3, డిసెంబర్ 2020, గురువారం

నిర్వాణషట్కము

 **దశిక రాము**


**జగద్గురు ఆదిశంకర విరచితము**

**నిర్వాణషట్కము** 

**ఆత్మషట్కము**  

6వ శ్లోకము. 
విశ్లేషణ : శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

6వ శ్లోకము (చివరి శ్లోకము) :

**అహం నిర్వికల్పో నిరాకార రూపో।**

**విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణామ్।**

**న చా సంగతం నైవ ముక్తి ర్నమేయః।**

**చిదానంద రూపః శివోహం। శివోహమ్॥**

అర్ధము : 
నాకు ఎటువంటి వికల్పములు లేవు. నాకు రూపం లేదు. నేను ఇంద్రియరూపంలో ఈ విశ్వమంతా వ్యాపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ, విషయములు కానీ లేవు. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు. పొందవలసిన మోక్షమూ లేదు.
నేను చిదానందరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరవరినీ కాను!! 

విశ్లేషణ :
ఆహా! ఎంత ఉదాత్తమైన, జ్ఞానవంతమైన భావము!

ఎందుకంటే ఈ సృష్టి మొత్తము క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే రెండు పదార్ధాలతో నిండివుంది. ఇందులో మొదటిది జడమైనది, చూడబడుతుంది మరియు నశింపబడుతుంది. ఇక రెండవది చైతన్యవంతమైనది, అన్నింటిని చూచునది మరియు శాశ్వతమైనది.

క్షేత్రానికి మరోపేరు ఉపాధి. ఉపాధి అంటే పంచభూతములు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారము మొదలైన వాటితో కూడియున్న జడమైన జీవుని శరీరము. ఇది ఒక రూపాన్ని ధరించి బయటకు కనబడుతుంది. ఇది ఎప్పటికైన నశించే గుణం కలిగివుంటుంది.

ఇలాంటి జడమైన, నశించే స్వభావం కలిగిన ఉపాధులన్నింటిలో కూడా బయటకు కనబడకుండా, అన్నింటిని గమనిస్తూ, చైతన్యస్వరూపంతో నెలకొనియున్న ఆత్మయే క్షేత్రజ్ఞుడు. దీనికి నాశనము లేదు. పూర్తిగా శాశ్వతమైనది.

అంటే “క్షేత్రములెన్నున్నా క్షేత్రజ్ఞుడు ఒక్కడే. జీవులెన్నున్నా జీవాత్మ ఒక్కటే!!”. ఉపనిషత్తులు ఈ విషయాన్నే “జీవో బ్రమ్మైవ నా పరః”, “అయమాత్మా బ్రహ్మ”, “అహం బ్రహ్మాస్మి” ఇత్యాది ఎన్నో మహావాక్యాలతో స్పష్టంచేసేయి. 

అటువంటి ఉపనిషత్ సారాంశమంతా “ఆత్మషట్కము లేదా నిర్వాణషట్కము” అన్న పేరుతొ కేవలం ఆరు శ్లోకాలతో వ్యక్తపరిచేరు జగద్గురు ఆదిశంకరులు. ఈ సత్యాన్ని గ్రహించి, ఆచరించి “ఆత్మానుభూతి” పొందడం మన చేతుల్లోవుంది.

ఇతి శ్రీమదాకుండ్యన్వయ పవిత్ర ఆత్రేయసగోత్ర, మహాకవి శ్రీ జగన్నాధ శాస్త్రి ప్రపౌత్ర, 
ఉద్దండ పండిత శ్రీ గోపాల శాస్త్రి పౌత్ర, ఉభయభాషాప్రవీణ మహాకవి శ్రీ సూర్యనారాయణ శాస్త్రి పుత్ర, శ్రీనివాస శాస్త్రి(శాస్త్రి ఆత్రేయ)గా పిలవబడే నాచే విశ్లేషించబడిన “ఆత్మషట్కము” సర్వము సమాప్తము.

సర్వము నా గురుదేవులకు అర్పితము!!

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**

కామెంట్‌లు లేవు: