*మందుల్లేని వైద్యం..*
ఆదివారం..ఉదయం 6.30 గంటలకల్లా మొగలిచెర్ల గ్రామంలో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభాత హారతులు ఇవ్వడం అయిపోయి, భక్తులకు దర్శనం ఇచ్చే సమయం..సహజంగానే కొద్దిగా రద్దీ గా ఉంటుంది..
సర్వదర్శనం.. అష్టోత్తరం,హారతి.. విశేష పూజలూ ఇలా ఎవరి శక్త్యానుసారం వాళ్ళు స్వామి వారిని దర్శించుకుంటారు..మా సిబ్బంది కూడా ఎవ్వరికీ ఇబ్బందికలుగకుండా దర్శనం చేయించడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటారు..
అటువంటి సమయంలో .."అయ్యా! నిన్నరాత్రి, కొద్దిగా బియ్యం తెచ్చి, ఇక్కడ పెట్టాను..రావడం ఆలస్యమైంది.. రసీదు తీసుకోలేదు, ఇప్పుడు రసీదు ఇస్తారా?"అంటూ ఓ పెద్దాయన నన్ను అడిగాడు..సరే అని, రసీదు వ్రాయడానికి పేరు అడిగాను.."రేగుల తిరుపతయ్య"..అన్నాడు..
కుతూహలం కొద్దీ అడిగాను, "ఎప్పటినుంచి గుడికొస్తున్నావు?" అని..
"నేనా..నేను రాబట్టి పాతిక ముప్పై ఏళ్ళు దాటిందిలే..అప్పుడు మీ నాయనా, అమ్మా ఉండేవాళ్ళు..ఇప్పుడున్నంత సౌకర్యం అప్పుడు లేదు.. నాకు గుండెనొప్పి వచ్చిందయ్యా..చాలా మంది డాక్టర్లకు చూపించాను..తగ్గలేదు..ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అనికూడా మా వాళ్లకు చెప్పారు..ఏదిక్కూ తోచలేదు..మేమా బీదవాళ్ళం..చేతిలో డబ్బులేని వాళ్ళం.ఖరీదైన వైద్యానికి నోచుకోలేదు..ఆ సమయం లొనే మా ఆడోళ్లకు ఈ స్వామి గురించి ఎవరో చెపితే, పట్టుబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది..నలభై రోజులపాటు..మండలం రోజులు ఇక్కడే ఉన్నాము..ఏ మందూ వాడలేదు..స్వామివారి విభూతి రాసుకునేవాణ్ణి..ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం..మందిరం చుట్టూ మొత్తం 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళం..మూడురోజుల్లోనే మార్పు కనబడింది..స్వామి దయవల్ల మళ్లీ మామూలు మనిషిని అయ్యాను..నాకు ఆరోగ్యం బాగుపడిన తరువాత నా శక్తి కొద్దీ..ఇక్కడున్న వాళ్లకు అన్నదానం చేసాను..ఆరోజు మీ అమ్మా, నాన్న కూడా వచ్చారు..అదిగో అప్పటినుంచీ..ఈ స్వామి దగ్గరకు వచ్చినప్పుడల్లా బియ్యం తీసుకొచ్చి ఇచ్చి వెళుతుంటాము..ఆ స్వామి చల్లగా చూస్తే..వచ్చే నెలలో ఒక ఆదివారం నాడు అన్నదానం చేస్తాము.."
"మా ఊరి వాళ్ళు, మా బంధువులు అందరూ మమ్మల్ని ఎగతాళి చేసారప్పుడు..మేమిద్దరం ఈ స్వామినే నమ్ముకున్నాము..అంతా మంచేజరిగింది..మళ్లీ ఇంతవరకూ ఏ బాధా పడలేదు..మా పిల్లలూ ఎదిగి చేతికొచ్చారు..మమ్మల్ని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు ఈ స్వామిని కొలుస్తూ ఉండారయ్యా.."అని చెపుతూ.."మాకే కష్టం వచ్చినా, స్వామికి మొరపెట్టుకుంటే, మా ఇద్దరికీ స్వప్నంలో కనబడి, కష్టం తీరుస్తాడు..నువ్వు నమ్మినా.. నమ్ముకున్నా..ఇది సత్యం.."అన్నాడు..
నమ్మకపోవడానికేమీ లేదు..స్వామి వారి గురించి ఆయన చెప్పేటప్పుడు, ఆ కళ్ళల్లో కనబడే తడి, ఆర్తి, చెప్పకనే చెపుతాయి వాళ్ళ భక్తి గురించి..
ఎక్కడో పల్లెటూరులో ఉండే ఆ దంపతులకు స్వప్నంలో సాక్షాత్కరించే స్వామి సర్వాంతర్యామి అని వేరే చెప్పాలా?
సభక్తి పూర్వకంగా ప్రార్థిస్తే, శ్రీస్వామివారు ఎప్పుడూ మనతోనే ఉంటారు!!
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి