28, అక్టోబర్ 2023, శనివారం

శ్రీ వాల్మీకి జయంతి

 ॐ     శ్రీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. 


      వాల్మీకి మహర్షి పేరు వినగానే, వెంటనే మనకు నాలికపై  "శ్రీమద్రామాయణం" అని పలుకుతుంది. 


 ఆదికావ్యం - ప్రత్యేకత 


    శ్రీ వాల్మీకి మహర్షి, 

    బ్రహ్మదేవుని అనుగ్రహంతో, 

      రామాయణ కథా - ఆ కథలోని పాత్రల అంతరంగాలు కూడా అవగతమయ్యేలా చూచి వ్రాసినది "శ్రీమద్రామాయణం". 

    ఇదే మొదటి కావ్యం కాబట్టి "ఆదికావ్యం" అంటాం. 


   "వేద ధర్మాన్ని వివరించేదిగా" మహర్షి చెప్పండం దీని ప్రత్యేకత. 


    ఈ భూమండలం మీద "పర్వతాలూ నదులూ ఉన్నంత కాలమూ" ఈ "రామాయణ"కథ లోకంలో నడుస్తుందని 

    సాక్షాత్తూ బ్రహ్మదేవుడు వాల్మీకిమహర్షి వద్దకే వచ్చి, తెలిపి, వ్రాయమన్నాడంటే, 

    ఆ కావ్యం గొప్పదనం ఎంతదో మనకి తెలుస్తుంది. 


విజ్ఞాన సర్వస్వం 


    జీవన విధానాలు 

  - ప్రాంతాలబట్టీ వ్యత్యాసమున్నా,

  - కాలాన్నిబట్టీ మారినా, 

    అందఱికీ, అన్ని కాలాలకీ, 

   "ఆలోచన - మాట - చేతకి" సంబంధించి చక్కని ప్రవర్తనకి ఉపయోగపడే "విజ్ఞాన సర్వస్వం" శ్రీమద్రామాయణం. 


సార్వకాలీనం 


    ఏ కాలంలోనైనా, జీవన విధానాలు కాలాన్నిబట్టీ మారుతున్నా, 

   కొన్ని మౌలిక విషయాలు అత్యవసరం. వాటిలో కొన్ని ముఖ్యమైనవి 

  - దోపీడీవ్యవస్థ ఏర్పడకుండానూ, ఒకవేళ ఏర్పడతే దానిని తొలగించడానికీ "సత్య - ధర్మాలు" ముఖ్యం. 

  - ప్రకృతిని చెరిపే పర్యావరణ హానికి విరుగుడు "ప్రకృతి ఆరాధన - ఆస్వాదన". 

  - మానవీయ సంబంధాలు రాక్షస ప్రవృత్తికి దిగజారకుండా, 

   "దైవీ" సంబంధాల స్థాయికి ఎదగాలి. 

    ఈ సార్వకాలీన విషయాలు స్పష్టంగా తెలపుతూ వివరించేది రామాయణం. 


      ఇది వ్యక్తులకీ, సమూహాలకీ, ప్రకృతికీ సర్వరోగ నివారిణి. 


    "సత్యం వద - ధర్మం చర" అని చెప్పే వేదం సార్వకాలీనం. ఆ వేదధర్మాన్ని వివరించిన రామాయణం కూడా సార్వకాలీనమే కదా! 


జనబాహుళ్యంలో 


    వేదం నేర్చుకోవాలంటే, అందఱికీ సాధ్యమయ్యే పనికాదు. 

    అందుకనే వేదాన్ని వివరిస్తూ, వేద ధర్మాన్ని  సర్వులకూ రామాయణం తెలుపుతుంది. 

         (వేదోపబృంహణం) 

     దానివలన, వేద ధర్మంగా రామాయణం పండితులకే కాక, పామరులందఱికీ కూడా సులువుగా అర్థమవుతూ, ఆచరించవలసిన, విసర్జించవలసిన విషయాలని చక్కటి విధానంలో తెలియజేస్తుంది. 


విశ్వ ప్రయోగశాల - ప్రయోగదీపిక 


      ఏఏ పనులు చేస్తే - వాటి పర్యవసానాలు ఏఏ విధంగా ఉంటాయో తెలిపే "ప్రయోగ దీపిక"యే శ్రీమద్రామాయణం. 


      "ప్రపంచమ"నే ప్రయోగశాలలో, "జీవితం" అనే ప్రయోగం చేస్తున్న మానవులందఱికీ ప్రయోగ దీపిక (manual)గా అన్ని సమయాలలోనూ అవుసరమైనది "శ్రీమద్రామాయణం". 


రచయిత - రాయల్టీ 


        ప్రస్తుత కాలంలో, ఏ పుస్తకమైనా వ్రాసిన రచయితకి అమ్మకం ద్వారా "రాయల్టీ" లభించడం చూస్తూంటాం.

        కానీ సృష్టికర్త తాను ఎన్నుకొని, సమస్తమానవాళికి సుఖశాంతులని అందించే గ్రంథ -  రచయితగా "కారణ జన్ముడైన" వాల్మీకి మహర్షిని ఆదేశించారు. 

    

    ఆ గ్రంథాన్ని అవగతం చేసికొంటూ, మనం "శ్రీరాముడు"గా అయి, మనలోని "రావణు"ని అంతం చేయడమే

  - వాల్మీకి మహర్షికి మనం ఇచ్చే "రాయల్టీ" 


        అదే వాల్మీకి జయంతి మనకి అందిచ్చే సందేశం. 


వందే వాల్మీకి కోకిలమ్ 


కూజంతం రామరామేతి 

          మధురం మధురాక్షరం I 

ఆరుహ్య కవితాశాఖాం 

            వన్దే వాల్మీకి కోకిలమ్॥ 


  - కవిత్వం అనే కొమ్మపై ఎక్కి, 

  -"రామరామ" అనే మధురాతిమధురమైన అక్షరాలను కూయు, 

  - వాల్మీకి అనే కోకిలకు వందనము. 


  (కోకిల అంటే 

    "క్రోకతి శ్రోతుచిత్తం లాతీతి కోకిలః" 

    - వినేవారి చెవులను ఆకర్షించేది)


                    =x=x=x=


      — రామాయణం శర్మ

               భద్రాచలం

కామెంట్‌లు లేవు: