20, జులై 2020, సోమవారం

కేనోపనిషత్తులో ఒక కథ ఉన్నది.

అదేమిటంటే- ''ఒకసారి దేవదానవులక ఒక గొప్ప యుద్ధం జరిగింది. అందులో అదృష్టవశాత్తు చివరకు దేవతలకు విజయం లభించింది. అపుడు దేవతలంతా కలిసి ఒకవిజయోత్సవం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్నవారు గర్వంతో ఆత్మస్తుతి, పరనింద ప్రారంభించారు. ''అహం'' తలకెక్కింది. ఇది గమనించిన పరాశక్తి, జ్ఞానోదయం కలుగడానికి విజయోత్సవం జరిగేచోట బ్రహ్మండమంతా వ్యాపించిన ఒక పెద్దజ్యోతిరూపంలో ప్రత్యక్షమయింది. దానికే ఉపనిషత్తులో ''యక్షరూపం'' అని పేరు పెట్టబడింది. దానిని చూసిన దేవతలంతా ఒక్క క్షణం ఆశ్చర్య చకితులయ్యారు. ఉత్తరక్షణంలో అంతా సమావేశ##మై, తమకంటే అతిరిక్తమైన శక్తి మంతులు లేరనే అహంకారంతో తమ ప్రతినిధిగా అగ్నిని ఆ జ్యోతివిషయం తెలుసుకు రమ్మని పంపారు.

అగ్ని మహాగర్వంతో జ్యోతి సమీపానికి వెళ్ళాడు. అపుడు దానినుంచి ''నీ వెవరు? అనే శబ్దం వినిపించింది. దానికి సమాధానంగా అగ్ని ''నన్ను జాతవేదుడు'' అంటారు. ''ప్రపంచంలోనున్న ఏవస్తువునైనా దహించివేసే శక్తి నాకున్న'' దని చెప్పాడు. అపుడు ఆ జ్యోతి ఒక తృణం అతని ముందు పెట్టి, దానిని దహించమని చెప్పింది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు. కాని దానిని దహించలేక విఫలుడయ్యాడు. ఆ అవమానంతో దేవతలవద్దకు తిరిగి వెళ్ళి, అహంనశింపగా జరిగింది వారితో చెప్పాడు.

అది విన్న దేవతలు మరింద అహంకారంతో ఈసారి వాయువును ఉపయోగించారు. వాయువు వెళ్ళాడు, వాయువుకు కూడా ''నీవెవరు?''-అనే ప్రశ్న వినిపించింది. అపుడు వాయువు నన్ను ''మాతలి'' అంటారు. సర్వప్రాణులకు ఆధారభూతుణ్ణి, ''ఏ వస్తువునైనా క్షణంలో స్థానభ్రంశం కల్గించగలను'' అని చెప్పాడు, వెంటనే ఆ జ్యోతి అతనికి కూడ ఒక తృణం ఇచ్చి, దానిని ఎగురగొట్టమని చెప్పింది. వాయువు కూడా తనయావచ్ఛక్తిని వినియోగపరచి, దానిని కదల్చలేక నిర్విణ్ణు డయి పశ్చాత్తాపంతో వెనకకు తిరిగి వచ్చాడు.

అగ్ని, వాయువు-ఇద్దరూ అశక్తులవడంతో, దేవతలంతా భయభ్రాంతు లయ్యారు. అపుడు ఇంద్రుడు ఆ జ్యోతిని సమీపించి, హృదయపూర్వక వందనం చేసి ''నీవెవరవో తెలియ జేయవలసింది''-అని ప్రార్థించాడు. అపుడు ఆజ్యోతినుండి దివ్యమైన తేజస్సుతోను, రూపంతోను కూడిన ''పరాశక్తి'' ఆవిర్భవించింది.

ఆ పరాశక్తియే ఇంద్రునికి బ్రహ్మోపదేశం గావించింది. తర్వాత మిగిలిన దేవతలకు జ్ఞానోదయం గల్గి, తమకు విజయం ఈశ్వరసంకల్ప వల్లనే కలిగిందని తెలుసుకున్నారు

కామెంట్‌లు లేవు: