20, జులై 2020, సోమవారం

#మా_కాకినాడ_కథలు : : 37 : :


అన్నపూర్ణమ్మగారు పులిహోర కలుపుతుంటుంటే... సరిగ్గా తాళింపు పెట్టే సమయానికివెళ్ళారు చుట్టుపక్కల కోతిగుంపు.

అందరి చేతుల్లో తలో ముద్దా పెట్టారు ఆవిడ.  

అమృతం కలిపిన ఆ చేతుల్లో ఉందో... 
వండిన వంటలో ఉందో...
తినేసి మళ్ళీ చెయ్యి చాచారు. నవ్వుతూ మళ్ళీపెట్టారు అందరికి. 

అమ్మమ్మగారూ ఇవ్వాళ పండగ కాదు కదండీ... మరి పులిహోర ఎందుకు కలిపారండి అడిగింది ఓ గడుగ్గాయి. 

మీ తాతగారు జ్వరం వచ్చినవాళ్ళకి మందులివ్వడానికి ఊరెళ్తున్నారు. అక్కడ అందరికీ తినడానికి ఉంటుందని చేశాను అంటూ పేద్ద స్టీలు క్యారేజీలో ఆ పులిహోరను సర్ది డ్రైవర్ కు ఇచ్చి పంపేశారు.

వెళ్ళిపోతున్న పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరి చేతుల్లో రబ్బరుబంతంత ఉన్న సున్నుండలు పెట్టడంతో వాళ్ళ మొహాలు వెలిగిపోయాయి. 
                           *       *       *
అన్నపూర్ణమ్మగారి భర్త అయ్యగారి విశ్వేశ్వరశాస్త్రిగారు వాళ్ళది కాకినాడ దగ్గరున్న వి.కె.రాయపురం. ఆ ఊరు నుండి ఎం.బి.బి.ఎస్. చదివిన మొదటి వ్యక్తి ఆయనే. 

భద్రాచలం, రాజవోమ్మంగి, రంపచోడవరం, అడ్డతీగల, చింతపల్లి మొదలైన చోట్ల పనిచేసి ప్రస్తుతం మోతుగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ గా చేస్తున్నారు. ఇంకో మూడు నెలల్లో రిటైర్మెంటు. 

ఆయన చేతి హస్తవాసి చాలా మంచిదని... కానీ బొత్తిగా లోకజ్ఞానంలేని మనిషని ఆయన్ని ఎరిగిన వాళ్ళు ఇట్టే చెప్పేస్తారు. సొంతడబ్బులతో జనాలకు వైద్యం చేసినందుకు... ఊర్లో ఉమ్మడి ఆస్తిలో ఆయన వాటాగా వచ్చిన ముప్పైఎనిమిది ఎకరాలు ఇప్పుడు నాలుగు ఎకరాలు అయ్యింది. 

ఆయన సొంత మేనమామ కూతురు అన్నపూర్ణమ్మ. ఆవిడ బడి గుమ్మం ఎక్కలేదు కానీ... పెద్దబాలశిక్ష మొత్తం బట్టీ పట్టేశారు పెళ్ళికి ముందే.

ఎనిమిదోయేడు ఆయనతో పెళ్ళైయి... మెట్టినింటికొచ్చారు. అప్పటికి ఆయనకు పన్నెండు.

ఇప్పటికి నలభైఆరు సంవత్సరాలు గడిచాయి ఆ చేయి పట్టుకుని.
                            *       *       *
ముందురోజు సీలేరులో మెడికల్ క్యాంపుకి వెళ్లిన శాస్త్రిగారు చంద్రుడు వచ్చే వేళకి వచ్చారు. మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

ఆ రాత్రి వరండాలో పక్క వేసి... ముందురోజే పాలు వాడకంపోసే వెంకడు చేత తెప్పించిపెట్టిన ముర్రుపాలతో చేసిన జున్ను తీసుకునివెళ్ళి ఆయనకు ఇచ్చారు. ఆయన పక్కన కూర్చుని కనకాంబరాలు మాల కడుతూ... ఏమైంది... ఈ రోజు అదోలా ఉన్నారు అని అడిగారు అన్నపూర్ణమ్మగారు.

ఏమని చెప్పేది... నిన్న మేం క్యాంపు చేసిన ఊరికి వాళ్ళు వచ్చారు. 

వాళ్ళు అంటే... 

అదే అన్నలు..

ఎవరికి అన్నలు...

నీ తలకాయ్. ఇన్నేళ్ళు వచ్చినా బుర్రలో గుజ్జు పెరగలేదు. అన్నలు అంటే నక్సలైట్లు. 

మిమ్మల్ని ఏమైనా అన్నారా....

లేదు.

మరింకేం... 

అలా అంటావేంటి. వాళ్ళని అంత దగ్గరగా చూసేసరికి భయం వేయదా?

మరేం చేశారు మీరు.

నేనేం చేస్తాను. ఏం చెయ్యలేదు.

అంటే వాళ్ళు ఏదో చేశారా...

అవును.

ఏం చేశారేంటి. మీ దగ్గరున్న పులిహోర చూసి ఆకలిగా ఉందని తినేశారా.

అవును...

సరే ఇంత తినేసి పోయింటారు. దానికి మీరెందుకు బాధపడటం. మీరు తింటాను అంటే రేపే చేసి పెడతాను.

నీ గోలే నీది కానీ... ఎదుటివాడి మాట వినవు కదా...

సరిగ్గా చెబితేనే కదా తెలిసేది.

తమ ఆనుపానులు చెబుతున్నారని ఇద్దరిని పట్టుకుని కొట్టారు.

ఆహా... మరి అలా ఎదుటివాళ్ళ రహస్యాలు బయటపెట్టడం తప్పే కదా. ఓ రెండు దెబ్బలు కొట్టి వదిలేసి ఉంటారు. అని అమాయకంగా అంటున్న ఆవిడ చేతిని దగ్గరకు తీసుకున్నారు ఆయన. ఆయన్ని హత్తుకుని ఒడిలో పడుకుండిపోయారు ఆవిడ ఇంకోమాట మాట్లాడకుండా.
                                *      *      *
వారంరోజులు తర్వాత... 

పేపర్లో దారకొండ దగ్గర మందుపాతర పెట్టి పోలీసు వాహనాన్ని పేల్చేసిన నక్సలైట్లు. నలుగురు పోలీసులకు గాయాలు అని వచ్చింది.
                                 *      *      *
దాడి జరిగిన రెండు రోజుల తర్వాత... పోలీసులు శాస్త్రిగారి ఇంటికి వచ్చి ఎదురుగా ఉన్న టేబిల్ మీద ఓ స్టీలు రేకు లాంటిది పెట్టారు.

అది చూసి అర్ధం కాలేదు అన్నట్లు చూశారు వచ్చిన పోలిసాఫీసరు వైపు ఆయన.

ఇది మొన్న నక్సలైట్లు మందుపాతర పెట్టడానికి వాడిన స్టీలు క్యారెజి. దీనిమీద అయ్యగారి పూర్ణయ్య సిద్ధాంతిగారి జ్ఞాపకార్ధం వారి అబ్బాయి అని ఉంది. అంటే మీరే కదా అనడంతో... 

పులిహోర క్యారెజీని వాళ్ళు మందుపాతరగా వాడినట్లు అర్ధమైన శాస్త్రిగారు... అవునని, కాదని బుర్ర ఊపి కూలబడిపోయారు. 

ఇదేమి పట్టని ఆ పోలిసాఫీసరు మీకు వాళ్ళకి ఏంటి సంబధం?
మీరు వాళ్ళకు సాయం చేస్తున్నారా?
ఎన్నాళ్లనుండి మీరు ఇలా వాళ్ళతో కలిసిపనిచేస్తున్నారు? అంటూ వరస ప్రశ్నలు గుప్పించేస్తున్నాడు.

అప్పటివరకు గుమ్మం అవతలే ఉండి అన్నీ వింటున్న అన్నపూర్ణమ్మగారు ఇవతలికి వచ్చి ప్లాస్టిక్ కవర్లో ఉన్న రేకుముక్కని చూసి... పోలిసాఫీసరుతో...

అవును నాయనా... ఇది మాదే. అంటే మా ఇంట్లోదే. మా మామ్మయ్యగారి సంవత్సరికానికి గుర్తుగా ఇచ్చిన వాటిల్లో అందరికీ పంచగా చివరాఖరుకి ఒకటి మిగిలితే మా మామ్మయ్యగారి గుర్తుగా మాతో తెచ్చుకున్నాము. బుజ్జిది పాతికేళ్ళపాటు మాతోనే ఉంది. 

హద్దు అదుపు లేకుండా ఆవిడ అలా చెప్పుకుంటూ పోతుంటే ఆ నక్సలైట్లు చేసిన పనికి తనని ఎక్కడ తీసుకునిపోతారో అని శాస్త్రిగారు భయపడుతూనే తనని ఆగమని చెబుతున్నా ఆవిడ ఆగడంలేదు.

ఒక్క క్షణం నాయనా ఇప్పుడే వస్తాను అంటూ... పెరట్లోకి వెళ్ళి ఠక ఠక నిమ్మకాయలు కోసి... పంచదార, ఉప్పు కలిపి లోటాతో ఇన్ని నిమ్మకాయనీళ్ళు తీసుకొచ్చారు తాగడానికి. 

ఆవిడ ఏం చేస్తోందో అర్ధంకాక... పోలిసాయన ఏం అడిగినా వంటింటి వైపు చూస్తూ... ఊ... ఊ... అంటూ ఉండిపోయారు శాస్త్రిగారు. 

పోలిసాయాన్ని ఇన్ని నీళ్ళు తాగించి... అవునూ... ఇంతకూ ఈ క్యారెజీ ఎక్కడ దొరికింది మీకు అని అడిగిన ఆవిడ వైపు కోపంగా చూస్తూ... అదేంటమ్మా ఇంటసేపూ చెప్పింది ఏదీ మీరు వినలేదా? మీ ఆయనకు నక్సలైట్లతో ఉన్న సంబంధం తెలుసుకోడానికి వచ్చాను అని అతను అంటుంటే...

తప్పుగా అనుకోకు నాయనా... మావారికి పెట్రోమాక్స్ లైట్లు తప్ప ఏ నక్సలైట్లు తెలీవు. ఇంకో విషయం ఏమిటంటే... ఓ పదిహేనురోజుల క్రితం ఓ ముష్టి వెధవ మా వీధిలోకి వచ్చి, పాత సామాన్లకు మాట్లు వేస్తాను అంటే... ఆ క్యారెజీ ఇచ్చాను. వాడేమో కాసేపు అటూ ఇటూ తిప్పి... దాహానికి మంచి నీళ్ళు అడిగితే నేను తీసుకుని వచ్చేలోపు ఆ క్యారెజీ తీసుకుని పోయాడు దొంగవెధవ. నేను అప్పుడే చెప్పాను ఈయనతో. పోయి కంప్లైంట్ ఇవ్వండి అని. ఈయనేమో పోతే పోనీలేవే కొత్తది కొనుకుందాం అంటూ బద్ధకించారు. వాడు ఎవడికి అమ్మేశాడో ఏంటో... మాకేం తెలుసు... ఇదిగో ఇప్పుడు ఆ ముక్క పట్టుకుని నువ్వు మా ఇంటికి వచ్చేసావు... అంటూ ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తున్న ఆవిడవైపు శాస్త్రిగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

అంటే ఈ క్యారెజీ మీ ఇంట్లోనుండి ఎవడో ముక్కూ మొహం తెలియనివాడు... దొంగతనం చేశాడు అంటున్నారా అని అడిగిన పోలిసాఫీసరుతో...

హమ్మయ్య నేను బాగానే చెప్పాను. నీకూ సరిగ్గానే అర్ధం అయ్యింది. నీ తల్లిదండ్రులు పుణ్యంకొద్దీ, నీ పెళ్ళాం పిల్లలు చేసుకున్న అదృష్టం... ఇంత తెలివైనవాడివి దొరికావు వాళ్ళకి అంటూ అతని మొహంచుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుచుకుంది. 

మీరేమైనా చెప్పేది ఉందా అని శాస్త్రిగారు వైపు చూసి... ఆయన ఏం చెప్పరని అర్ధం అయ్యి... వెళ్ళొస్తానని... అవసరం ఐతే ఒకసారి స్టేషనుకు వచ్చి రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుందని చెప్పి... అక్కడినుండి వెళ్ళిపోయాడు ఆ పోలిసాఫీసరు.
                            *      *      *
అతను వెళ్ళిపోయిన తర్వాత తన వైపే చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఆవిడ బుగ్గమీద చిన్నగా తట్టి... ఇన్ని తెలివితేటలు ఎక్కడివి అంటున్న ఆయన వైపు చూడకుండానే... 

ఉపాయం లేనోడిని ఊరు నుండి పంపేయాలి అన్నారు. మీరా పేరుకే డాక్టర్ కానీ... నోట్లోంచి మాటరాదని నాకు తెలియదా. అలాగే ఊరుకుంటే ఈపాటికి పోలీస్టేషన్ మెట్లు ఎక్కవలసి వచ్చేది అంటూ చెప్పుకుని పోతున్న ఆవిడని గట్టిగా హత్తుకుని అలాగే ఉండిపోయారు.

ఓరుగంటి శర్మ

కామెంట్‌లు లేవు: