28, అక్టోబర్ 2023, శనివారం

ఆలోచనాలోచనాలు

 ### ఆలోచనాలోచనాలు ###                                     --------౦ పొగడ్తలు ౦--------                                 ***** భగవాన్! నన్ను కాపాడు! దట్టమైన అరణ్యంలో పులి, సింహం మొదలైన క్రూరజంతువుల నుండి; జనావాసాలలో పొగిడి పనులను పూర్తిచేసుకొనే కపటుల నుండి---                                      ***** మనలో పొగిడించుకొనాలనే దురాశ లేనంతవరకు పొగడ్తలు మనల్ని ఏంచేయలేవు. కోట్లకొలది సంవత్సరాల నుండి ఎండావానలను, తీవ్రమైన గాలులకు తట్టుకొని పర్వతాలు నిలచివుండటం లేదా!                                    ***** ఈ లోకంలో అతి నీచమైన శత్రువులు ఎవరయ్యా, అంటే చేతిలో ఏ ఆయుధం లేకుండా మిమ్మల్ని పొగడటమే కార్యసాధనకు మార్గం అని ఎంచుకున్నవారే!                   ***** పొగిడేవాడెప్పుడూ ఖాళీ చెంచాతోనే తినిపిస్తూవుంటాడు. ఎన్ని పర్యాయాలు దౌడలు ఆడించినా, పొట్ట మాత్రం నిండదు.                                ***** పొగడ్తలు విని ఆనందంలో మునిగితేలడం అంటే ఎత్తెన ముక్కాలి పీటపై కూర్చొని , గర్వంతో విర్రవీగుతూ వెనక్కి వాలడం లాంటితే!                   ***** పొగడ్త వాసన చూచి వదిలేయాల్సిన పరిమళ ద్రవ్యం ( సెంట్) వంటిది. ఎగబడి త్రాగడానికి నిండు వేసవిలో త్రాగే శీతల పానీయం కాదు.                    ***** పొగడ్తలు ఇరువురినీ చెడగొడతాయి. ఒకటి పొగిడే వాడిని. రెండు పొగిడించుకొని ఆనందించేవాడిని.                ***** పొగడ్త దారపు పోగు వంటిదైతే, సన్మాన సభ "" కాశ్మీరీ శాలువా"" ను కప్పించుకోవడం వంటిది.      ***** మూర్ఖులతో పొగడ్తలు పొందడం కంటే తెలివైనవారితో తిట్లు తినడం మంచిది.                   ***** పొగడ్తలతో మనిషిని ఆకాశానికి ఎత్తేవాడు అవసరం అయితే పదిమంది లో గజమాలతో సత్కరించగలడు. వరసతప్పితే వీపు వెనక పిస్టల్ ఉంచి ట్రిగ్గర్ ను నొక్కగలడు కూడా!               *****  అర్హత లేకున్నా శాలువాలను కప్పించుకొనే అలవాటు ఉన్నవారు , గంగిరెద్దును చూచి జ్ఞానం పొందాలి. దాని వీపుపై ఒకటేమిటి అనేక రకాల రంగుల శాలువాలు కప్పబడివుంటాయి.                 ***** పొగిడేవాడు సత్యదేవతను నాలుక అనే పదునైన ఆయుధం తో దాడి చేస్తుంటాడు. పొగిడించుకొనేవాడి మానసిక శక్తిని బలహీనపరుస్తూవుంటాడు ***** పక్షులను పట్టేవాడు  కొన్ని గింజలను వాటి ముందు చల్లి , వల విసరుతాడు. చేపలు పట్టేవాడు గాలపు ముల్లుకు మాంసపు ఎఱను గుచ్చుతాడు. కానీ పొగిడేవాడు ఇవేవీ లేకుండా "తియ్యని మాటల నైపుణ్యం" తో పొగిడించుకొనేవాడిని లొంగదీసుకోగలడు.             * * * * * * * * * * * * * * * * * * *                                  తెలుగు వారి పొడుపుకథలు ( విడుపులు)                         1* మా ఇంట్లో రెండు ఎద్దులున్నాయి. ఒకటి గుండ్రంగా తిరుగుతుంది. ఇంకొకటి తిరగకుండా అట్లాగే పడివుంటుంది. ఏమిటది? (తిరగలి లేదా విసరురాయి)                        2* మా ఊరేనుగు. మదపుటేనుగు. కదలలేదు. మెదలలేదు. ఏమిటది? ( మఱ్ఱి చెట్టు)       3* నాకు రెండుకళ్ళు. మా తాత గారికి నాలుగు కళ్ళు, మూడు కాళ్ళు. ఏమిటవి? ( కళ్ళజోడు మరియు చేతికర్ర)                                4* మణికట్టు పై నుండు మహరాజులాగా! కాలంతో పాటు పరుగెత్తుచుండు! ( చేతి రిస్ట్ వాచ్)                   5* మా ఇంటి వెనకాల పంగనామాలవాడు పందిరి కి వేలాడుతున్నాడు. ( పొట్లకాయ)                        తేది 28--10--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: