20, జులై 2020, సోమవారం

తన కోపమే తన శత్రువు.


       చాలామంది చిన్న విషయానికే కోపాన్ని పూనుతుంటారు. ఇక కోపం వస్తే అంతే నోటికి వచ్చినట్లు చీవాట్లను పెడుతుంటారు. కొందరు కోపాన్నికూడి అసలు మాట్లాడటమే మానేస్తారు. కోపాన్ని దిగమ్రింగలేనివారు కోపంలో తెలియకుండానే అనరాని మాటలనుకూడా ప్రేలుతారు.  ఎదుటి వ్యక్తి గురువుఐనా చూడక తిట్టేస్తుంటారు. కోపంవలన వారు తలపెట్టిన కార్యం భoగంమవ్వటమే గాకుండా అందరికీ వారు  దూరమవ్వుతారు. కోపం తగ్గాక క్షమాపణ కోరినా ఫలితముండదు. కొందరు కోపంలో వస్తువులను విసిరి గిరాటువేయటం చూస్తుంటాము. కోపము అన్నిటిని నాశనం చేస్తుంది. అయినవారినుండి దూరం చేస్తుంది. 
తనకోపమే తన శత్రువు అని పెద్దలు తెలిపారు. 
       ఆంజనేయస్వామివారు కూడా ఒక సమయంలో కోపాన్ని పూనుతారు. ఆ విషయం గురించి తెలుసుకొందాం.
        సీతాన్వేషణ నిమిత్తం లంకకు వెళ్లిన శ్రీ హనుమంతుడు తనకు సుగ్రీవునిచే అప్ప చెప్పిన కార్యము 
అనగా సీతాదేవి జాడ నెరపటం పూర్తిచేసి రావణ హృదయాన్ని తెలుసుకోవటం కొరకు  సీతా దేవి ఆశీనురాలైన శింశుపావృక్షం జోలికి పోకుండా అశోకవనంలోని మిగతా అన్ని  వృక్షాలనన్నిటిని నేలమట్టం చేస్తారు. ఇంకా ఆంజనేయుని పట్టుటకు బయలుదేరి వచ్చిన మూడువంతుల రావణుని సైన్యాన్ని,  దళపతులను చితకబాది వారెల్లరికీ 
మృత్యులోకానికి దారి జూపినారు 
శ్రీ హనుమ. రావణునికి నేరుగా హితవు దెల్పుట కొరకు  బ్రహ్మాస్త్రబంధితుడై రావణుని  కొలువునకు చేరి నిర్భయంగా నేరుగా ధీటుగా రావణునకు పరదారాపహరణ చేసినందులకు పట్టబోవు గతిని గూర్చి వివరించి సీతామాతను నామె పతిచెంత  జేర్చి,  శ్రీ రామచంద్రుని శరణుగోరమని తెలుపుతారు. ఆంజనేయుని హితపదములకు 
కోపమును పూనిన దశకంఠుడు ఆంజనేయుని వాలానికి అగ్నిని రగొల్పమని శాసిస్తాడు. 
        రావణానుచరులు శ్రీ హనుమంతుని పరాభవించుటకుగాను ఆంజనేయుని పొడుగైన వాలమునకు గుడ్డ పేలికలుజుట్టి, నూనెనతడిపి వాలాగ్రమున అగ్నిని రగొల్పుతారు. 
       తన తోకచివ్వర అగ్ని భగ,  భగమని మండటాన్ని గమనించిన  వాయుపుత్రుండైన శ్రీ హనుమంతుడు కోపమునుపూని తన వాలాగ్నితో లంకాపురినెల్ల అగ్నికి ఆహుతిచేస్తాడు. 
        అగ్నికి మండి భస్మము అగుచున్న లంకాపురితట్టునకు తిరిగి చూచిన సమీరతనయునికి(శ్రీ హనుమంతునికి) అప్పుడు జ్ఞప్తికివచ్చింది, లంకనగల సీతా సాధ్వికూడా నే రాగోల్పిన అగ్ని శిఖల కాలిప్రాణములు వీడెనని. 
        సీతాదేవి అగ్నినపడి ప్రాణములను గోల్పోయివుండునని తలచిన శ్రీ హనుమంతుడు నే కస్టపడి నెరపిన సీతాన్వేషణ కార్యము అంతయూ బూడిదన పోసిన పన్నీరాయెనే అని తలచి ఎక్కి ఎక్కి ఏడుస్తారు. నేను ఏ విధముగా కిష్కింధకు తిరిగి వెళ్ళగలను, నా వారలకు నా మోము నే నెట్లు జూపగలనని పలుమార్లు పలుకుకుంటూ ధారాపాతంగా కన్నీరుని వీడుతూ. అయ్యో! నాకు కల్గిన కోపముతో లంకనంతటిని దహింప చేసితినే. నా మాతను మంటల పాల్జేసితినే అకటా ఇప్పుడు నే నేమి చేతునని పరి పరి విధాల విల విల లాడుతారు శ్రీ హనుమంతుడు.
        చూచారా కోపమును  పూనుట వలన అంతా నష్టమేగా. బుద్ధిని కల్గి కోపమును అణచుకొన్న జీవి ధన్యుడు అని శ్రీ హనుమ తలుస్తారు. 
         పై విషయమునిబట్టి కోపమును కూడరాదని తెలుస్తున్నదిగదా. 
      మరి ఊరికే వచ్చే కోపాన్ని పోగొట్టుకోవాలంటే ఏమి చేయాలోకూడా రామాయణంలో చిన్న చిట్కా వున్నది. అదేమిటో తెలుసుకుందాము.
        శ్రీ హనుమంతుని వాలానికి నిప్పు పెట్టు చున్నారను వార్తనివిన్న మైధిలమ్మ (సీతాదేవి ) దుఃఖించి  ఆంజనేయుని తోకననున్న  అగ్ని చల్లగానుంచమని అగ్నిహోత్రుని ఉపాసిస్తుంది. ఆమె కోరిన తడవునే అగ్నిహోత్రుడు శీతలవాయువులతో సీతా దేవి చుట్టూ తిరుగుతూ ఆమె కోరినట్లగునని ఆమెకు తెలపటం జరుగుతుంది.
       జగన్మాత అగు సీతాదేవి అగ్నిహోత్రుని ఉపాసించిన   శ్లోకాలు శ్రీమద్రామాయణం లోని పంచమ కాండమగు సుందరకాండములో గలవు. 
ఈ శ్లోకాల  పఠనంవలన సత్వరమే  మానవుడు కోపమును త్యజించి ప్రశాంతతనొందగలడు.
       మరి కోపం తరచుగా బాగా వస్తున్న వారు పైన నే తెల్పిన శ్లోకాలను శ్రర్ధగా,  భక్తిగా పఠించి ప్రయత్నించి చూడండి తప్పకుండా  ప్రశాంతత వారికి చేకూరుతుంది.

=============================

కామెంట్‌లు లేవు: