3, డిసెంబర్ 2020, గురువారం

శ్రీకృష్ణ శతకము*

 *శ్రీకృష్ణ శతకము*


*అనుదినము కృష్ణశతకము*

*వినిన బఠించినను ముక్తి! వేడుకగలుగున్!*

*ధనధాన్యము గో గణములు!*

*తనయులు నభివృద్ధిపొందు! దద్దయు కృష్ణా!*


ఓ కృష్ణా! ప్రతి దినమును ఈ కృష్ణ శతకము వినిన వారికి, చదివినవారికి పరలోకమందు ముక్తియు, ఈ లోకమందు ధన ధాన్య గోగణ పుత్రాభివృద్ధియు విశేషముగా గలుగును.


============================


ఆధ్యాత్మికతను స్వంతం చేసుకుని జీవించే వారి పట్ల మనకు ఆరాధనా భావం కలుగుతుంది. జ్ఞానులు, ప్రవక్తలు మొదలైన మహాత్ములంతా ఈ కోవకు చెందినవారే. వారికీ మనకూ మధ్య తేడా ఏమిటి అనేది గమనిద్దాం.


వారిలో మృదుత్వం, పారదర్శకత్వం అధికంగా ఉంటాయి.


ఒక సాధారణ కిటికీ అద్దాన్ని మనం పట్టించుకోక వదిలివేస్తే అది దుమ్ము ధూళితో కప్పబడి తన పారదర్శకతను కోల్పోతుంది, తిరిగి శుభ్రం చేసినపుడే దాని నుండి వెలుగు ప్రసరితమవుతుంది.


అదే విధంగా మనలో సందేహం, స్వార్థం, దాస్య భావనల ధూళి పేరుకుని ఉన్నది. వాటిని తుడిచి వేయగలిగితే స్వతః సిద్ధమైన ఆత్మస్వరూపం ప్రకాశవంతంగా గోచరమవుతుంది.


ప్రకాశవంతమైన కాంతి ఉనికి సర్వదా మన చుట్టుముట్టి ఉన్నది, దానిని గుర్తించగలగాలి. మనం అంధకారంలో మునిగి ఉండవలసిన ఆవశ్యకత ఏదీ లేదు. ఎందుచేతనంటే ప్రతీ జీవిలోనూ నశించని ఆత్మజ్యోతి ప్రకాశం నిలిచి ఉన్నది.


భగవంతుడు ఆబ్రహ్మకీట పర్యంతం ప్రతీ జీవికి కలుగజేసిన అద్భుత వరం ఇది. ఆ అంతర్జ్యోతి అత్యంత పారదర్శకంగా వెలుగొందుతూ తన ఉనికి ద్వారా ప్రకాశాన్ని విరజిమ్ముతూనే ఉన్నది.


స్వయంప్రకాశితమైన ఆ కాంతిరేఖలను అల్పబుద్ధితో, అహంతో, కోరికల వలయాలతో అడ్డుకుంటూ అడ్డుగోడను మనమే నిర్మించుకుంటున్నాం.

🌼కావ్యసుధ 🌼

కామెంట్‌లు లేవు: