*గ్రహణ కాలమందు మంత్ర పురశ్చరణము, దీక్షలు,ఆచరించవలసిన నియమాలు...*
శ్లో ll చంద్ర సూర్యగ్రహే తీర్దే మహా పర్వాదికే తథా మంత్ర దీక్షాం ప్రకుర్వాణో మాపర్ క్షాదీన్న శోధయేత్ ॥
తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ కాలమందును, తీర్ధమందును,
మహాపర్వము మొదలగువాటి యందును మంత్రపురశ్చరణ దీక్షను గాని ఉప లక్షణములచే మంత్రోపదేశమును చేయువారికి మాస నక్షత్రాది (ముహూర్తము) శోధన అక్కరలేదు. దీక్షాక్రమమును మంత్ర శాస్త్రోక్త ప్రకారముగ తెలియవలెను.
శ్లో॥ యుగేయుగే తు దీక్షాసీ దుపదేశః కలౌయుగే చంద్రసూర్యగ్ర హేతీర్ధే సిద్ద క్షేత్రే శివాలయే మంత్రమాత్ర ప్రకథన ముపదేశస్య ఉచ్యతే ॥
తాత్పర్యము : ప్రతి యుగమందును మంత్రోపదేశము దీక్షారూపమై అనేక నియమములు కలిగి యుండును. కలియుగమందు మాత్రమే మంత్రోపదేశమే అయిఉండును. అదియును సూర్యచంద్ర గ్రహణములలో తీరమందును, సిద్ధక్షేత్రమందును, శివాలయమందును చేయవలయును.
మంత్రగ్రహణ విషయమై సూర్యగ్రహణమే ముఖ్యము చంద్ర గ్రహణమైనచో దారిద్ర్యాది దోషములు కలవని కొందరి వచనము.
మంత్ర పురశ్చరణ లేక జప నియమములు :
శ్లో॥ చంద్ర సూర్యోపరాగేచ స్నాత్వా పూర్వ ముపోషితః స్పర్శాది మోక్ష పర్యంతం జపేన్మంత్రం సమాహితః జపాద్దశాంశతో హోమస్తథా హోమాచ్చ తర్పణం హోమాశక్తౌ జపం కుర్యా ద్దోమ సంఖ్యా చతుర్గుణం ||
తాత్పర్యము : చంద్ర సూర్య గ్రహణ దినమందు భోజనము విడచి స్పర్శ కాకముందే స్నానము చేసి అది మొదలుకొని శుద్ధమోక్ష మగునంతవరకు మంత్రమును ఏకాగ్రతతో జపించవలయును. అట్టి జపసంఖ్యకు పదియవ వంతు హోమమును, దానికి పదియవ వంతు తర్పణమును చేయవలెను. హోమము చేయలేని ఎడల దాని సంఖ్యకు (నాలుగు రెట్లు) చతుర్గుణముగ జపమే చేయవచ్చును.
తర్పణములు వదలునప్పుడు మూలమంత్రము ఉచ్చరించి మంత్ర దేవత నామమును ద్వితీయాంతముగ ఉచ్చరించి (దేవత పేరు) ....... దేవతాం తర్పయామి" (యవలతో కూడిన ) యవాదులతో కూడిన జలము దోసిలితో అర్పించవలయును. ఇట్లు నమశ్శబ్దమంతమగునట్లు మూలమంత్రము ఉచ్చరించి "....... దేవతా మహమభిషించామి" అని తన శిరస్సుయందు చల్లుకొనుచు మార్జనము తర్పణమునకు పదియవ భాగము చేయవలయును. మార్జన సంఖ్యకు దశమ భాగము బ్రాహ్మణ భోజనము. ఇట్లు జపహోమ తర్పణమార్జన, విప్ర భోజనమను అయిదు భాగములు కలది పురశ్చరణము. 'తర్పణముల'లో ఏదైన సంభవించని ఎడల అనగా చేయలేని ఎడల దాని సంఖ్యకు(నాలుగు రెట్లు ) చతుర్గుణము జపమే చేయవలయును. ఇట్టి పురశ్చరణము గ్రస్తోదయము, గ్రస్తాస్తమయము లందు అవసరము లేదు. పురశ్చరణాంగమైన ఉపవాసము పుత్రవంతుడైన గృహస్థు చేయ వచ్చును. పురశ్చరణ చేయువానికి స్నాన, దానాది నైమిత్తిక లోపముచే (పాపము) 'ప్రత్యవాయము కలుగును. కనుక అవి భార్యా పుత్రుడు మొదలగు ప్రతినిధులచే చేయించవలెను.
పురశ్చరణ చేయు విధానము :
స్పర్శకు ముందే స్నానము, ఆసనము వేసుకొని (గోత్రము చెప్పవలయును)..... గోత్రో .......(పేరు చెప్పవలయును)..... శర్మాహం రాహుగ్రస్తే దివాకరే నిశాకరే వా "......... దేవతాయా....... మంత్రసిద్ది కామోగ్రాసాది ముక్తి పర్యంత .......మంత్రస్య జపరూపం పురశ్చరణం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్పర్శ మొదలుకొని మోక్ష పర్యంతము జపము చేయవలయును. ఆపైన పర దినమందు స్నానాది నిత్యకర్మలు చేసి "........ మంత్రస్య కృతై తద్గ్రహణ కాలికా...... సంఖ్యా జప సాంగతా సిద్ధ్యర్థం తర్దశాంగ హోమ తద్దశ్శాంశాంశ మార్జన తద్దశాంశ విప్ర భోజనాని కరిష్యే" అని సంకల్పించి హోమాదులైనను, తత్ చతుర్గుణ మంత్ర జపమైననూ చేయ వలయును. ప్రతినిధిగా ( నియమింపబడిన) ప్రేరణ చేయబడిన పుత్రాదులు గ్రహణ కాలమందే "...... గోత్రస్య........ శర్మణో గ్రహస్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయః ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే" అని సంకల్పము చెప్పుకొని స్నాన దానాదికము చేయవలెను. పురశ్చరణ చేయనివారును తమతమ ఇష్ట దేవతా మంత్రజపమును గాయత్రి మంత్ర జపమును తప్పక చేయ వలయును. లేనిచో మంత్రమునకు మాలిన్యమగును.
గ్రహణకాలమందు శయనించినచో రోగము, మూత్రము విడిచినచో దారిద్ర్యము, (మలము) పురీషము విడిచినచో (పురుగు) కృమి జన్మము, మైథునము చేసినచో ఊరపంది జన్మము, (తలంటు స్నానము) అభ్యంగము జేసికొనినచో కుష్టురోగము, భోజనము చేసిన నరకము వచ్చును. గ్రహణమునకు ముందు వండిన అన్నము గ్రహణము తరువాత భుజింపకూడదు. గ్రహణకాల స్థితమైన జలమును త్రాగినచో (పాపము) పాదకృచ్చ్ర ము. కనుక త్రాగరాదు. మీగడ, మజ్జిగ, తైల పక్వము క్షీరము పూర్వ సిద్ధమైననూ గ్రహణము తరువాత గ్రహించవచ్చును. కానీ గ్రహణ కాలమందు వాటిలో దర్భముక్కను వేయవలయును.
- ధర్మ సింధు గ్రంధం ప్రకారం
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి