28, అక్టోబర్ 2023, శనివారం

దర్భ అనేది ఒక రకమైన గడ్డి.

 దర్భ అనేది ఒక రకమైన గడ్డి. దీనిని హిందువులు చాలా పవిత్రముగా భావిస్తారు. అందువలన హిందూ సంప్రదాయంలో దీనికి విశిష్ఠ స్థానం ఉంది.ఇది ఒక క్రిమి నాశనిగా అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు గుర్తించారు.

ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది.

వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

కామెంట్‌లు లేవు: