28, అక్టోబర్ 2023, శనివారం

స్వామివారి సంకల్పం

 *స్వామివారి సంకల్పం..*


ఆరోజు శనివారం.."మా అమ్మాయి పరీక్షలు దగ్గరపడుతున్నాయి..కష్టపడి చదువుతున్నది..మీకు అమ్మాయి పేరు, గోత్రము పంపుతాను..స్వామివారి వద్ద అర్చన చేయించండి..అది ఎంత కష్టపడ్డా..స్వామివారి కృప వుంటే..సులభంగా పరీక్ష గట్టెక్కుతుంది..పాపకు పరీక్షలు పూర్తి కాగానే..దానిని తీసుకొని నేనూ మావారూ మొగిలిచెర్ల కు వచ్చి ఆ దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటాము..మా అబ్బాయి విషయం లో స్వామివారు పరిపూర్ణంగా కరుణ చూపబట్టే..వాడు స్థిరపడ్డాడు..అమ్మాయి పేరు తో అర్చన చేయించండి..మీకు నమస్కారాలు.." అంటూ హేమలత గారు ఫోన్ చేశారు.."సరే అలాగే గోత్రనామాలు పంపించండి.." అన్నాను..


ప్రతి శనివారం నాడు పల్లకీసేవ జరుపుతామని పాఠకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇలా ఏదైనా కోరికతో అర్చన చేయించదల్చిన వారికి..శనివారం నాడే తమ గోత్రనామాలు నాకు పంపమని నేనూ చెపుతూ ఉంటాను..అలా నాకు మెస్సేజ్ రూపం లో వచ్చిన వారి పేర్ల తో స్వామివారి పల్లకీసేవ వద్ద అర్చన జరిపిస్తాము..మా అర్చకస్వాములు కూడా ఆ గోత్రనామాలు శ్రద్ధగా చదువుతారు..ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ..ఒక్కొక్కసారి నూరు మందికి పైగా తమ తమ పేర్లను పంపుతారు..భవిష్యత్ లో ఏదైనా మార్పు ఉంటుందేమో మాకు తెలియదు..అది స్వామివారి అనుగ్రహాన్ని బట్టి వుంటుంది..కాకుంటే..ఒక్కొక్కరికి ఐదు శనివారాల వరకూ ఇలా మేము అర్చన చేయిస్తాము..ఆపై కూడా కావాలంటే..వాళ్లే వచ్చి స్వయంగా అర్చన చేయించుకొని వెళ్ళమని చెపుతుంటాము..ప్రస్తుతానికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నాము..


మరో మూడు వారాల తరువాత హేమలత గారు మళ్లీ ఫోన్ చేశారు..అమ్మాయికి పరీక్షలు పూర్తి అయ్యాయని..కుటుంబం అంతా కలిసి మరో రెండువారాల తరువాత స్వామివారి సమాధి దర్శనం కొరకు రాదల్చుకున్నామని చెప్పారు..రండి అని అన్నాను..అనుకున్న విధంగానే హేమలత గారు తన భర్త, పిల్లల తో కలిసి మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు..పల్లకీసేవ కు తమ పేర్లు నమోదు చేయించుకొని..నా వద్దకు వచ్చి కూర్చున్నారు.."ప్రసాద్ గారూ..అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది..ఇప్పుడు వాడికి ఇరవై నాలుగేళ్లు..అమ్మాయికి ఇరవై ఒకటి నడుస్తోంది..వాడికి వివాహం చేద్దాం అని అనుకుంటున్నాము..ఇప్పుడే తొందర వద్దు అని మావారు అంటున్నారు..నేను వివాహం చేద్దాము అని అంటున్నాను..అబ్బాయికి వివాహం చేయాలా? వద్దా? అని మాలో మేము మథన పడటం ఎందుకని..స్వామివారికే విన్నవించుకుందామని ఇక్కడికి వచ్చాము..వాడి పెళ్లి అయిన మరుసటి సంవత్సరమే అమ్మాయికి కూడా పెళ్లి చేస్తాము..అది గట్టిగా నిర్ణయించుకున్నాము.." అన్నారు.."మీరు నిర్ణయం తీసుకోవడం సరే..ఇంతకూ మీ పిల్లలు ఒప్పుకున్నారా?" అని అడిగాను.."అదేం లేదండీ..అంతా మీ ఇష్టం.." అని చెప్పేసారు..అన్నారు హేమలత గారు..ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని..ప్రక్కరోజు ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తమ ఊరికి వెళ్లిపోయారు...


మరో నెల తరువాత.."ప్రసాద్ గారూ..స్వామివారి వద్ద అమ్మాయి పేరుతో అర్చన చేయించండీ..అమ్మాయికి సంబంధం వచ్చింది..అన్నివిధాలా బాగుంది..ఈ సంబంధం ఖాయం అయింది..దాని పేరు తో అర్చన చేయించండి.." అని హేమలత గారు ఫోన్ చేశారు.."అదేమిటి..మీరు అబ్బాయి గురించి కదా స్వామివారికి మొక్కుకున్నది..ఇప్పుడు అమ్మాయి వివాహం అంటున్నారు.." అని అడిగాను.."మేము స్వామివారి వద్ద కోరుకున్న కోరిక మా అబ్బాయి వివాహం గురించే..కానీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది..ఇది కూడా స్వామివారి అనుగ్రహమే అని అనుకున్నాము..మరో రెండేళ్ల దాకా పాపకు పెళ్లి అనుకోలేదు..కానీ..ఈ సంబంధం వాళ్ళు రావడం..మమ్మల్ని అడగటం..అమ్మాయి కూడా పెళ్ళికి ఒప్పుకోవటం చక చకా జరిగిపోయాయి..బాగా ఆలోచిస్తే..ఈ వయసులోనే అమ్మాయికి వివాహం చేయటం సరైనదేనని అనిపించింది..స్వామివారిని పూర్తిగా నమ్మాము..మాకు ఏది మంచిదో అదే ఆయన చేస్తాడు అని అనుకుంటున్నాము..ఏమో..అబ్బాయికి కూడా మరో మంచి సంబంధం చూసి పెట్టారేమో స్వామివారు..అంతా ఆయన దయ.." అన్నారు భక్తిగా..


హేమలత గారి మాటలు నిజమే..మరో ఆరునెలలు గడిచేలోపలే..వారి కుమారుడికి కూడా వివాహం నిశ్చయం అయింది..ఆ ఇద్దరు పిల్లల్లో ఎవరి వివాహం ముందుగా జరపాలో స్వామివారు నిర్ణయం చేసారు..ఆమాటే హేమలత గారు పదే పదే చెపుతుంటారు.."కోరుకోవడం వరకే మనచేతుల్లో ఉన్నది..అమలు చేసే విధానం స్వామివారు చూసుకుంటారు..మనం ఆ నిర్ణయాన్ని స్వాగతించడం వరకే చేయాలి.."


నిజమే కదా?...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: