బెంగుళూరు ఎక్స్ ప్రెస్ కాచిగుడా స్టేషన్లో కరెక్ట్ టైంకి వొఛ్చి ఆగింది.
జనం సామాన్లను పట్టుకుని త్వరత్వరగా రైలు వైపుకు సాగారు.
లక్ష్మి పెట్టెని ఈడ్చుకుంటూ ముందుకు నడుస్తోంది. ఆమెతోపాటు చెల్లెల్లు సరస్వతి కూడా ఒక పెట్టెని తోసుకుంటూ నడుస్తోంది. వాళ్ళిద్దరికీ కాస్త వెనకగా పదహారేళ్ళ కుర్రాడు సరస్వతి కొడుకు సృజన్ అమ్మమ్మ చేయిపట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు.
ముగ్గురూ రైలు ఎక్కారు
సీట్ నంబర్లు చూసుకున్నారు. ఆ లోగానే సృజన్ అమ్మమ్మని జాగ్రత్తగా కూర్చోపెట్టాడు.
తర్వాత సామాన్లు సీట్లకింద పొందికగా సర్దేసారు సృజన్, లక్ష్మి
సరస్వతి మౌనంగా కూర్చుంది. ఆమె చాలా బాధ పడుతోంది. పదే పదే కళ్ళు నీళ్లతో నిండుతున్నాయి.
”అక్కా అమ్మ జాగ్రత్త. బెంగుళూరులో చలి ఎక్కువగా ఉంటుంది. కదా. దాన్ని అమ్మ తట్టుకుంటుందో లేదో. జాగ్రత్త. చలికాలం అయిపోయాక తీసుకెళ్లవలసిందేమో. ” అంది
”ఏమీ పర్వాలేదు సరస్వతీ హీటర్ వున్న గదిలోనే అమ్మ ఉంటుంది. నువ్వు ధైర్యంగా వుండు ”అంది లక్ష్మి.
ఈ లోగా ఫోన్ మోగింది . లక్ష్మి హలో తమ్ముడూ అంది .
”ఎవరి ఫోన్ ?”అడిగింది సరస్వతి
”పెద్ద తమ్ముడు” అని చెప్పి ”చెప్పారా తమ్ముడూ ఏమిటి సంగతి ?” అని అడిగింది లక్ష్మి
”అమ్మ జాగ్రత్తక్కా” అన్నాడు పెద్దతమ్ముడు.
”మేము బయలుదేరడానికిముందే చిన్నతమ్ముడు కూడా చేసాడురా అమ్మ జాగ్రత్త అని. నేను మీ అందరి కంటే ముందు పుట్టినదాన్ని కదా. నాకు అమ్మని జాగ్రత్తగా చూసుకోడం తెలుసు” కాస్తంత నిష్టూరంగా అంది లక్ష్మి.
”అయ్యో నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోవని కాదక్కా నువ్వు అమ్మని తీసుకెళ్తున్నావన్న బెంగ నాది” అంది సరస్వతి.
”అమ్మకి ఈ మధ్య మతిమరుపు బాగా వొస్తోంది కదా అని నేను జాగ్రత్త చెప్తున్నాను” అన్నాడు పెద్ద తమ్ముడు.
”ఫోన్ ఇటివ్వవే” అని కూతురి దగ్గరినుండి ఫోన్ తీసుకున్న సీతమ్మ ”నా గురించి దిగులు పడకండిరా నేను
బాగానే వున్నాను. లక్ష్మి చక్కగా చూసుకుంటుంది” అంది.
ఫోన్ కట్ చేసింది లక్ష్మి
”వేళకి భోజనం చెయ్యి. మీ అమ్మని విసిగించకు”అంది మనవడితో సీతమ్మ.
రైలు కూత పెట్టింది.
‘తొందరగా రైలు దిగండి . లేపొతే కష్టం””అంది కంగారుగా సీతమ్మ
”ఏం ఫర్వాలేదమ్మమ్మా కూల్ ” అన్నాడు సృజన్.
”వొద్దొద్దు దిగండి దిగండి ”’అరిచినట్టుగా అంది సీతమ్మ.
”అయ్యో రైలు కదిలిపోతుందే దిగండి దిగండి. ” కూర్చున్నచోటు నుండి లేచి సరస్వతిని లేపి కంగారుగా అంది సీతమ్మ.
తప్పనిసరిగా సరస్వతి, సృజన్ రైలు దిగారు.
కిటికీ దగ్గర నిలబడ్డారు. సరస్వతి ఏమీ మాట్లాడకుండా దిగులుగా చూస్తూ తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.
”బయలుదేరండి. రైలుని ఆనుకుని నిలబడితే పడిపోతారు” అంది సీతమ్మ
”అబ్బా పర్వాలేదమ్మా” అంది సరస్వతి
కూతురి చేతుల్లోంచి తన చేతిని లాగేసుకుని” మీరు బయలుదేరకపోతే నాకు బీపీ పెరిగేలా ఉంది. బయలు దేరండి. లేకపోతే పడిపోతారు. అదిగో రైలు కదుల్తోంది ”అంది సీతమ్మ. ఆమె ముఖంలో భయం స్పష్టoగా కనిపిస్తోంది.
”సరే అమ్మా కంగారు పడకు” అంటూ దూరంగా జరిగింది సరస్వతి.
రైలు నెమ్మది నెమ్మదిగా నడక మొదలెట్టి ముందుకు సాగింది.
అటు సరస్వతి, సృజన్ ఇటు సీతమ్మ, లక్ష్మి ఎవరున్న చోట వారుండి చేతులు వూపుతూనే వున్నారు.
” పిచ్చిపిల్ల నా మీద బెంగ పెట్టుకున్నట్లుంది” అంది సీట్లో జార్లబడి కూర్చుని సీతమ్మ.
”అవును”. అంది లక్ష్మి.
భాగ్యనగరానికి బైబై చెప్పిన రైలు రెండునిముషాల్లో జడ్చెర్లను దాటి మహబూబ్ నగర్ వైపుకు పరుగు పెట్టింది.
”అమ్మా దిండు తియ్యనా జార్లబడి కూర్చుంటావా “?పక్క పరిచేస్తాను అది నయమేమో” అంది లక్ష్మి.
”అప్పుడే అక్కర్లేదు కిటికీ దగ్గర కూర్చుని చూస్తూ వుంటాను కాస్సేపు” అంది సీతమ్మ.
”అయితే ఇటొఛ్చి కూర్చో” అని సీతమ్మని లేపి వేరే బర్త్ మీద కూర్చునేందుకు సాయం చేసిన లక్ష్మి అప్పర్ బర్త్ మీద పెట్టి వున్న కాగితపు సంచిని లాగి అందులో వున్న రగ్గు, దుప్పట్లు తీసి తల్లికి నీటుగా పక్క వేసింది. ఇంటినుండి సరస్వతి తెచ్చ్చిన ఇడ్లీలు, మంచినీళ్లు అందించింది. తాను కూడా రెండిడ్లీలు తిని అన్ని సర్దేసింది.
”చీకట్లో చూసేందుకేముందమ్మా’? అడిగింది చీకట్లోకి చూస్తూ కూర్చున్న తల్లిని లక్ష్మి
”చీకట్లో జీవితముందే లక్ష్మి. చీకటిగా వున్న తల్లి గర్భంలోంచి శిశువు బయటికి వొస్తుంది. చీకటిలోంచి రైలు వెలుగు దిశగా పరుగుపెడుతోంది. చీకటిని తిడుతూ కూర్చోడమూ, వెలుగుకు దూరంగా ఉన్నానే అని ఏడుస్తూ కూర్చోడమూ మానేసి, వెలుగు దారులు వెతుక్కుంటూ ఈ రైలులా జీవితాన్ని ముందుకు నడపాలి”. అంది సీతమ్మ.
”బాగా చెప్పావు ”. ‘అంది లక్ష్మి.
‘చీకటి దారిలో నడుస్తూ వెలుగు వైపుకు వెళ్ళు. లేదా నువ్వే చీకటిలో చిరుదీపమై ప్రకాశించు’ అని మా వీధి బడిలో మాస్టరుగారు చెప్పారు ”అంది సీతమ్మ.
”చాలా బాగా చెప్పారమ్మా” అంది లక్ష్మి.
రైలు వేగంగా పరుగుతీయసాగింది. తల్లి కూతుళ్లు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తమ చుట్టూ కూర్చున్న ఇతర ప్రయాణికులను గమనిస్తూ కునికిపాట్లు పడసాగింది సీతమ్మ .
”నిద్రపో అమ్మా. ప్లాట్ ఫార్మ్ అంతా నడిచి అలిసిపోయావు కదా” అంది లక్ష్మి.
సీతమ్మ తలవూపి సరిగ్గా పడుకుని రగ్గు కప్పుకుంది. లక్ష్మికి ఎంతకీ నిద్రపట్టక కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. గద్వాల్, కర్నూల్, దోనే వోక్కక్కటిగా వొస్తూన్న స్టేషన్లు అందులోని ప్రయాణికులనూ చూస్తూ తన ఆలోచనల్లో తానుండిపోయింది లక్ష్మి.
చాలా సేపటికి బడలికగా, వీపు పట్టేసినట్టుగా అనిపించడంతో పక్క పరుచుకుని నడుము వాల్చింది. అర్ధరాత్రి కావడంతో రైల్లోని ప్రయాణికులంతా నిద్రలో జోగుతున్నారు. ఉయ్యాల ఊపుతూ జోల పాడుతున్నట్టుగా రైలు సాగుతూ అర్ధరాత్రివేళ లక్ష్మిని నిద్ర పుచ్చింది.
లక్ష్మికి మెలుకువ వచ్చేసరికి 5 దాటిపోయింది. జనాల హడావిడే ఆమెకి నిద్రాభంగం చేసింది. కళ్ళు నులుము కుంటూ కూర్చుంది. ఎదుటి బర్త్ వైపు చూసింది. తల్లి కనిపించలేదు.
‘పెందరాళే లేచే అలవాటు కదా ముఖం కడుక్కోడానికి వెళ్ళిందేమో’ అనుకుంది లక్ష్మి.
పావుగంట అయినా తల్లి బయటికి రాలేదు. అది ఆమెని భయపెట్టింది ‘కొంపదీసి కళ్ళు తిరిగి ఎక్కడో పడలేదు కదా’ అనుకుంటూ గబుక్కున లేచి చుట్టుపక్కలా, టాయిలెట్లు చూసింది . తల్లి ఫోనుకి రింగ్ చేసింది . సీతమ్మ పడుకున్న చోట దిండు కింద సెల్ ఫోన్ దొరికింది.
ఎక్కడా సీతమ్మ కనిపించలేదు. కాలూ చెయ్యి ఆడలేదామెకి. గుండె దడ దడ లాడసాగింది. పిచ్చ్చిపట్టినదానిలా వొక భోగిలోంచి ఇంకో భోగిలోకి,అక్కడి టాయిలెట్లలోకి వెళ్లి చూసింది.
సీతమ్మ కనిపించలేదు.
‘అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైపోయింది? ఏమీ అర్ధం కాలేదు. రైలు దిగి వెళ్ళిపోయి ఉంటుందా?అలా ఎందుకు వెళ్తుంది?అదికూడా అర్ధరాత్రి వేళ. . . . ఎవరైనా ఎత్తుకుపోయేందుకు అమ్మేమైనా చిన్నపిల్లా? కాదుగా.
బుర్ర పని చెయ్యలేదు. ” చైన్ లాగి రైలుని ఆపాలా?”
‘లేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ?’
”అమ్మా అమ్మా” అని తప్పిపోయిన చిన్నపిల్ల తల్లిని వెతుక్కున్నట్టుగా కన్నీళ్ల పర్యంతమవుతూ ఏడుస్తూ మరోసారి భోగీలన్నీ తిరిగింది. టీ సీ ఎక్కడా కనిపించలేదు.
” ఏమైందండీ?” ప్రయాణికులు ఎవరో అడిగారు
”అమ్మ. అమ్మ కనిపించడంలేదు” ఏడుస్తూ అంది.
”ఎప్పటినుండి కనిపించడంలేదు ?”
”చివరగా ఎప్పుడు చూసారు?”
”రాత్రి పడుకుందండి పొద్దున్న చూసేసరికి లేదు. ” కంగారుగా చూస్తూ వణికే స్వరంతో అంది. లక్ష్మి.
”ఆవిడకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయా డేమెన్షియా లాంటివి?”
”ఆదీ మధ్యే మొదలయ్యిందండి. ”అంటూ చైన్ లాగే ప్రయత్నం చేసింది లక్ష్మి. ఆమె ప్రయత్నం ఫలించి రైలు ఆగలేదు.
”అయ్యో అలాంటి వ్యాధి వున్నవారిని ప్రయాణం చేయించడం తప్పు. స్వంత వాహనం ఫరవాలేదు కానీ రైలెక్కించి తీసుకు రావడం ఇంకా తప్పు”అన్నాడింకో ఆయన
”ప్లీజ్ నాకు కాలూ చెయ్యీ ఆడడం లేదు. గుండె దడలాడిపోతోంది. రైలు ఆపండి టీసీని పిలవండి” ఏడుస్తూ అంది లక్ష్మి. అందరూ గుమిగూడారు. గోలగోలగా మాట్లాడసాగారు. చైన్ లాగాలని ఒకరు,పోలీస్లకి చెప్పాలని ఒకరు, మీడియాకి వివరించాలని ఇంకొకరూ మాట్లాడుకోసాగారు. జరుగుతున్నా తంతంతా వీడియో తీశాడొకడు.
తనతోపాటు ఉన్న వ్యక్తి కనిపించకుండా పోవడమన్న భయంకర సమస్య పగవారికి కూడా ఎదురవ్వకూడదు. రోజూ టీవీల్లోనూ పేపర్లలోనూ కనబడుటలేదు అనే ప్రకటనలతో కూడిన ఫోటోలు చూస్తే జాలేస్తుంది. ఇవాళ గుండె పగిలేంత బాధగా వుంది. అసలు అసలు అమ్మ కనిపించకపోవడమేంటి? రాత్రి దాకా తనతో కబుర్లు చెప్పిన మనిషి తెల్లవారగానే అదృశ్యమవ్వడమేంటి?
ఇప్పటికే ఆలస్యమయింది ఇకనైనా గట్టిగా లాగాలి లేదా ఎవరిచేతయినా చైన్ లాగించాలి అనుకుని గబగబా చైన్ దగ్గరికెళ్లి లాగే ప్రయత్నం చేసింది.
చేతులు వొణుకుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. గుండెని ఎవరో పిండేస్తున్నట్టుగా బాధగా వుంది.
”చైన్ లాగొద్దు. ఎలాగా ఎలహంకా జంక్షన్ వొస్తోంది కదా అక్కడ విషయం చూసుకోవచ్చు” అన్నాడొకతను.
”అయ్యో ఈ లోగా అమ్మకేమైనా అవుతుందేమో. ఆవిడ నాకోసం వెతుక్కుంటోందేమో. పొద్దున్న అయిదింటికల్లా కాఫీ తాగకపోతే వుండలేదు. కళ్ళు తిరుగుతున్నాయేమో. బీపీ షుగర్ డౌన్ అయిపోయాయేమో. ఎలా ఇప్పుడెలా” గుండెలు బాదుకుంది లక్ష్మి.
విషయం లక్ష్మిని దాటి జనంలోకి వెళ్ళిపోయింది. ఒకరు పోలీసులకి చెప్పారు. ఇంకొకరు మీడియాకి వివరణ వీడియోతో పంపారు. లక్ష్మికి కంగారులో శక్తి సామర్ధ్యాలు ఉడిగిపోయినట్టయ్యింది. విరోచనాలు వాంతులూ మొదలయ్యాయి. తలా గిరగిరా తిరిగిపోసాగింది. ఏమయ్యిందో ఎందుకిలా అయ్యిందో అర్ధం కావడంలేదు. ‘అమ్మా అమ్మ’ అంటూ ఏడవసాగింది. జుట్టు పీక్కోసాగింది. మరి కాస్సేపటిలో రైలు నడక వేగం తగ్గించింది. ”చూసారా స్టేషన్ వొస్తోంది. చైను లాగొద్దని ఎంత కరెక్టుగా చెప్పానో చూడండి. మీ డబ్బులు ఆదా చేసాను నేను ” అన్నాడు చైన్ లాగొద్దని చెప్పినాయన. లక్ష్మికి ఏ విషయమూ బుర్రకి ఎక్కడంలేదు.
ఎలాహంకా జంక్షన్ రాగానే రైలు ఆగింది. జరుగుతున్న తంతు చూస్తూనే దిగేవాళ్లు దిగారు. టీ సి రైలు ఎక్కాడు. క్షణాల్లో పోలీసులు వచ్చారు. రైలు ప్రయాణం అక్కడ సమస్య వల్ల అరగంట ఆలస్యం అయ్యింది.
”అయ్యో నాకు లేట్ అయ్యింది” అని గొణిగారొకరిద్దరు. తర్వాతి స్టేషన్ బెంగళూరు కాబట్టి కొందరు దిగిపోయారు. ఏదో ఛానల్ వాళ్ళొఛ్చి సీతని ప్రశ్నలతో ముంచెత్తుతూ లైవ్లో చూపించసాగారు. ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్,వాట్సాప్ లో విషయం వైరల్ అయ్యింది.
దేశమంతా విషయం తెలిసిపోయింది. సరస్వతి కాల్ వొస్తోందని ఫోన్ వైపు చూసినా అది ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లక్ష్మి లేదు. తమ్ముళ్లు కూడా రింగ్ చేస్తున్నారు.
చూసి చూసి ఒక మీడియా ఆతను ఫోన్ తీసాడు. ” అక్కతో మాట్లాడాలి” అరిచినట్టుగా అన్నాడు తమ్ముడు.
”ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు” చెప్పాడు మీడియా ఆతను. వెంటనే ఫోన్ కట్ చేసాడు.
పోలీసులు లక్ష్మిని రకరకాల ప్రశ్నలు వేశారు.
ఆలస్యంగా రైలు బయలుదేరింది. కుప్పకూలినట్టయిన లక్ష్మిలో చలనం లేదు.
బెంగూళూర్లో రైలు దిగగానే లక్ష్మి భర్త, కూతురు ఆమెని కలుసుకున్నారు
”ఏమైంది లక్ష్మి?” అడిగాడు భర్త. భర్తని కరుచుకుని అదే జవాబన్నట్టుగా బావురుమంది లక్ష్మి.
పిచ్చ్చిపట్టినట్టూ, పది లంకణాల జ్వరంతో వున్నట్టూ రేగినజుట్టుతో ఎర్రబడ్డ కళ్ళతో వున్న లక్ష్మిని చూస్తే ఆమె భర్తకి, బిడ్డకి భయమేసింది.
నడిచే ఓపిక ఆమెలో వున్నట్టులేదు. కష్టపడి నడుస్తున్న ఆమెని ఒక పెద్దాయన ఆపాడు.
”మేడమ్ ఒక్క నిముషం ఆగుతారా మీతో మాట్లాడాలి. నేను మిస్సింగ్ సీనియర్ సిటిజన్స్ బ్లాగ్ స్పాట్ నుండి వచ్చాను. తప్పిపోయిన పెద్దల సంగతులు చూసి వారిని ఇళ్ళకి చేర్చే పనిని ఉచితంగా చేస్తాము. దేశం మొత్తంలో మా సభ్యులు వున్నారు “అన్నాడు
లక్ష్మికి ఎవ్వరితోనూ మాట్లాడాలని లేదు. అసలు ఎవ్వరిని కలవాలనే లేదు.
నిస్సహాయంగా భర్తవైపు రక్షించమన్నట్టు చూసింది. అతన్ని చూసిన తర్వాత ఆమెకి ఉడిగిపోయిన శక్తి కాస్తంత తిరిగి వోచ్చ్చినట్టు అనిపించింది.
”ఇప్పుడు నా భార్య మాట్లాడే పరిస్థితిలో లేదండి వదిలేయండి” అన్నాడు భర్త. .
”మీరేమీ మాట్లాడక్కర్లేదు. నేనిఛ్చిన కాగితo చదివి అందులో రాసున్న ప్రశ్నలదగ్గర జవాబులు రాసివ్వండి. ఆవిడ గురించిన వివరాలు వగైరాలు తెలిస్తే మేము మీ అమ్మగారిని మీతో కలిపేందుకు ప్రయత్నిస్తాము.’ అన్నాడు పెద్దాయన.
ఆయన వయసును గౌరవించో ఏమో లక్ష్మి కూతురు కాగితాన్ని అందుకుంది . జవాబులు తాను రాసి తల్లిని కనుక్కుని కొన్ని రాసింది. తల్లి ఫోన్లో ఉన్న అమ్మమ్మ ఫోటో పెద్దాయనకి ఫార్వర్డ్ చేసి ఫోన్ నంబర్లూ మెయిల్ ఐడీలూ రాసి ఆయనకీ కాగితాన్ని అందించింది. లక్ష్మి కుటుంబ సభ్యులంతా త్వరత్వరగా అక్కడినుండి తమ ఇంటికి బయలుదేరారు.
*****
కాశీ క్షేత్రంలోని ఒక వృధాశ్రమం —–
లింగాష్టకం చదువుతూ జాకెట్లు కుడుతున్నారు కొందరు. చీరలమీద ఎంబ్రాయిడరీ చేస్తున్నారు ఇంకొందరు. పూసలు వూల్ వగైరాలతో గాజులూ జుంకాలూ చేస్తున్నారు ఇంకొందరు. వూలుతో స్వెటర్లూ శాలువాలు అల్లుతున్నారు మరికొందరు. బొంతలు కుడుతున్నారు మిగతావారు. అందరిదృష్టి వారి పని మీదే ఉంది. యాంత్రికంగా పని చేసుకుపోతూ భగవన్నామస్మరణలో వున్న వారిని అడ్డుకోకుండా మౌనంగా నిలబడింది వాళ్ళీడే వున్న ఒక వయోధికురాలు.
లింగాష్టకం పూర్తయ్యింది. అందరూ క్షణం పాటు విశ్వేశ్వరుడిని ధ్యానించుకున్నారు .
మరో స్తోత్రం మొదలుపెట్టేలోగా దూరంగా నిలబడిన వయోధికురాలు ముందుకు వొచ్చింది.
సీతగారు నమస్కారం అని అచ్చతెలుగులో పలకరించింది. అక్కడున్న ఇతర మహిళలు ప్రశ్నార్థకంగా చూసారు. కానీ సీతమ్మ మాత్రం ఉలిక్కిపడింది. అయినా తన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ వూలుతో మఫ్లర్ అల్లుకు పోసాగింది. వయోధికురాలు సీతమ్మ దగ్గరికి వొఛ్చి మీతో కాస్సేపు మాట్లాడాలండి” అంది.
సీతమ్మ జవాబివ్వలేదు.
”ఒక్కనిముషానికి ఇటు రండి ప్లీజ్” అంది వేడుకోలుగా
తప్పనిసరిగా లేచింది సీతమ్మ.
ఇద్దరూ అందరికీ దూరంగా నడిచి ఒక చోట కూర్చున్నారు.
”చెప్పండి ఎందుకు మీ అమ్మాయిని వొదిలిపెట్టి రైలుదిగి వెళ్లిపోయారు?”
“ . . . . . . . .”
”పాపం మీ అమ్మాయి ఎంతో ఏడుస్తూ ఉండగా ఎవరో తీసిన( వైరల్ అయిన) వీడియో చూసి దక్షిణ దేశం యావత్తూ కదిలిపోయింది . మీ జాడ ఎవ్వరికీ తెలియలేదు. మీరు బ్రతికి వున్నారో లేదో తెలీదు. మీ పిల్లలు మీ పెద్దమ్మాయిని యెంత సాధించినదీ మీకవసరం లేదు. మీరు మీ మానాన వుండి లక్ష్మిని అలా వేధించడం తప్పుకదా. కన్నబిడ్డల బాధని పట్టించుకోకుండా ఇంత దూరానికి ఎందుకు వొచ్చారు????ప్రశ్నలమీద ప్రశ్నలు సంధించింది వయోధికురాలు.
పెదవి విప్పి తన విషయాలన్నీ వివరించింది సీతమ్మ
”నాకు చాలా చిన్నప్పుడే పెళ్లయ్యింది. పెళ్ళవుతూనే అత్తగారింట్లో ఇంటిపని, వంటపని, పశువులు చూసుకోడం, వొచ్ఛేపోయే ఆడపడుచులు, ఇతర అతిధుల అవసరాలు కనుక్కోడంలోనే నాకు తెలీకుండా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. పిల్లలు పుట్టారు. వాళ్ళ పనులు అదనమయ్యాయి. అలాగే చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా నా పాత్రకి పూర్తిగా న్యాయం చేసాను.
పిల్లలు పెద్దయ్యారు. పెళ్లిళ్లయ్యాయి. మంచి ఉద్యోగాల్లోనూ సెటిల్ అయ్యారు. అప్పుడు ఒక రోజు నా భర్త ‘రకరకాల పుణ్యక్షత్రాలు తిరుగుతూ సరదాగా గడుపుదాం’ అన్నారు. నాకు ప్రాణం లేచొచ్చింది. యెంత సంబర పడ్డానో చెప్పలేను. కానీ తన పసిపాపని చూసుకోవడానికి నేను తనతో ఉండడం జరిగితేనే తాను వుద్యోగం చెయ్యగలనంది నా పెద్దకూతురు లక్ష్మి. దాంతో బెంగుళూర్లో పిల్లని చూసుకుంటూ ఇంటిపని వంటపని చేస్తూ ఉండిపోవలసి వొచ్చింది. నా భర్త అడపాదడపా వొఛ్చి వెళ్లేవారు. అది అవుతూనే పెద్దబాబు, చిన్నబాబు, చిన్నకూతురు ఇలా వొకరింటి తర్వాత వొకరింటికి వెళ్తూ వంటలక్కగా పనిమనిషిగా మిగిలిపోయాను.
‘నాన్న పెద్దవుతున్నారు అమ్మ ఆయనని చూసుకోవాలి’ అని కాని ‘అమ్మకి విశ్రాంతి ఇవ్వాలని కానీ ఎవ్వరికీ తట్టలేదు. కనీసం తాము వెళ్లే సినిమాలూ షికార్లకి కూడా నన్ను ఎప్పుడూ తీసుకు వెళ్ళలేదు. అమ్మ అంటే ఒక పనిమనిషి. దానికి జీతం బత్తెం అక్కరలేదు. విశ్రాంతి వినోదాలు అవసరంలేదు. ఆయన ఎప్పుడు నాతొ ఏ ప్రోగ్రామ్ పెట్టినా పిల్లలెవరో ఒకరు చెడగొడుతూ వంతులవారీగా నన్ను వాడుకుంటూనే ఉన్నారు. నా భర్త గుండెపోటుతో ఎవ్వరూ దగ్గర లేకుండా దిక్కులేనివాడిగా పోయారు. అది నన్నెంతో బాధ పెట్టింది. కానీ అది నా పిల్లలెవరికీ పట్టలేదు. మళ్లీ వంతులవారీగా సేవలు మొదలయ్యాయి. నాకు జ్వరం వొచ్చ్చినా ఒక్క పూట కూడా సెలవులేని పని నాది. ఇది అమ్మ పని కాదు పనిమనిషి పని .
చూసినవారంతా విదేశాలకి తిప్పే కొడుకులూ దేశంలో ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్లలో తిప్పే ఆడపిల్లలూ వున్న నేనెంతో అదృష్టవంతురాలిని అనుకుంటారు . నా దృష్టిలో ఇది అదృష్టం కాదు . వెట్టిచాకిరిని ప్రేమ అనే ముసుగేసి చేయిస్తూనే వున్నారు నా పిల్లలు. ఇలా యెంత కాలం అన్నది నాకు ఊహకి అందక అల్లాడిపోసాగాను. జీవితం మీద విరక్తి మొదలయ్యింది. అవకాశం దొరికేదాకా కాచుకున్నాను. పిల్లలకి దూరంగా ప్రశాంతంగా నాకు నచ్చినవిధంగా బ్రతకాలన్న నా కోరికని ఆ రైలు ప్రయాణం తీర్చింది. కట్టుబట్టలతో అనంతపూర్లో రైలు దిగాను. చేతిలో డబ్బుంది. దాని సాయంతో కాశి క్షేత్రానికి చేరుకున్నాను. ఇక్కడ ఎంతో బాగుంది. నా గురించి పిల్లలకి తెలియకూడదని నా సెల్ ఫోన్ కూడా వదిలేసాను. బ్యాంకు లావాదేవీలు పట్టించుకోవడం మానేసాను. ఇక్కడ మేము శ్రమించి కాసిన్ని రూపాయలు సంపాదించు కుంటాము. వాటితో ఏమి చేసినా మా ఇష్టం. ఇంతకీ మీరెలా నన్ను పట్టుకున్నారండి ?”ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ.
“మన వయసువారు మతిమరుపుతో తప్పిపోతూ వుంటారు కదా వారిని జాగ్రత్తగా ఇళ్ళకి చేర్చే టీం మాది. సరే మీ వివరాలు మీ వాళ్లకి చెప్పాలంటారా వద్దా?”అడిగింది వయోధికురాలు
‘నేను ఎక్కడో ఏ ప్రమాదంలోనో చనిపోయానని వాళ్ళని అనుకోనివ్వండి. అమ్మ విలువ ఏమిటో ఇప్పుడు వాళ్లకి అర్ధమవుతుంది. పనివాళ్ళు, వంటవాళ్లు దొరకడం ఎంత కష్టమో తెలుసు కనకే వాళ్ళు నన్ను ఒకరితర్వాత ఒకరుగా వాడుకుంటూ వొచ్చారు. ఆ సంగతులన్నీ మరచిపోయి చరమాంకంలో సుఖ శాంతులతో బ్రతకదలిచాను. రెక్కలు రాగానే ఎగిరిపోతాయి పక్షులు. మళ్లీ వెనక్కి రావు. అదే విధంగా పిల్లలు కూడా తాము ఎదిగి సెటిల్ అయ్యాక తల్లి తండ్రులని వేధించడం పీడించడం వాళ్ళని వాడుకోడం మానేయాలి. వాడుకుని ఓపిక వుడగగానే వయసుడిగిన ఆవుల్ని కటికవాడికి అమ్మినట్టు వయసుమళ్ళిన తల్లి తండ్రులని వృధ్ధాశ్రమాలకి తోలడం మానేయాలి. వార్ధక్యంలో కూడా పెద్దలని వాడుకునే పిల్లలని వెలివేయాలి. . . . లేదా నాలాగా వారికి దూరంగా వెళ్ళిపోయి చివరికాలంలోనైనా తమకోసం తాము” అనేసి చరచరా వెళ్లపోయింది సీతమ్మ.
‘శివశివశివ శివఓమ్ హరహరహరహర ఓమ్ . . . . అంటూ పాటని అందుకున్నారు పనిచేస్తూ వయోధికురాళ్లు సీతమ్మ గబగబా వారిని చేరుకొని కూర్చుని తన పనిని మొదలుపెట్టింది. యెంత ఏకాగ్రతగా పనిచేస్తున్నారో అంతే ఏకాగ్రతగా ఈశ్వర ధ్యానం చేస్తున్నారు.
*****
”సారీ అండీ మీ అమ్మగారి ఆచూకీ కనిపెట్టలేకపోయాము. ఆమె చనిపోయివుంటారని మేమనుకుంటున్నాము. ” అన్నాడు పెద్దల ఆచూకీ కనుక్కుంటానని చెప్పిన వయోధికుడు లక్ష్మితో ఫోన్లో
”మీరేమి చేస్తారండి. వయసు మళ్ళి ఆయువు తీరి ఆమె చనిపోయింది. మీరొక సాయం చేస్తారా అండి ?” అడిగింది లక్ష్మి
” చెప్పండి మీకు ఏమి సాయం చెయ్యాలి ?”అడిగాడు వయోధికుడు
”నాకొక మంచి పనిమనిషి కం వంటమనిషి కావాలండి ”.
”అయ్యో మీకు పనిమనిషి లేదా?”
”ఉండేదండి. ఈ మధ్య చనిపోయింది” అంది లక్ష్మి...!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి