3, డిసెంబర్ 2020, గురువారం

అజామిళోపాఖ్యానము--1**

 **దశిక రాము**


**భాగవతం 6వ స్కందము ఖండము-3**


**అజామిళోపాఖ్యానము--1**


రాజా! విను. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పాపాత్ముడు, దరిద్రుడు, నింద్యచరిత్రుడు, సదాచారాలను విడిచినవాడు, నికృష్ట జీవనుడు, జూదాలను వివాదాలను, దొంగతనాలను ఇష్టపడేవాడు. యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసికొని, పదిమంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహమనే సముద్రంలో మునిగి పిల్లల లాలన పాలనలో గడుపుతూ చాలాకాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు.

మనస్సు ఎప్పటికైనా నిర్మల మౌతుందన్నట్లుగా అజామిళుని నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. మోహబంధాలు జారిపోతాయన్నట్లుగా అవయవాలు పట్టుదప్పి వ్రేలాడాయి. ఇంద్రియ వాంఛలు ఇక వద్దు అన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. మోహం వయస్సుతో పాటు తగ్గిపోయినట్లుగా కంటిచూపు తగ్గిపోయింది. నోటి రుచి తగ్గింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు ఎక్కువయ్యాయి. తలనొప్పి మొదలయింది. మనస్సు చెదరిపోయింది. ముసలితనం వచ్చింది. అజామిళుడు ఎనబై ఎనిమిదేండ్లు నిండాయి. కాని భ్రాంతి వీడలేదు. నారాయణ అన్న పేరున్న తన చిన్నకొడుకంటే అతనికి ఎక్కువ ఇష్టం. రాజా! పుత్రవాత్సల్యం ఆత్మలో పొంగి పొరలగా అజామిళుడు, అతని భార్య ఆ కొడుకును సదా ముద్దుచేస్తూ ఉండేవారు. ముద్దు మాటలు మాట్లాడుతూ చక్కని ఫాలభాగం కలిగి, తన తండ్రి బంధువుల పోలికలతో ప్రకాశించే ఆ బాలుని చూచి ఆ దుష్ట బ్రాహ్మణుడు సంతోషిస్తూ...ఎక్కువగా ఆ బాలునితోనే త్రాగుతూ, తింటూ అతనితో ఆటలాడుతూ అజామిళుడు రానున్న మృత్యువును తెలుసుకొనలేకపోయాడు.ఈ విధంగా రానున్న చావును తెలిసికొనకుండా గడుపుతుండగా భయంకరమైన మరణకాలం వచ్చింది. ఆ సమయంలో అతడు తన కుమారుని తలచుకొని ప్రేమాతిశయంతో “నారాయణా!” అని పలవరించాడు.ఆ సమయంలో..

.అత్యంత పాపాత్ములను బాదించేవారు, సకలలోకాలకు భయంకరులు అయిన యమకింకరులను ఆ అజామిళుడు గుండెలు చెదరిపోగా చూశాడు.పాపులను చంపేవాళ్ళు, వారిని దండించేవాళ్ళు, దయమాలి భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు అయిన యమదూతలను దూరంగా చూశాడు..తన అంత్యకాలంలో ఆ బ్రాహ్మణుడు ముగ్గురు యమదూతలను చూశాడు. వాళ్ళు పట్టుదలతో కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. లావుపాటి పెదాలతో, వికారమైన ముఖాలతో, క్రూరమైన చూపులతో ముందుకు దూకుతున్నారు. వాళ్ళు చూడ భయంకరంగా ఉన్నారు. చేతుల్లో భయంకరంగా ఉన్న పాశాలు, కత్తులు సిద్ధంగా ఎత్తి పట్టుకొని ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ విధంగా మిక్కిలి వికారాలైన ముక్కులు, బలిసిన బుగ్గలు, వికృతంగా తిరుగుతున్న మిడిగ్రుడ్లు, కండలు తిరిగిన కర్కశ దేహాలు, నిక్కపొడుచుకున్న రోమాలు కలిగిన యమకింకరులు అజామిళునికి కనిపించారు. వారి చేతులలో ప్రాణుల ప్రాణాలను బలవంతంగా అపహరించే భయంకరమైన కాలపాశాలు ఉన్నాయి. అటువంటి యమభటులను చూడగానే అజామిళుని ఇంద్రియాలు పట్టు తప్పాయి. ప్రాణాలు కంపించాయి. నిలువుగ్రుడ్లు పడ్డాయి. ఆత్మ గిలగిల లాడింది. దూరంగా ఆడుకుంటున్న కుమారుడు అతని హృదయసీమలో గోచరించగా “ఓ నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ కొడుకును పిలిచాడు.అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తుండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు నామాన్ని విని వేగంగా అక్కడికి వచ్చారు. వికృత వేషాలతో అధికరోషంతో పెద్దగా కేకలు వేస్తున్న యమకింకరులను అదల్చారు. దాసీ భర్త అయిన ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి పడవేశారు. ఈ విధంగా తమ ప్రయత్నం విఫలం కాగా యమదూతలు ఇలా అన్నారు. మీరెవ్వరి దూతలు? మాతో కలహించడానికి కారణం ఏమిటి? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి మీరు బలవంతంగా విడిపించారు. ప్రపంచంలో యముని శాసనాలు ఇక నవ్వులాటకా?

మీరెవ్వరి దూతలు? మాతో కలహించడానికి కారణం ఏమిటి? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి మీరు బలవంతంగా విడిపించారు. ప్రపంచంలో యముని శాసనాలు ఇక నవ్వులాటకా? 

అయ్యా! మీరెవ్వరు? మీ శుభకరమైన రూపాలు మా కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మీరు నింగిలోని వారా? నేలమీది వారా? దేవతా శ్రేష్ఠులా? సిద్ధులా? సాధ్యులా? వికసించిన తెల్ల తామర రేకుల వంటి విశాల నేత్రాలు కలవారు, శ్రేష్ఠమైన పసుపుపచ్చని పట్టువస్త్రాలను ధరించినవారు, చెక్కిళ్ళపై నాట్యమాడే కుండలాలు ధరించినవారు, మిక్కిలి సుకుమారమైన యౌవన ప్రాయంలో ఉన్నవారు, రత్న ఖచితాలైన భుజకీర్తులతో విరాజిల్లే నాలుగు భుజాలు కలిగినవారు, నీలమేఘాల వంటి దేహచ్ఛాయలు కలవారు అయిన మీరెవ్వరు? ధనుస్సులు, అమ్ముల పొదులు, పద్మం, శంఖం, చక్రం, ఖడ్గం, గద మొదలైన ఆయుధాలను ధరించిన మీ స్వరూపాలు లోకాలకు ఆశ్చర్యాని గొల్పుతున్నాయి. శాంతంతో కూడిన మీ శరీర కాంతులు లోకమంతా నిండి దిగంతాలకు వ్యాపించే కారు చీకటులను పారద్రోలుతూ సంతోషాన్ని 

కలిగిస్తున్నాయి. ఈ విధంగా లోకాలన్నింటికి ఆనందాన్ని కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యం కాని తేజస్సుతో విరాజిల్లుతున్నవారు, సర్వధర్మాలను పాలించేవారు అయిన మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా చిరునవ్వులతో వికసించిన ముఖపద్మాలు కలిగిన ఆ విష్ణుదేవుని మందిర ద్వారపాలకులు గంభీరమైన మేఘ గర్జనలతో సమానమైన మాటలతో ఇలా అన్నారు. మీరు యమదూతలైతే పుణ్య లక్షణాన్ని, పాప స్వరూపాన్ని, దండనీతిని వివరించండి. ఇతడు ఉండ వలసిన స్థానాన్ని వెల్లడించండి. దండింపదగినవా రెవరు? లోకంలోని సర్వ ప్రాణులా? లేక పాపకర్ములైన కొందరా?” అని విష్ణుదూతలు పలుకగా యమభటులు ఇలా అన్నారు. వేదాలలో ఏది చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. దానికంటే వేరైనది అధర్మం. వేదం సాక్షాత్తు విష్ణుస్వరూపమని విన్నాము కదా! ఎవని వల్ల సత్త్వరజస్తమో గుణ స్వభావంతో ఈ ప్రాణికోటి తమకు అనుగుణమైన గుణాలను, పేర్లను, ప్రవర్తనను, రూపాలను పొంది ఆ విధంగా తనకు తానుగా లోకానికి తెలియబడుతున్నాడో ఆ నారాయణుడు అంతర్యామియై సర్వప్రాణులలో నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి ఈ దేహధారుడైన జీవుని సర్వ కర్మలకు సాక్షులు. ఈ సాక్ష్యాలను అనుసరించే ధర్మాధర్మాల నిర్ణయం జరిగి అధర్మపరులు దండింపబడతారు. ఇప్పుడు మీరీ క్రమపద్ధతికి అడ్డు తగిలారు. కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగినవారే. కావాలని కర్మలను చేసేవారికి ఆ కర్మల ననుసరించి శుభాలు, అశుభాలు కలుగుతూ ఉంటాయి. దేహధారుడు సత్త్వరజస్తమో గుణసంపర్కం వల్ల కర్మ చేయకుండా ఉండలేడు. ఈ జన్మలో తాను ఎంత పుణ్యం చేస్తాడో, ఎంత పాపం చేస్తాడో వాటిని బట్టి భవిష్యత్తులో అంతే వికారాన్ని పొంది అపరిపక్వమైన మనస్సుతో వాటి ఫలితాలను అనుభవిస్తాడు. ఇంకా వినండి. ఈ లోకంలో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని మూడు విధాలుగా ఉంటారు. వీరిలో శాంతస్వభావులు ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోరస్వభావులు కూడని మార్గాలలో నడచి నానా కష్టాల పాలవుతారు. మూఢస్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను తెచ్చుకుంటారు. వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు లభిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మాధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తుంటాడు. అజ్ఞానం ఉపాధిగా కల జీవుడు తమోగుణంతో కూడినవాడై పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. కాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలతో ఏవేవో కర్మలు చేస్తూ ఉంటాడు. కన్నులు, చెవులు మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించకుండా కేవలం శబ్ద స్పర్శ రూప రస గంధాలను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఒక మనస్సు మొత్తం పదునారు. జీవుడు పదునేడవవాడై ఈ పదునారు ఉపాధులతో సంబంధ సంస్పర్శలు కలిగి సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. పది ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు అనే పదునారు కళలతో కూడి గుణత్రయ విశిష్టమైన లింగశరీరం సత్త్వగుణం వల్ల హర్షాన్ని, రజోగుణం వల్ల శోకాన్ని, తమోగుణం వల్ల భయాన్ని జీవునికి కలిగిస్తుంది. ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తున్నాడు. పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తనచుట్టూ ఒక గూడు అల్లుకొని దానిలోనుండి బయటపడే మార్గంలేక నశించినట్లే జీవుడు స్వయంగా తనచుట్టూ ఏర్పరచుకొన్న కర్మబంధాలలో చిక్కి స్రుక్కి సురిగి పోతున్నాడు. వర్తమాన కాలంలో మనముందు నడుస్తున్న వసంతం మొదలైన ఋతువుల స్వరూప స్వభావాలను బట్టి జరిగిపోయిన, జరుగనున్న వసంతాదులలోని పుష్పాలను, ఫలాలను, శీతోష్ణ స్థితులను ఊహిస్తాము. అదే విధంగా జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మంలో ఎట్లా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అతణ్ణి లొంగతీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతుంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికలను సంతరించుకుంటాయి. పురుషునికి విచిత్రమైన ఈ విపర్యయం ప్రకృతి సంబంధం వల్ల కలుగుతుంది. సంసార కారణమైన ఈ ప్రకృతిని తొలగించుకోవాలంటే పురాణ పురుషుడైన పరమేశ్వరుని సంసేవనం తప్ప మరోమార్గం లేదు. ఈ అజామిళుడు పూర్వజన్మంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఇంద్రియాలను జయించి, శాంతచిత్తుడై ధర్మమార్గాన నడిచి, వేదాలన్నింటినీ పఠించాడు. సర్వదా గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేసాడు. సర్వజీవుల యందు సమబుద్ధి కలవాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందినాడు. సత్యసంధుడై నియమంగా నిత్యకృత్యాలను నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభం మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తనయందు నిల్పుకున్నాడు. ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించే బుద్ధి కలవాడై ఉత్తమమైన జ్ఞానమార్గాన్ని అవలంబించే సమయంలో మదనోన్మాదాన్ని కలిగించే నవయౌవనం అతని హృదయంలో జొరబడింది. అజామిళుడు కడకన్నులలో యౌవన గర్వం కనిపించింది. మనస్సులో ఉద్రేకం ఉప్పొంగింది. శరీరమంతటా కామవికారం తలచూపింది. ముఖంపై చిరునవ్వు మొలకెత్తింది. దేహమంతా బాగా బలిసి గట్టిపడింది. వెండ్రుకలు నల్లగా నిగనిగ మెరిసాయి. నడుము పెద్దదయింది. తొడలు సన్నబడ్డాయి. బాహువులు పొడవైనాయి. రొమ్ము విశాలమయింది. అవయవాలన్నీ నవనవ కాంతులతో మెరుస్తూ కుదురుకున్నాయి. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు యౌవనంలో అడుగుపెట్టి మిక్కిలి తేజోవంతు డైనాడు.హృదయంలో మొలకెత్తిన యౌవనమదం బయటికి ఉబికి వచ్చిన విధంగా అందమైన అతని ముఖంపై నూనూగు మీసాలు మొలకెత్తి చూడ ముచ్చటగా కనిపించాయి. ఇంకా...

తామరపుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ బ్రాహ్మణ కుమారుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని వచ్చాయి. అంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యావవనాలలోని చెట్లకొమ్మలు క్రొత్త చిగుళ్ళు తొడిగాయి. వాయువేగానికి ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జన హృదయాలలో గ్రుచ్చుకొనే బాకుల వలె ఉన్నాయి. చక్కగా వికసించిన పువ్వులలోనుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశంలో వ్రేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన తుమ్మెదల ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలిన ఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైన పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ క్రొత్త సొగసులను చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో...పొంగి పొరలే కామోద్రేకంతో, అతిశయిస్తున్న ఆసక్తితో రతిక్రీడలో చతురురాలైన తన ప్రియురాలైన స్వైరిణి వృషలితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు.కార్యనిమగ్నుడు, రతిశాస్త్ర కళలలో ఆరితేరినవాడు, నవ యౌవనంతో కామోన్మత్తుడు, సంభోగ కాంక్షతో తహతహ లాడుతున్నవాడు, దిగంబరంగా ఉన్న కటిప్రదేశం కలవాడు అయిన విటుణ్ణి (చూశాడు). కల్లు త్రాగిన మైకంలో కళ్ళు తిరుగుతున్నది, కామ తంత్రాన్ని ఆరంభించాలనే తొందర గలది, రతిక్రీడకు రెచ్చగొట్టే భ్రూవిన్యాసం కలది, చెదరిన ముంగురులు కలది, కౌగిలింతల కోసం వేగిర పడే వివిధ భంగిమలను ప్రదర్శిస్తున్నది, కాముకత్వం మూర్తీభవించినది అయిన ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుచున్నవాణ్ణి అజామిళుడు చూశాడు. అతని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 

రతి పారవశ్యంలో ఆ విటుని కంఠంనుండి వెలువడుతున్న అవ్యక్త మధుర ధ్వనులకు అనుగుణంగా ఆమె నడుమున కదులుతున్న ఒడ్డాణపు మువ్వల సవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో రతిక్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ అందగత్తె తమకాన్ని, గమకాన్ని అజామిళుడు చూశాడు. ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీనుల విందుగా వినిపిస్తున్నవి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు చూశాడు. 

“కవకవ”, “రవరవ”.... ధ్వన్యనుకరణ పదాలుపైన; “క”, “వ”, “ర” అక్షరాల వృత్యనుప్రాసతో అలంకరించి; శృంగారరసం చిక్కగా అల్లిన సహజ కవి పోతన్న గారికి పాదాభివందనాలు...

కురులు నుదుటిపై ఎగురుతుండాగా, కొప్పుముడి వీడగా, వక్షోజాలపై ముత్యాల సరాలు నాట్యమాడగా, మొలనూలు చిరుగంటలు తాళం వేయగా, అందాల కరకంకణాలు ధ్వనింపగా, నడుము తూగాడగా యౌవన గర్వంతో ప్రియుని పైకొని ఆ మగువ మన్మథకేళి 

సల్పింది.మిసమిసలాడే మృదువైన శరీరం గలది, నవయౌవనవతి, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరినది అయిన ఆ వెలయాలిని చూచి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతని మనస్సనే అరణ్యంలో కామేద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతని చిత్తం పట్టు తప్పిపోయింది


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: