ఇంద్రుడు దేవతాసైన్యాన్ని నడిపించినట్లు, మీరు మన కౌరవసేనను విజయపధంలో నడపవలసినదిగా కోరుతున్నాను.  ' అన్నాడు.   


భీష్ముడు సమాధానమిస్తూ, ' దుర్యోధనా !  నాకు కురుపాండవులిరువురూ సమానమే.  నీ వద్దవుండి, జీవితం వెళ్లబుచ్చుతున్నాను కాబట్టి, నేను నీపక్షాన నిలబడి పాండవులపై, పోరుకు సిద్ధమయ్యాను.  నన్ను యెదుర్కొనగల పరాక్రమవంతుడు యుద్ధభూమిలో,  అర్జునుడు ఒక్కడే.  అతడు సాధ్యమైనంతవరకు, నాకు యెదురుబడి యుద్ధం చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు.  మిగిలిన నలుగురు పాండుసుతులనూ నేను చంపను.  ఆ అయిదుగురను తప్ప, మిగిలినవారిని ఒకే బాణంతో పదివేలమందిని మట్టి కరిపించగలను. '


' దుర్యోధనా !  నేను సర్వసైన్యాధక్షునిగా చేపట్టబోయే ముందు  యింకొక నియమము వున్నది.  యుద్ధభూమిలో ముందు కర్ణునినైనా ప్రవేశించమను, లేదా నేను ముందు ప్రవేశిస్తాను.  కర్ణునికి నాపై వైషమ్యమున్నది.  నేను చేసే ప్రతిపనినీ విమర్శగా చూసి, వాదానికి సిద్ధమౌతాడు. అది నేను సహించను. '  అన్నాడు.   ఆమాటలకు, కర్ణుడు కూడా దీటుగా స్పందిస్తూ, ' మిత్రమా ! గాంగేయుని నిష్క్రమణ తరువాతే, యీ రాధేయుడు యుద్ధరంగంలోనికి వస్తాడు. అర్జునునికి పోటీ యిస్తాడు. '  అని అక్కడ నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.  ఎటూ చెప్పలేని సందిగ్ధంలో, భీష్మ పితామహుని, దుర్యోధనుడు సర్వసేనాపతిగా అభిషిక్తుడిని చేసాడు.  


ఆవిధంగా ధృష్టద్యుమ్నుని సర్వసేనాపతిగా పాండవసేన, భీష్మాచార్యులు సర్వ సేనాధ్యక్షునిగా కౌరవసేన యుద్ధ సన్నాహాలకు అంకురార్పణ చేసాయి.   జరుగుతున్న యుద్ధ సన్నాహాలను తటస్థంగా వుండి వీక్షించడానికి, బలరాముడు  తన అనుచర గణమైన అక్రూరుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు వెంటరాగా, ధర్మజుని వద్దకు వచ్చాడు.  కృషునితో సహా అందరూ లేచినిలబడి ఆయనకు వందనాలు సమర్పించారు.  ' ధర్మజా !  భయంకర సంగ్రామం జరగబోతున్నది.  ఇది దైవనిర్ణయం. అనేక జననష్టము, క్షత్రియ కులవినాశమూ తప్పేటట్లు లేదు.  నా తమ్ముడిని నావలె, యిరుపక్షాలతో సమభావం ప్రదర్శించమని చెప్పాను.  అయినా, ధర్మం మీ పక్షాన వున్నదని, మీతో  శ్రీకృష్ణుడు చేతులు కలిపాడు.  దుర్యోధనుని కోరికమేరకు యాదవ సైన్యాన్ని కౌరవసేనలో కలిపాడు.  ధర్మజా !  జయం మీవైపే ఉన్నట్లు నాకు తోస్తున్నది.  కురువంశ నాశనం నా కళ్లెదుట చూడలేక నేను తీర్థయాత్రలకు వెళ్ళ నిశ్చయించు కున్నాను. స్వస్తి. ' అని చెప్పి బలరాముడు ధర్మరాజును దీవించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు.  


తరువాత, భోజదేశ మహారాజు, రుక్మిణి  సోదరుడు,  రుక్మి,  ఒక అక్షౌహిణీ సైన్యంతో వచ్చి పాండవులకు మద్దతు పలికాడు.  అతి విలువైన మూడు ధనుస్సులలో ఒకటి శార్గవము కృష్ణుని వద్ద వుండగా, గాండీవం రెండవది అర్జునుని వద్ద వున్నది.  మూడవది అయిన ఇంద్రుని చాపము విజయం రుక్మి అధీనంలో వున్నది.  ఆ విషయమే, రుక్మి అర్జునితో   ప్రస్తావిస్తూ, అహంభావంతో, తనసహాయం యెప్పుడు కావలసిన అప్పుడు, పిలిస్తే, వచ్చి విజయచాపంతో, యేకౌరవవీరునైనా వధిస్తానని బీరాలు పలికాడు.  అర్జునునికి రుక్మి ప్రేలాపన నచ్చలేదు.  ' రుక్మీ ! నీవు చేస్తానన్న సహాయానికి కృతజ్ఞుడను.  కానీ సహాయం చేయడానికి నీ అక్షౌహిణీ సైన్యంతో రానక్కరలేదు.  మా పక్షాన ధర్మం వున్నది అనుకుంటే, మాతో వుండు, లేదంటే నీ యిష్టము.  నాకు నీసహాయము అక్కరలేదు.' అన్నాడు.'  దానికి రుక్మి కోపించి దుర్యోధనునికి బాసటగా వుందామని వెళ్లి అర్జునుడు తన సహాయం వద్దన్నాడని చెప్పాడు.  ఆమాటలకు దుర్యోధనుడు కూడా ' వారికి అక్కరలేని నీశౌర్యము మాకూ అక్కరలేదు. ' అని పంపించివేసాడు. ఆవిధంగా వేరు వేరు కారణాలవలన,  బలరాముడు, రుక్మీ వీరిద్దరే, కురుక్షేత్ర భయంకర మహాసంగ్రామంలో పాల్గొనలేదు.  


ఇక, కురుక్షేత్రంలో కురుపాండవులు యుద్ధవ్యూహాలు నిర్మించుకుంటుండగా, హస్తినలో ధృతరాష్ట్రుడు,  అక్కడ యేమి మారణహోమం జరుగబోతున్నదో అని తల్లడిల్లుతూ, 'సంజయా ! కురుక్షేత్రంలోజరుగుతున్న విషయాలేమిటో, నీ దివ్యచక్షువుల ద్వారా దర్శించి నాకు యెప్పటికప్పుడు తెలియజేయి. ' అని వేడుకొనగా, సంజయుడు, ' మహారాజా !  యుద్ధంలోఅనేక భయంకర సంఘటనలు జరుగుతూ వుంటాయి.  మీకు అన్నీ నివేదిస్తాము.  మీరు మనసు రాయి చేసుకుని వినండి. '  అని చెప్పడం మొదలు పెట్టాడు అని జనమేజయునకు, వైశంపాయనుడు చెప్పినట్లుగా, శౌనకాది మహామునులకు సూతమహర్షి చెప్పాడు.


'  ధృతరాష్ట్ర మహారాజా !  ఇరుసేనలూ, కురుక్షేత్రంలో శిబిరాలు యేర్పరచుకున్న తరువాత,  అకారణంగా కేవలం పాండవులను రెచ్చగొట్టాలనే భావనతో దుర్యోధనుడు , శకుని కుమారుడైన ఉలూకుని రాయబారిగా,  సంధినిమిత్తం కాకుండా,  పాండుసేనలో వున్న వీరులందరినీ పరుషవాక్యాలతో దుర్యోధనుడు దూషిస్తూ  తనమాటలుగా, కర్ణ కఠోరమైన పదజాలంతో, నీచాతినీచమైన పదాలతో యెంతో హేళనగా, పాండు నందనులు అయిదుగురినీ, ద్రౌపదిని, శ్రీకృష్ణుని, ద్రుపదుని, దుష్టద్యుమ్నుని, శిఖండిని, అందరినీ పేరుపేరునా అవమానకరంగా దూషించి అవేపలుకులు మార్పు లేకుండా వారికి చెప్పమని ఉలూకుని పంపించాడు.  ధర్మరాజుని వృద్ధ కపట మార్జాలంతో పోల్చాడు.  అందరూ నపుంసకులన్నాడు.  హద్దూ ఆపూ లేకుండా విశృంఖల పద ప్రయోగంతో యెగతాళి చేసాడు, దుర్యోధనుడు.  చేతనైతే, పాండవులు పురుషజన్మ యెత్తిన వారైతే, తమని యుద్ధంలో చంపమని సందేశం పంపించాడు, ఉలూకునితో.


దుర్యోధనుడు వూహించినట్లే పాండవులు కూడా అతని మాటలకు రెచ్చిపోయారు.  అయినా దూతగా వచ్చినవానితో మాట్లాడి లాభమేమున్నదని చివరకు నిర్ణయించుకుని, అర్జునుడు '  ఓయీ ఉలూకా !  దుర్యోధనుని ప్రసంగమంతా తు. చ. తప్పక నీవు చెప్పినదంతా సావధానంగా విన్నామని చెప్పు.  దీని సమాధానం అతని కోరిక మేరకు మేము యుద్ధభూమిలోనే చెబుతామని చెప్పు.  నీవు ఇంక బయలుదేరవచ్చు. ' అని మాత్రం అన్నాడు.


వెళ్ళిపోతున్న ఉలూకుని, అర్జునుడు మళ్ళీ చెయ్యి పట్టుకుని దగ్గరగా లాగుకొని, ' మీ ప్రభువు దుర్యోధనుడు పురుషత్వాన్ని గురించి పదేపదే నీద్వారా చెప్పించాడు కదా !  స్వశక్తిపై ఆధారపడి శత్రువులను జయించేవాడే, క్షత్రియపురుషుడని చెప్పు. ఇతరుల బలంపై ఆధారపడి జననష్టం కలుగజేసేవాడు, అధమ క్షత్రియుడని కూడా చెప్పు, మీ ప్రభువుకు.  మా అన్నగారు భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలు మాకందరికీ జ్ఞాపకం వున్నాయని చెప్పు. బహుశా అతడే మర్చిపోయి వుంటాడు. ' అని అన్నాడు.  భీమసేనుడు కూడా వుద్రేకపూరితంగా మళ్ళీ మాట్లాడబోతుండగా, ' ధర్మరాజు ఉలూకుని తొందరపెట్టి బయలుదేరదీసాడు. 


దుర్యోధనుని తెంపరితనానికీ, అతడి వాచాలత్వానికీ, ఉలూకరాయబారం ఒక చక్కని ఉదాహరణ.  ఇరువర్గాలు యుద్ధసన్నాహాలలో రణరంగాన్ని చేరినవేళ, ఉలూకుని చే పంపిన రాయబార సందేశం ప్రత్యేకంగా యేమీలేదు. అందరినీ నిర్లజ్జగా అవహేళనగా తూలనాడి, యుద్ధభూమిలో తమని చంపమని పంపిన అభ్యర్ధన తప్ప.


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: