3, డిసెంబర్ 2020, గురువారం

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**శ్రీమన్నారాయణీయం**


**ప్రథమ స్కంధం 2-5-శ్లో.**


లక్ష్మీస్తావకరమణీయకహృతైవేయం పరేష్వస్థిరే-

త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే!

యేత్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః

తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా||


భావము: నీ రూపమును విడిచి ఉండలేని లక్ష్మీదేవి నీ వక్షస్థలమున స్దిరముగా ఉన్నప్పటికి, భక్తులు నిన్ను ఎక్కడ ధ్యానము చేయుదురో? ఎక్కడ నీ గుణములు కీర్తించబడుతూ ఉంటాయో? ఎక్కడ నీ కీర్తనలు గానము ఆస్వాదించుటలో భక్తులు ఆసక్తితో ఉంటారో? అక్కడ నీ ప్రస్తావనలొని ప్రశంసను విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించి వారివద్ద శాశ్వతముగా ఉండగలదని ప్రమాణ పూర్తిగా చెప్పబడుచున్నది.

(telugubhagavatam.org)


వ్యాఖ్య. ఈరోజు కూడా లక్ష్మీదేవి చంచలత్వమే ప్రస్తావించబడింది. అసలు లక్ష్మీదేవి ఆవిర్భావం ఎక్కడో చూద్దాం.


సాగరమథనం లో పుట్టిన పదకొండు (11) లో

పుట్టినవి వాటిని తీసుకున్నవారు చూద్దాం.


హాలాహలం - గరళం - శివుడు భక్షించెను


సురభి కామధేనువు - తెల్లని ఆవు - దేవమునులు తీసుకున్నారు


ఉచ్ఛైశ్రవము - ఎత్తైన తెల్లని గుఱ్ఱము - బలి చక్రవర్తి తీసుకున్నాడు


ఐరావతము - నాలుగు దంతాల తెల్లని ఏనుగు - ఇంద్రుడు తీసుకున్నాడు


కల్పవృక్షం - కోరికలు తీర్చే చెట్టు - ఇంద్రుడు తీసుకున్నాడు.


అప్సరసలు - దేవతా సుందరీమణులు - ఇంద్రుడు తీసుకున్నాడు


సుధాకరుడు - చంద్రుడు - ఆకాశంలో వర్తిస్తున్నాడు


లక్ష్మీ దేవి - సకల సంపదల దేవత - విష్ణువును వరించి వక్షస్థలమున ఉంది.


వారుణి - మధ్యమునకు అధిదేవత - రాక్షసులు పుచ్చుకున్నారు


ధన్వంతరి - వైద్యానికి అధిదేవత - దేవతలలో చేరాడు


అమృతం - మరణంలేని మందు - దేవతలు తీసుకున్నారు.


క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలోంచి వచ్చిన మహాలక్ష్మికి పుట్టినవెంటనే మంగళస్నానము చేయించారు.


కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె

మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ


లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.

అందుకే వైజయంతీ మాల ఉన్న ఇంట్లో అన్నీ శుభాలే ఉంటాయట.


నమస్తే సర్వలోకానాం జననీమజ్జసంభవామ్

శ్రియమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షః స్థితామ్ 


లక్ష్మిదేవి క్షీర సముద్రం నుండీ ఉద్భవించినప్పుడు దేవతలందరూ ఆమెను ఈ శ్లోకంతో స్తుతించారు. వారి స్తుతులకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, వారిని వరం కోరుకోమనగా, అప్పుడు దేవతలు ఈ స్తోత్రం పఠించినవారిని విడువవద్దని ఇంద్రుడు కోరాడు. ఆమె ఆ వరాన్ని అనుగ్రహించింది. ఈ శ్లోకాన్ని పఠిస్తూన్నవారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్న నమ్మకం ఉంది.


నాలుగు రకాల పురుషార్థాలను ప్రజలకు అందించేందుకు అమ్మవారు ఫాల్గుణమాసం ఉత్తరానక్షత్రంలో పౌర్ణమివేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. 


సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.


గురుభక్తి నిరతులు, సురపితృ పూజన పరులును, సత్య సంభాషణులును,దాన శీలురుఁ, బరధనపరదార పరాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణ ప్రియులు, దివానిద్రా వియుక్తులు, వృద్ధదుర్బల దీన యోషిత్కృపారతులును

శౌచులు, నతిథిభోజనశిష్ట భోజులునేను మెచ్చు జనంబు; లిట్లుగాక


* ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ

* ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ

* ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ

* ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ

* ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ

* ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ

* ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ ఉంటుందో అక్కడ

* ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ

* ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని... అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.


అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది...


ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ;

గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక

పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను।

మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు


* ధర్మాలను పాటించని వారు

* కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు

* గర్వం ఉన్నవారు

* పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు

* కఠినమైన మాటలాడేవారు

* క్రూర మనస్తత్వం ఉన్నవారు


సూక్ష్మంగా చెప్పాలంటే అష్టైశ్వర్యాభివృద్ధి సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి.


లక్ష్మీ స్తోత్రాల్లో ‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్‌’ అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ, ‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు. రుగ్వేదంలోని ప్రధాన సూక్తాల్లో శ్రీసూక్తం దేవీ తత్త్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా పదిహేను ఋక్కుల్లో మనకు వివరించింది. ఇందులో


పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథమ్‌

ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మామ్‌


పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ... నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ ఋక్కు. 


ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని... అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. 


వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం... ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు. అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నురాలిని చేసుకోవడమే మన ప్రగతికి శ్రీకారంగా గుర్తించాలి. స్వస్తి.


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA

కామెంట్‌లు లేవు: