20, జులై 2020, సోమవారం

*సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*సప్తమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*గృహస్థులకై మోక్ష ధర్మముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

*15.50 (ఏబదియవ శ్లోకము)*

*ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః|*

*అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః|6295॥*

*15.51 (ఏబది ఒకటవ శ్లోకము)*

*అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః|*

*ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే॥6296॥*

ఈ విధముగ ప్రవృత్తిపరాయణుడగు వ్యక్తి చనిపోయిన పిదప, చరు-పురోడాశాది యజ్ఞ సంబంధమైన ద్రవ్యములయొక్క సూక్ష్మభాగముచే నిర్మితమైన శరీరమును ధరించి ధూమాభిమాన దేవతలకడకు చేరుకొనును. పిమ్మట క్రమముగా రాత్రి, కృష్ణ పక్షము, దక్షిణాయనముల అభిమాన దేవతల వద్దకు వెళ్ళి, చంద్రలోకమునకు చేరును. అతని పుణ్యకార్యఫలమును అనుభవించిన పిమ్మట, అమావాస్య చంద్రునివలె క్షీణమై వర్షము ద్వారా క్రమముగ ఓషధులు, లతలు, అన్నము, వీర్యము యొక్క రూపములలో మార్పుచెంది, పితృయాన మార్గము  ద్వారా మరల ఈ జగత్తున జన్మించును.

*15.52 (ఏబది రెండవ శ్లోకము)*

*నిషేకాదిశ్మశానాంతైః సంస్కారైః సంస్కృతో ద్విజః|*

*ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి॥6297॥*

ఇప్పుడు నివృత్తిమార్గ పరాయణులను గూర్చి వివరింపబడును-- ధర్మరాజా! గర్భాధానమునుండి అంత్యేష్టివరకుగల సంస్కారము లన్నింటిని చక్కగా జరుపబడినవాడు *ద్విజుడు* అనబడును. నివృత్తిపరాయణులగు సాధకులు జ్ఞానజ్యోతితో ప్రకాశించెడు ఇంద్రియములయందు సమస్తకర్మలనెడు యజ్ఞములను హవనము చేయుదురు. అనగా వారిద్వారా చేయబడిన ఇష్టా-పూర్తములనెడు సమస్తకర్మలు భగవత్ప్రీత్యర్థముగా జరుగును.

*15.53 (ఏబది మూడవ శ్లోకము)*

*ఇంద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః|*

*వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్|*

*ఓంకారం బిందౌ నాదే తం తం తు ప్రాణే మహత్యముమ్॥6298॥*

ఇంద్రియముల సంకల్పవికల్పములను మనస్సునందు హవనము చేయుదురు. వికారములను పొందు మనస్సును మౌనమును వహించి వాక్కునందు హవనము చేసెదరు. వాక్కును అక్షరసముదాయము నందు హవనము చేయుదురు. ఇట్టి  అక్షరసముదాయమును ఓంకారమునందు హోమము చేయుదురు. ఓంకారమును, బిందువునందు, బిందువును నాదమునందు హవనము చేయుదురు. నాదమును సమిష్టిప్రాణమునందు అనగా సూత్రాత్మ - హిరణ్యగర్భుని యందు హవనము చేయుదురు. ఈ సూత్రాత్మను చిట్టచివరగా పరబ్రహ్మలో విలీనము చేయవలెను.

*15.54 (ఏబది నాలుగవ శ్లోకము)*

*అగ్నిః సూర్యో దివా ప్రాహ్ణః శుక్లో రాకోత్తరం స్వరాట్|*

*విశ్వశ్చ తైజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్॥6299॥*

ఇట్టి నివృత్తిపరాయణుడగు యోగి క్రమముగా అగ్ని అభిమానియగు దేవతద్వారా సూర్యుని అభిమాన దేవతను చేరి, తదుపరి పగటి దేవతను చేరును. అచటినుండి ప్రాతఃకాల అభిమాన దేవతను తర్వాత, శుక్లపక్ష అభిమాన దేవతను చేరును. పిమ్మట పూర్ణిమ అభిమాన దేవతను చేరుకుని ఉత్తరాయణ కాలాభిమాని దేవతద్వారా బ్రహ్మలోకమును చేరుకొనును. విశ్వ-తైజస-ప్రాజ్ఞులనగా జాగ్రత్ - స్వప్న - సుషుప్తి అను మూడు అవస్థలు జీవునియందు కలుగును. ఈ మూడింటికి సాక్షిగా ఉండునది ఆత్మ ఒక్కటే. ఈ మూడు అవస్థలు జీవునికి ఉపాధిగత శరీరములు అనబడును. అతడు ఈ మూడు అవస్థలను దాటి, తన సాక్షియగు ఆత్మసత్తాయందు ఐక్యమగును.

*15.55 (ఏబది ఐదవ శ్లోకము)*

*దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః|*

*ఆత్మయాజ్యుపశాంతాత్మా హ్యాత్మస్థో న నివర్తతే॥6300॥*

దీనిని దేవయాన మార్గమందురు. ఈ మార్గము ద్వారా వెళ్ళునట్టి ఆత్మోపాసకుడు సంసారము నుండి నివృత్తుడై క్రమముగ ఒక దేవతనుండి మరియొక దేవత కడకు వెళ్ళుచు బ్రహ్మలోకమును జేరును. అచట తన స్వరూపమునందు స్థితుడగును. ప్రవృత్తి మార్గమును అనుసరించు వానివలె అతడు మరల జనన మరణ చక్రములో పరిభ్రమింపడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి సప్తమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: