కొవిడ్ విస్తృతంగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్ సడలింపులు, ప్రజల రాకపోకలు, వ్యాపార లావాదేవీలు మొదలవడంతో.. గత నెల రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇళ్లూ, కార్యాలయాలు, మార్కెట్లూ.. ఒక్కచోటని కాదు ఎక్కడ్నించి ఎవరి ద్వారా వైరస్ ముప్పు పొంచి ఉందోనన్న భయాందోళనలు వెన్నాడుతున్నాయి. దీంతో వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు. అవగాహనతో ధైర్యంగా ఉంటే కరోనాను సగం జయించినట్లే. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాల ప్రకారం.. ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్‌లు, స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఇంట్లో ఉండి కోలుకున్నారు. కోలుకుంటున్నారు. అయినా కొన్ని ప్రశ్నలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చినా స్వల్ప లక్షణాలున్నవారు, అసలు లక్షణాలు లేనివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పని ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటి? ఒకవేళ ఇంట్లో, ఆఫీసుల్లో సన్నిహితుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఏం చేయాలి? అసలు ఎవరు పరీక్షలు చేయించుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలి?
ఇలా ప్రజలను నిరంతరం వెన్నాడుతున్న ఎన్నో సందేహాలు ఎన్నో. అలాంటి వాటిని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు ముందు ఉంచింది ‘ఈనాడు’.
కొవిడ్ అనేది ఒక వైరస్ ఇన్‌ఫెక్షన్. దీని జీవితకాలం వారం, రెండు వారాలే. ఆ తర్వాత క్రమేణా శరీరంలో దాని ప్రభావం తగ్గిపోతుంది. వైరస్ సోకినవారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. కరోనా సోకినా.. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్ సోకి తగ్గిపోవచ్చు కూడా. కొంత కాలం తర్వాత శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే లక్షణాలు కనిపించడం, కొంత తీవ్రత పెరగడం వంటివి చూస్తున్నాం. ఇందులోనూ కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. అందుకే అవగాహనతో ధైర్యంగా ఉంటే సగం కరోనాని జయించినట్లే. కొవిడ్ కొత్త జబ్బు కాబట్టి దీని గురించి శాస్త్రపరమైన అవగాహన కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
కరోనా బాధితులు 5 రకాలు
1. లక్షణాలు లేనివారు(ఎసింప్టమేటిక్) 2. అతి స్వల్ప, స్వల్ప లక్షణాలున్నవారు(మైల్డ్)
3. మధ్యస్థ లక్షణాలున్నవారు(మోడరేట్) 4. తీవ్ర లక్షణాలున్నవారు(సివియర్)
5. పరిస్థితి విషమించినవారు(క్రిటికల్)
వీరిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, పరిస్థితి విషమించినవారిని, మధ్యస్థ లక్షణాలున్నవారిని కూడా ఎలాగూ ఆసుపత్రిలోనే చేర్చి, చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇక ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న మిగిలిన రెండు రకాల లక్షణాలున్నవారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి? ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటే పాటించాల్సిన విధి విధానాలేమిటి?మళ్లీ పరీక్షలు చేయించుకోవాలా? అనేవి ముఖ్యమైన అంశాలు.
లక్షణాలు లేనివారు
* పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. కానీ వీరిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.
* ఆరోగ్యంగా ఉన్నవారు, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు దీని గురించి ఏమాత్రం కంగారు పడొద్దు.
* వీరికి ప్రత్యేకమైన మందులేవీ అవసరం లేదు.
* సమయానికి పడుకోవడం, సరిగా భోజనం చేయడం, కంగారు పడకుండా ఉండడం వంటివి చేస్తే చాలు.
* ఒకవేళ వీరిలో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, 60 ఏళ్ల పైబడినవారుంటే.. వారి ఆరోగ్యం బాగానే ఉంది.. ఇంట్లోనే ఉండొచ్చని వైద్యులు ధ్రువీకరించాలి.
* హెచ్‌ఐవీ, క్యాన్సర్, అవయవమార్పిడి, శస్త్రచికిత్సలు జరిగినవారిలో లక్షణాలు లేకపోయినా వారు ఆస్పత్రుల్లోనే ఉండాలి.
* వీరు 10 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత కూడా రోగ లక్షణాలను గమనిస్తూ మరో 7 రోజులు ఇంటి పట్టునే ఉండాలి.
అతి స్వల్ప, స్వల్ప లక్షణాలున్నవారు
* సాధారణంగా వైరస్ వచ్చిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ కరోనాలో మాత్రం లక్షణాలు రాకముందు నుంచే వ్యాప్తికి అవకాశాలున్నాయి.
* జ్వరం, దగ్గు వంటి లక్షణాలు రావడానికి 2, 3 రోజుల ముందు నుంచి కూడా.. వీరి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అయితే ఎంత ఎక్కువగా, తీవ్రంగా ఉంటుందో ఇంకా తేలలేదు.
* వీరిలో జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువగా ఉంటుంది.
* అప్పుడప్పుడూ పొడి దగ్గు ఉంటుంది.
* కొద్దిగా గొంతునొప్పి కూడా ఉండొచ్చు.
* ఆక్సిజన్ స్థాయి రక్తంలో 95 అంతకంటే ఎక్కువ శాతం ఉంటుంది.
* ఆయాసం ఏమీ ఉండదు. వీరిని కూడా 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంచాలి. మరో 7 రోజులు ఇంటినుంచి బయటకు రావద్దు.
మధ్యస్థ లక్షణాలున్నవారు
* వీరిలో జ్వరం 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటుంది.
* తరచూ పొడి దగ్గు, గొంతునొప్పి ఉంటాయి.
* ముఖ్యంగా వీరి రక్తంలో ఆక్సిజన్ శాతం 90-94 శాతం ఉంటుంది.
* ఊపిరి పీల్చడం, విడవడం నిమిషానికి 24-30 మధ్యలో ఉంటుంది.
* వీరు ఆసుపత్రిలో ఆక్సిజన్ సాయంతో వైద్యసేవలు పొందాల్సి ఉంటుంది.
* వీరితో పాటు తీవ్ర లక్షణాలు, విషమంగా ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్పించాలి.
ఎవరికి పరీక్షలు?
కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. కొందరు తమలో లక్షణాలు లేకపోయినా కూడా కరోనా ఉందేమోనన్న అనుమానంతో పరీక్షల కోసం వరుసల్లో నిలబడుతున్నారు. ఆఫీసుల్లో, అపార్టుమెంటుల్లో ఒకరికి వస్తే.. అందులో పనిచేసేవారు, అక్కడుంటున్నవారు అందరూ పరీక్షించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. నిజానికి పరీక్షలు ఎవరికి అవసరం?
* జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలున్నవారికి
* తీవ్ర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి
* గత రెండు వారాల్లో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తికి దగ్గరగా మెలిగి, లక్షణాలు గుర్తిస్తే.. * ఆరోగ్య కార్యకర్తల్లో లక్షణాలుంటే...
* పాజిటివ్ వ్యక్తి కుటుంబంలో లక్షణాలు కనిపించకపోయినా.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు.. తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులుంటే వారు పరీక్షలు చేయించుకోవాలి.
ఎందుకు కొవిడ్ ప్రమాదం
కొవిడ్ వైరస్ సాధారణంగా శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి, తేలికపాటి గొంతునొప్పి నుంచి జ్వరం వంటి సమస్యలనే తెచ్చిపెడుతుంది. చాలామందిలో తేలికగానే తగ్గిపోతుంది కూడా. కొంత మందిలో ఇది న్యుమోనియాకు దారి తీస్తోంది. కానీ అతి కొద్దిమందిలో మాత్రం.. వైరస్ తగ్గినా.. అది రాజేసిన నిప్పురవ్వతో శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) ప్రక్రియ మొదలవుతోంది. ఈ సమయంలో మనలోని రోగనిరోధక వ్యవస్థ కొంత అతిగా స్పందించి సైటోకైన్స్ వంటి ఎన్నో రసాయనాలను ఉద్ధృతంగా విడుదల చేస్తోంది. దీన్నే ‘సైటోకైన్ స్టార్మ్’ అంటున్నారు. ఈ మార్పుల వల్ల రక్తనాళాల్లోపల అతి సున్నితంగా, మృదువుగా ఉండే ‘ఎండోథీలియం’ పొర దెబ్బతినటం (వాస్క్యులోపతి) కూడా ఆరంభమవ్వొచ్చు. ఈ దుష్పరిణామాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీంతో శరీరంలోని కీలక అవయవాలకు కూడా రక్తం, దాని ద్వారా అందాల్సిన ఆక్సిజన్, రసాయనాలు, పోషకాల వంటివి అందకుండా పోతాయి. ఇలా పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు..
* అస్సలు ఆందోళనకు గురికావద్దు. భయాందోళనలతో రోగ నిరోధకత శక్తి తగ్గుతుంది.
* మనసు ప్రశాంతంగా ఉంచే అంశాలపై దృష్టిపెట్టాలి.
* నచ్చిన పుస్తకాలు చదువుకోవాలి.
* ఎక్కువగా కొవిడ్ వార్తలు టీవీలో చూడొద్దు. అందులో మరణాల గురించి దృశ్యాలు చూస్తే అనవసర ఆందోళనలు కలుగుతాయి.
* సంగీతం వినండి. నచ్చినవారితో వీడియో కాల్స్‌లో మాట్లాడాలి.
* రోజూ బీపీ, జ్వరం, రక్తంలో ఆక్సిజన్ ఎంతుంది? ఆయాసం వస్తోందా? కళ్లు తిరుగుతున్నాయా? ఇలాంటివి పరీక్షించుకోవాలి.
* జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలున్నప్పుడు నిత్యం మూడు పూటలా ఆవిరి పట్టాలి.
* రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను తీసుకోవాలి.
పాజిటివ్ వచ్చిన వారిలో 10 రోజుల తర్వాత లక్షణాలేమీ లేకపోతే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.
ఇంట్లో జాగ్రత్తలు
* ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం కొవిడ్ బాధితుడు ఇంట్లోనే విడి గదిలో ఉండాలి.
* ఎన్ 95 మాస్క్ ధరించనక్కర్లేదు. సర్జికల్ మాస్క్ మాత్రం ధరించాలి.
* గదిలో గాలి, వెలుతురు బాగా ఉండాలి. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వీరికి విడి బాత్‌రూమ్ ఉండాలి.
* వీరు వాడే పాత్రలు, వస్తువులు, దుస్తులు ఇతరులు వాడొద్దు.
* ఒక శాతం సోడియం హైపోక్లోరేట్ ద్రావణంతో శుభ్రపర్చుకోవాలి.
* కొవిడ్ వ్యక్తికి ఆహారాన్ని అందించేవారు, సహాయకులు కూడా మాస్క్‌లు ధరించాలి.
* పాజిటివ్ వ్యక్తితో కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.
* మరగబెట్టి చల్లార్చిన నీరును తగినంతగా తాగాలి.
* ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉండాలి.
* రోగి వాడిన మాస్క్, ఇతరత్రా వస్తువులను కాల్చి వేయాలి.
* వాడిన వస్తువులను వేయడానికి.. మూసివేయడానికి అవకాశమున్న డస్ట్‌బిన్‌ను వాడాలి.
* 40-60 సెకన్ల పాటు చేతులను కడుక్కోవాలి. అనంతరం చేతులను వస్త్రంతో తుడుచుకోకుండా వాటంతట అవే ఆరిపోయేలా గాల్లో ఉంచాలి.
శుభ్రపర్చేవారు కూడా మాస్క్ ధరించాలి.
పాజిటివ్ వ్యక్తి వినియోగించిన దుప్పట్లు, దుస్తులను 30 నిమిషాల పాటు వేన్నీళ్లలో ముంచి ఉంచాలి. తర్వాత మామూలుగా ఉతుక్కోవచ్చు.
ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి?
* జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవడం.. వణికిపోవడం
* దగ్గు ఆగకుండా వస్తుండటం, క్రమేణా ఎక్కువ కావడం
* నీరసం పెరిగి నిస్సత్తువ ఆవహించడం (వీరిలో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి)
* ఆయాసం ఎక్కువవడం..సాధారణంగా నిమిషానికి 14-18 సార్లు ఊపిరితీసుకుంటాం. కానీ ఊపిరి తీసుకునే క్రమం నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువైనప్పుడు..
* రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైతే
* పెదాలు, ముఖం నీలిరంగులోకి మారిపోయినప్పుడు
* అపస్మారక స్థితి, అయోమయానికి గురైనప్పుడు * ఛాతీలో ఇబ్బందిగా ఉన్నప్పుడు
లక్షణాలుంటే చికిత్స
* పారాసెటమాల్ ప్రతి ఆరు గంటలకోసారి వేసుకోవాలి. ఇంకా ముందుగానే జ్వరం వస్తే ప్రతి నాలుగు గంటలకోసారి కూడా వేసుకోవచ్చు.
* వైద్యుల సూచనల మేరకు యాంటీబయాటిక్స్, విటమిన్ సి, డి, జింక్ మాత్రలు వాడాలి.
* విటమిన్ మాత్రల వల్ల కరోనా తగ్గదు. కానీ వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం.. హైరిస్క్ ఉన్నవారికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు ప్రస్తుతం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఔషధానికి బదులుగా కొత్తగా వచ్చిన యాంటీ వైరల్ ఔషధం ‘ఫావిపిరావిర్’ను వైద్యులు వాడుతున్నారు.
ఇంట్లో ఉండాల్సినవి.. వాడాల్సినవి..
* డిజిటల్ థర్మామీటర్ లేదా ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్
* పారాసెటమాల్ మాత్రలు 650 మి.గ్రా. రోజుకు 4-6 సార్లు
* యాంటీ బయాటిక్స్.. అజిథ్రోమైసిన్ 500మి.గ్రా. రోజుకు ఒకటి.. లేదా డాక్సిసైక్లిన్ 100 మి.గ్రా. రోజుకు రెండుసార్లు
* జింక్ మాత్ర రోజుకు ఒకటి.
* విటమిన్ సి 500 మి.గ్రా. రోజుకు రెండు
* విటమిన్ డి మాత్ర (60వేల యూనిట్లు) వారానికి ఒకటి.
కార్యాలయాల్లో ఎలా?
కొవిడ్‌తో పాటు సహజీవనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటప్పుడు ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే. కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఇలాంటప్పుడు కొవిడ్ బారిన పడకుండా... ఆందోళన చెందకుండా ఎవరికి వారు స్వీయ రక్షణ పొందడమే చాలా కీలకం.
ముప్పు లేకపోతే యథావిధిగా విధులు
* ఒక గది, ప్రాంతంలో ఒకరు కంటే ఎక్కువమంది ఉన్నచోట ఒకరిలో కరోనా సోకితే.. పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని క్వారంటైన్‌లో ఉంచాలి.
* ఆ ప్రాంతాన్ని వైరస్ రహితంగా(డిస్‌ఇన్‌ఫెక్షన్) చేసి, తిరిగి ఆ ప్రాంతాన్ని వినియోగించుకోవచ్చు. మొత్తం భవనాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు.
* లక్షణాలు రావడానికి 2 రోజుల ముందు నుంచి ఎవరెవరిని కలిశారో.. అప్పట్నించి ఐసొలేషన్‌కు వెళ్లే వరకూ ఎవరెవరి దగ్గరకు వెళ్లారో.. వారందరూ కాంటాక్టు వ్యక్తుల కిందకే వస్తారు. వీరందరూ క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
* దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడంతో పాటు పరీక్షలు చేయించుకోవాలి.
* ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్యవంతులు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. అయితే వీరిలో 14 రోజుల పాటు లక్షణాలను పరిశీలిస్తుండాలి.
* 65 ఏళ్లు పైబడినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బు, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు ఇంటి వద్ద ఉండడమే మేలు. వారికి ఇంటి వద్ద నుంచి పనిచేయడానికి అనుమతించాలి.
* కార్యాలయంలో ఎక్కువమంది(15కు పైగా)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మాత్రం ఉద్ధృతంగా నివారణ చర్యలు చేపట్టాలి. ఆ భవనం మొత్తం 48 గంటల పాటు మూసేసి, సమగ్రంగా వైరస్ రహితంగా చేయాల్సి ఉంటుంది.
* అప్పటి వరకూ సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలి.
* కంటెయిన్‌మెంటు ప్రాంతాల్లో నివసించే ఉద్యోగి ఇంటి వద్ద నుంచే పనిచేయడానికి అనుమతించాలి.
గుంపులుగా ఉండొద్దు
* కార్యాలయాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. పనిప్రదేశాల్లో గుంపులుగా ఉండొద్దు.
* మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి.
* కనీసం 40-60 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో అయితే 20 సెకన్ల పాటు శుభ్రపర్చుకోవాలి.
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలులేనివారిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించాలి.
* ఉద్యోగులందరు ఒకే సమయంలో భోజనాలు చేయకుండా వేళలను మార్చాలి.
* కార్యాలయాల్లో క్రమం తప్పకుండా వైరస్ రహిత ప్రక్రియను నిర్వహించాలి.
వాట్సాప్ నుండి సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి