🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భగవంతుడు అంటే...
➖➖➖✍️
చాలా మందికి దేవుడిని “భగవంతుడు" అని పిలుస్తారని తెలుసు...!
"భగవంతుడు" అంటే ఏమిటి?
మంచి గుణాలు కలిగిన వారిని "గుణవంతులు" అంటాము.
బాగా ధనం కలిగిన వారిని ''ధనవంతులు" అంటాము.
మంచి శీలం ఉంటే "శీలవంతులు" అంటాము.
అలాగే అందమైన రూపం కలిగిన వారిని
"రూప వంతులు" అంటాము.
మరి "భగవంతుడు" అంటే ఎవరు?
"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్శ్రియఃజ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం - భగ, ..... ఇత్యుక్త భగో౽స్యాస్తీ తి భగవాన్ "...
అని శాస్త్ర నిర్వచనం .
1) మాహాత్మ్యం
2) ధైర్యం
3) యశస్సు
4) సంపద
5) జ్ఞానం
6) వైరాగ్యం.....ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు..... వీటికే "భగ" అని పేరు.
ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.
1) మాహాత్మ్యం :
పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది.
"పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం"..
అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి...దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు...అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం ఏ విషయం లో పవిత్రంగా ఉంటామో ఆ విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది...
ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు... కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది... ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో ఆ విషయంలో 'మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు...!
ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.. నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము. అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది.
2) ధైర్యం :
ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది...భయం లేకపోవడం వల్ల...భయం ఎలా పుడుతుంది? ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది...అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది...ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుష్షు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి.
ఇక దేవుడు వేద స్వరూపుడు....అంటే జ్ఞానస్వరూపుడు...ఇక అతనికి అజుడని పేరు..అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు. శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు... కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది.
3) యశస్సు :
యశస్సు అంటే స్వచ్చమైన కీర్తి .
"క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి" ఏర్పడుతుంది... నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల
"నది"లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.
ఆగిపోయిన నీరు "నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.
మనష్యుల పరిస్థితి అయినా అంతే..!
ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది.
ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది..
ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది.....
ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది..
ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరుణ్ణి యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది.
4) సంపద :
సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు...
తృప్తి పరిచేది, అవసరాలను తీర్చేది సంపద. సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.
i) ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది... ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి... వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది..
శారీరకంగా - మానసికంగా - బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగా నైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం...
ii) క్రియాశక్తి వల్ల... లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి. సంపద అనేది శ్రమకు ప్రతిఫలం.. శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.. శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.. ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరులచే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది... ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు.. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే..!
ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లుబడి కావు..కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నైపుణ్య శక్తి.... క్రియా శక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.
ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్ల.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరుణ్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది..
5) జ్ఞానం :
ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వ శక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణo అవుతుంది..
తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది .. కోల్పోయేది కాదు... అది ఎప్పుడూ ఉండేది.. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది. దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము... ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది... ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది... ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది...ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది...ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము... ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.
6) వైరాగ్యం :
సంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం. ఈశ్వరునికి నిరంజనుడని పేరు...అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.. వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి...
హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట.. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగు చేస్తాడా..? ఆ వేరును దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు... అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు. అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట..! అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు... అది లేమితనం - బలహీనత..
ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు...ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం..
మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తి తో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది..
వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి... ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు..
ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి..కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది...
ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల #భగవంతుడు అని పేరు... మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి.. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి...
సనాతన హిందూ సంప్రదాయాలు గౌరవించండి -- పాటించండి...✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి