హిమాలయాలలో ఘర్వాల్ జిల్లాలో ల్యాండ్స్ డౌన్ గ్రామానికి 12 మైళ్ళ దూరం లో 6500 అడుగుల ఎత్తులో దట్టమైన అరణ్య ప్రాంతం మధ్య తారకేశ్వర అనే చోట సుమారు 650 ఏళ్ళ నాటి చిన్న శివాలయం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తమకు పండిన పంటను ఈ శివుడికి నైవేద్యం పెట్ట కుండా తినరు. ఒక వేళ పొరబాటున అలాచేయకపోతే వాళ్ళ ఇల్లు కదులుతుంది...తన 14 వ ఏట ఈ ప్రదేశాన్ని గురించి విని స్వయంగా సంగతులు తెలుసుకోవాలనుకొన్నాడు స్వామి రామా. నడిచి అక్కడికి చేరుకున్నాడు అప్పటికే రాత్రి 7 అయింది. చీకట్లు అలముకున్నాయి. ఒక కొండ గుట్ట అంచున ఉన్నాడు. చేతిలో బాటరీ లైట్ కూడా లేదు, కాళ్లకు కర్ర చెప్పులు -పాంకోళ్ళు మాత్రమే ఉన్నాయి మంచు మీద అవి జారిపోతూ నడక చాలా ఇబ్బంది అయింది. నిలువైన కొండ అంచు నుంచి ఒక్కసారిగా జారిపోయాడు. ఇంతలో పొడవుగా తెల్లని వస్త్రాలతో పొడవైన తెల్లని గడ్డంతో ఉన్న ఒక ముసలాయన ఆపన్న హస్తాలు అందించి పైకి లాగి బయటకు చేర్చి కాలిబాట పట్టించి రామాతో "ఇది దివ్యధామం.రక్షిత ప్రదేశం. నేను నిన్ను నీ గమ్యానికి చేరుస్తానని” చెప్పి పది నిమిషాలలో బయట దీపం వెలుగుతున్న ఒక చిన్న కుటీరం దగ్గరకు తీసుకువెళ్ళాడు ఇద్దరూ కలిసి గుడిసె చుట్టూ ఉన్న రాతి గోడ దగ్గరకు వచ్చారు. స్వామి రామా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తనను తీసుకొచ్చిన ముసలాయన కనపడ లేదు.. ఆయనకోసం వెతుకుతూ పిలిచాడు. ఇంతలో గుడిసెలో ఉన్న ఒక సాధువు ఈ కేకలు విని బయటి కొచ్చి, తానుంటున్న గుడిసెలో తనతోపాటు ఉండమని ఆహ్వానించాడు. వెచ్చదనం కోసం లోపల మంట మండుతోంది.
రామా గుడిసెలో చేరి జరిగిన విషయం సాధువుకు తెలియ జేశాడు.సాధువు కన్నీరు కారుస్తూ "నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా !గొప్ప మహానుభావుని దర్శించగలిగావు .నేనెందుకు ఇక్కడ ఉంటున్నానో తెలుసా? ఏడేళ్ల క్రితం నేను కూడా నువ్వు జారిపోయిన ప్రదేశంలోనే రాత్రి 11 గంటలకు అంచునుండి జారిపోయాను. నీకు కనిపించిన మహానుభావుడే నన్నూ తన ఆపన్నహస్తాలు అందించి రక్షించి ఈ గుడిసెకు చేర్చాడు. మళ్ళీ ఆయన దర్శనం నాకు కాలేదు.ఆయనను నేను "సిద్ధ బాబా ”అని పిలుస్తాను. నిన్ను రక్షించిన చేతులే నన్నూ అప్పుడు రక్షించాయి” అన్నాడు గద్గద స్వరంతో.
మర్నాడు స్వామిరామా ఆ చుట్టు ప్రక్క ప్రదేశాలన్నీ గాలించి చూశాడు. తాను జారిన ప్రదేశం దగ్గర వెతికాడు. తాను జారిన పాదపు గుర్తులు మాత్రమే కనిపించి గుర్తించాడు. ముసలాయన పాద చిహ్నాలు లేవు. ఇది చాలా ప్రమాదకరమైన అంచు అని గ్రహించాడు అందుకే ఆ అదృశ్య మహాత్ముడు ఆపన్న హస్తాలు అందించి కాపాడుతున్నాడు అని అర్ధం చేసుకొన్నాడు స్వామిరామా. తాను బ్రతికి బయట పడటానికి ఆ సిద్ధబాబాయే కారణమని గ్రహించాడు. దగ్గరే ఉన్న ఊళ్లోకి వెళ్లి అక్కడున్న వారిని కలిసి తన అనుభవం చెప్పాడు. అక్కడి వారందరికీ తమ కుటుంబాలలో పిల్లా పెద్ద అందరినీ ప్రమాదాలనుంచి కాపాడేవాడు ఆ సిద్ధ బాబాయే అని తెలుసుకొన్నాడు. ఇక్కడ సాధువుతో తానున్న గుడిసె ప్రసిద్ధ శివాలయానికి 100 గజాల దూరంలో మాత్రమే ఉంది . శివాలయాన్ని దట్టమైన ఫర్ వృక్షాలమధ్య కొంత ప్రదేశం ఖాళీ చేసి కట్టారు. అందుకే ఇక్కడ అద్భుత ఆధ్యాత్మిక తరంగ ప్రసారం జరుగుతుందని ఊహించాడు. గ్రామస్తులను అడిగితె సిద్ధబాబా సుమారు 650 సంవత్సరాలక్రితం ఇక్కడ ఉండేవాడని నిరంతర మౌనంలో ఉన్నా ఇక్కడి ప్రజలను సన్మార్గం లో నడిపించేవాడని తెలిసింది. ఆయన సిద్ధి పొందాక ఆ ప్రదేశంలో ఆరు అడుగుల చతురంలో గుడికట్టారని, లోపల శివ లింగాన్ని ప్రతిష్టించారని, అప్పటి నుండి ప్రతి మూడు నెలలకోసారి ప్రజలు వచ్చి కృతజ్ఞత పూర్వకంగా దర్శించి సిద్ధబాబాను స్మరించి వెడతారని,ఆ సిద్ధ బాబాయే తన ప్రాణ రక్షకుడని రామా గ్రహించాడు. ఈ ఆలయం దగ్గరే ఒక గదిలో స్వామిరామా చాలా నెలలు ఉండి యోగ, ధ్యానాలు చేశాడు. స్వామి రామా అక్కడ నుండి వెళ్లి పోయాక కొన్నేళ్ళకు అక్కడి బ్రాహ్మణులు ఆలయం శిధిలమై పోతోంది కనుక శివాలయాన్ని ఇంకొంచెం పెద్దదిగా కడదామని ప్రయత్నం చేశారు..కూలీలు వచ్చి గుడిని పడగొట్టటానికి పలుగు పారలతో ప్రయత్నించారు. అడుగులోతు నుంచి చిన్న చిన్న పాములు అనేక రంగుల్లో కనిపించాయి. తవ్విన మట్టి తీసి పాముల్ని ఏరేసి మళ్ళీ తవ్వారు. లోతుకు వెళ్లిన కొద్దీ పాముల సంఖ్య పెరిగిందే కాని తగ్గలేదట. దగ్గర గ్రామంలోని ఒక ముసలామె రోజూ సాయంకాలం వచ్చి ఆలయంలో దీపం వెలిగించి, మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చి ఆర్పేస్తుందిట ఆమె ఇలా ఎన్నో ఏళ్లుగా భక్తితో చేస్తోందట. ఆమె రోజూ త్రవ్వేవారితో గుడిని కూల్చవద్దు, దాన్ని మార్చే ప్రయత్నం చేయద్దు అని గోల చేసేది. కొత్త గుడి కట్టటానికి ఏర్పాటు చేయబడిన ఇంజనీర్ ఆమె మాటలను పట్టించుకొనే వాడు కాదు. ఆరు రోజులు త్రవ్వాక పాములు అనంతంగా ఉన్నాయని గ్రహించి త్రవ్వకం ఆపేశారు. పోనీ శివలింగాన్ని త్రవ్వి పైకి తీద్దామని ప్రయత్నం చేశారట. 8 అడుగులు తవ్వారు. యెంత లోతుకు తవ్వినా దాని మూలం ఎక్కడుందో తెలియలేదట. కనుక పీకలేక తోక ఝాడించేశారు. ఒక రోజు రాత్రి ఇంజనీర్కు కలలో ఒక పొడవైన తెల్లగడ్డం ముసలి యోగి కనిపించి "ఈ శివలింగం అత్యంత మహిమాన్వితమైనది. దీన్ని కదిలించే ప్రయత్నం చేయద్దు. ఆలయాన్ని పెంచి కట్టే ప్రయత్నమూ చేయద్దు", అని చెప్పాడట. అంతే ఆ ప్రయత్నాలన్నీ ఆపేసి ఉన్న చిన్న గుడినే ఏ మాత్రమూ మార్చకుండా రిపేర్ చేసి లెంపలు వాయించుకొన్నారట. అందమైన ప్రకృతి మధ్య విలసిల్లిన వెలసిల్లిన ఆరు శతాబ్దాల మహిమాన్విత శివాలయం అది. దానికే తారకేశ్వరాలయమనీ పేరు. ఇక్కడే శివుడు తారకాసురుని సంహరించాడని ఐతిహ్యం. దీనికి శివసిద్ధ క్షేత్రమనీ పేరు కూడా ఉంది. తరువాత కాలంలో తాండవ శివ విగ్రహ ప్రతిష్ట చేసి వసతులేర్పాటు చేసి ధర్మశాల కట్టించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి