28, అక్టోబర్ 2023, శనివారం

*శ్రీ చెక్కా కేశవులు

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ చెక్కా కేశవులు గారి అనుభవం..*


*(పదవ రోజు)*


శ్రీ స్వామివారితో చెక్కా కేశవులు గారు, తమ మనసులోని కోరికను సందేహిస్తూనే బయటపెట్టారు..ఆ కోరిక వినగానే శ్రీ స్వామివారు ఫక్కున నవ్వారు..


తనకు అమ్మవారి దర్శనం చేయించమని శ్రీ స్వామివారిని కేశవులు గారు కోరారు..శ్రీ స్వామివారు.."అది అంత సులభంగా..అరచేతిలో చూపేది కాదనీ..గొప్ప గొప్ప సాధకులకే సాధ్యం కాని కోరికలు కోరకూడదనీ.." కేశవులు గారికి నచ్చచెప్పబోయారు..కానీ..కేశవులు గారు మాత్రం..తల్లి వద్ద పసిబిడ్డ మారాము చేసినట్టు, అదే పట్టు మీద ఉండిపోయారు..


శ్రీ స్వామివారు..."సరే!..నాయనా..ఇలారా..నాకెదురుగా పద్మాసనం వేసుకొని స్థిరచిత్తంతో కళ్ళు మూసుకొని కూర్చో..ఎటువంటి పరిస్థితుల లోనూ కళ్ళు తెరవకు!..జాగ్రత్త సుమా!.." అని హెచ్చరించి కేశవులు గారిని తమ కెదురుగా కూర్చోబెట్టుకున్నారు..కేశవులు గారు కళ్ళు మూసుకున్నారు..శ్రీ స్వామివారు కూడా పద్మాసనం వేసుకొని..కళ్ళుమూసుకొని..సమాధి స్థితి లోకి వెళ్లిపోయారు..కొద్దిసమయం గడిచేసరికి..కేశవులు గారికి, తన శరీరమంతా కంపించిపోతున్నట్టు..ఏదో వెలుగు తన శరీరమంతా క్రమ్ముకుంటునట్లూ..తాను గాలిలో తేలిపోతున్నట్లు..అనుభూతి కలుగసాగింది..ఏం జరుగుతుందో అర్ధం కాలేదు..ఒకరకమైన భయం మనసునిండా ఆవరించిపోయింది..తట్టుకోలేక కళ్ళు తెరిచారు..పార్వతీదేవి మఠం లేదు..స్వామివారు లేరు..నింగినుండి నేలదాకా.. ఎఱ్ఱని కాంతిపుంజాలు వ్యాపించి ఉన్నాయి..


"స్వామీ!..స్వామీ!.." అంటూ వెఱ్ఱి కేకలు పెట్టారు..తనెక్కడున్నాడో తెలీడం లేదు..ఏదో మాయ క్రమ్ముకొస్తోంది..కొద్దిసేపటికి ఆ కాంతిపుంజాలు మాయమయ్యాయి..శ్రీ స్వామివారు పద్మాసనం లో నిశ్చలంగా కూర్చుని నవ్వుతూ వున్నారు..


"ఏం కేశవులు గారూ..అమ్మ దర్శనం అయిందా?.." అన్నారు..కేశవులు గారు ఇంకా ఆ భ్రమలో నుంచి బైటపడలేదు..వళ్ళంతా చెమటలు పట్టి.. కంపిస్తోంది..


"లేదు స్వామీ..ఆ వెలుగు భరించలేకపోయాను.." అన్నారు..


"చూసావా నాయనా!..కొద్దిపాటి చిత్కళ నే భరించలేకపోయావే.. ఇక సంపూర్ణ దర్శనం అయితే తట్టుకొని ఈ భూమ్మీద వుండగలవా?..మహా మహా యోగులు ఎంతో సాధన చేసి..తపస్సు చేసి..ఒక స్థాయికి చేరిన తరువాతే..ఆ వెలుగును భరించగలరు..ఆ నమ్మకం వారికి కలిగాకే..వారు భగవంతుడి సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తారు..దైవ దర్శనం, యోగం, బ్రహ్మవిద్య అనేవి సులభసాధ్యాలైతే..ధనం తోనో..కానుకలతోనో..పొందేవి అయితే..ఈపాటికి ఈ భూమ్మీద ఎంతో మంది ధనవంతులు దేవీ దేవతల సాక్షాత్కారం పొంది..వారిని కూడా తమ ఇనప్పెట్టెలో దాచివుంచేవారు..దేనికైనా ఒక స్థాయి ఉంటుంది..గృహస్తు కర్తవ్యం గృహస్థు చేయాలి..సన్యాసి కర్మ..సన్యాసి చేయాలి..ఎవరికి నిర్దేశించిన మార్గం వారు అనుసరించాలి..నాలాటి వారికి ఈ యోగ సాధన అనువైనది..మేము ప్రలోభాలకు లొంగకూడదు..నా సౌకర్యాల కోసం నీవు తపించకు.." అని చెప్పారు..


కేశవులు గారికి ఆ క్షణమే శ్రీ స్వామివారు చేసిన బోధ బాగా హత్తుకున్నది.. ఆనాటి నుంచీ శ్రీ స్వామివారికి శిష్యుడిగా మారిపోయారు..తన కర్తవ్యమేమిటో చెప్పమని స్వామివారిని కోరారు..


"ఆ మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి గర్భాలయాన్ని బాగుచేయించు!..భక్తులకు ఇబ్బందిగా ఉంది..పదిమందికి సేవ చేసినట్లుగా ఉంటుంది" అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు..తక్షణమే ఆ పని చేయిస్తానని..కాకుంటే ఒక్కసారి తన కోరికను మన్నించి, తన గృహాన్ని పావనం చేయమని ప్రాధేయపడ్డారు కేశవులు గారు..శ్రీ స్వామివారు సరే నని ఒప్పుకున్నారు..


ఆ తరువాత కొంతకాలానికి  విజయవాడ లోగల కేశవులు గారింటికీ శ్రీ స్వామివారు వెళ్లారు..అక్కడ కొంతకాలం వున్నారు..కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారింట్లోనూ కొద్దిరోజులున్నారు స్వామివారు..శ్రీ స్వామివారు ఎక్కడున్నా తన సాధన మాత్రం ఖచ్చితంగా చేసేవారు..కేశవులు గారు, మస్తాన్ రావు గార్లు నాగార్జున సాగర్ సమీపంలో ఒకటిన్నర ఎకరా స్థలాన్ని శ్రీ స్వామివారి ఆశ్రమం కోసం ఇస్తామని తెలిపారు..వద్దు అని ఖచ్చితంగా చెప్పేసారు శ్రీ స్వామివారు.


శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి గర్భాలయ మరమ్మత్తులు కేశవులు గారు మొదలుపెట్టారు..సరిగ్గా అప్పుడే శ్రీధరరావు గారితో పరిచయం ఏర్పడింది కేశవులు గారికి..శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారి గురించిన మరెన్నో విశేషాలు కేశవులు గారు చెప్పుకొచ్చారు..ఇద్దరికీ శ్రీ స్వామివారి మూలంగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది..


అలా శ్రీధరరావు గారు  శ్రీ స్వామివారి గురించి అన్ని వివరాలూ సేకరించారు...అందుకే..ప్రభావతి గారడిగినప్పుడు "అన్ని విషయాలూ నేను చెపుతాను ప్రభావతీ!.." అన్నారు...


శ్రీ స్వామివారి కోరిక....రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: